నగరి కోర్టుకు కేజే కుమార్
నగరి : చంద్రగిరి ఎంఎల్ఎ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వరుస కేసులతో వెంటాడిన పోలీసులు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌పై దృష్టి పెట్టారు. ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ దాఖలైన కేసులో ఈయన్ను మూడు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి సత్యవేడు సబ్‌జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసులు పాత కేసు తిరగదోడారు. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును తెరమీదకు తెచ్చారు. ఈ కేసు విచారణకు సంబంధించి కేజే కుమార్‌ను శుక్రవారం పీటీవారెంట్‌పై పోలీసులు నగరి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకువచ్చారు.
ఈ నెల 26 వరకు రిమాండ్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేసినట్లు సీఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. మళ్లీ ఆయనను సత్యవేడు సబ్ జైలుకు తరలిస్తామన్నారు. కోర్టుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజేకుమార్ను చూడడానికి ఆయన సతీమణి చైర్పర్సన్ కే.శాంతి, కుటుంబసభ్యులతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. పోలీసు వ్యాన్ నుంచి దిగిన భర్తను చూసి చైర్పర్సన్ కె.శాంతి కన్నీరు పెట్టుకున్నారు.