Nagol-Mettuguda
-
మెట్రోలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రయాణం
సాక్షి, హైదరాబాద్ : సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభం కానున్న మెట్రో రైలులో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా, పలువురు మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో ఎఒండీ ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. అన్నిరకాల ట్రాన్స్పోర్ట్ సర్వీసులు, నగదు చెల్లింపులు జరిగేలా త్వరలోనే స్మార్ట్ కార్డు అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు మెట్రో తుది దశ పనులను తెలంగాణ ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందనరావు పర్యవేక్షించారు. తుది దశ పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాని ప్రారంభించే మియాపూర్ మెట్రో పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
మంత్రులు, ఎమ్మెల్యేల మెట్రో రైడ్...
-
మెట్రో తొలిదశ పై డైలమా..!
వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ కోసం నిరీక్షణ భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు తెలిపిన సీఎం.. సిటీబ్యూరో: నగరంలో మెట్రో ప్రాజెక్టు తొలిదశ (నాగోల్-మెట్టుగూడ 8 కి.మీ మారం)ప్రారంభోత్సవ తేదీపై సందిగ్ధం నెలకొంది. ముందుగా అనుకున్నట్టుగా మార్చి 21న ప్రారంభించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు మంగళవారం తనను సచివాలయంలో కలిసిన భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు సీఎం కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇదే విషయమై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. నాగోలు-మెట్టుగూడ మార్గంలో పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లు నిరంతరాయంగా పరుగులు పెట్టడానికి, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అధికారికంగా భద్రతా ధ్రువీకరణ రావాల్సి ఉందన్నారు. ఇటీవలే పూణేలోని రైల్వే డిజైన్స్ అండ్ స్టాండర్ట్స్ అర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఉప్పల్ మెట్రో డిపోలోని 8 మెట్రో రైళ్లకు 18 రకాల ప్రయోగ పరీక్షలు చేశామని, అన్నింటిలోను మెట్రో రైళ్లు సఫలమయ్యాయన్నారు. ఆర్డీఎస్వో జారీచేసిన రిపోర్టుతో పాటు ఇతర కీలక పత్రాలను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీకి ఇటీవలే నివేదించామన్నారు. వారు జారీ చేసే ధ్రువీకరణతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలను అధికారికంగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నగరంలో మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో చేపట్టిన పనులను పరిపాలన సౌలభ్యం కోసమే ఆరు దశలుగా విభజించామన్నారు. అంతేతప్ప అదే తేదీల్లో ఆయా రూట్లలో మెట్రో రైళ్లను విధిగా నడపాలన్న నిబంధనకు చట్టబద్ద తేదీ లేదని, 2011లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందం (కన్సేషన్ అగ్రిమెంట్)లోనూ అదే తేదీల్లో విధిగా రైళ్ల రాకపోకలను ప్రారంభించాలన్న నిబంధన విధించలేదన్నారు. మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు మెట్రో మార్గం పూర్తయితేనే ఈ రూట్లో అత్యధిక మంది మెట్రో రైళ్లను ఉపయోగించుకుంటారని గాడ్గిల్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ విషయమై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పనిచేస్తామని స్పష్టంచేశారు. పాతనగరంలో ఆలస్యంగా మెట్రో పరుగులు.. మెట్రో రైళ్లు పాసైన సాంకేతిక పరీక్షలివే.. పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు, ఎలివేటెడ్ మార్గంలో పరుగులు, పట్టాల సామర్ధ్యం, ప్రొఫెల్షన్ సిస్టం, రైలు బ్రేకులు, సీసీ టీవీలు, హెడ్ లైట్ల పనితీరు, శబ్దం, కూత, కుదుపులు, కమ్యునికేషన్ వ్యవస్థ, రైలు పరుగులో గమనం తీరు, ప్రయాణీకులకు సమాచారం అందించే వ్యవస్థ, కంప్రెసర్,రైలు ఆగినపుడు,పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్‌గా మూసుకొని, తెరుచుకునే డోర్ల పనితీరు. రైలులో వెంటిలేషన్, ఎయిర్ కండిషన్ వ్యవస్థల పనితీరు, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థ పని చేసే విధానం, ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనితీరు, సిగ్నలింగ్, ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టం, విశ్వసనీయత, సానుకూలత, నిర్వహణ సామర్థ్యం, భద్రతకు సంబంధించిన ఇతర పరీక్షలు. -
జనవరిలో మెట్రో ట్రయల్ రన్!
సీఎస్ సమీక్షలో నిర్ణయం సిటీబ్యూరో: నగరవాసులకు నూతన సంవత్సర కానుకగా నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో రైలు ట్రయల్ రన్‌ను జనవరిలోనే నిర్వహించాలని ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సేఫ్టీ సర్టిఫికెట్ (భద్రత)జారీ చేసిన అనంతరమే ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మెట్రో పనులు చేపట్టేందుకు వీలుగా 283 ఆస్తుల సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని సీఎస్జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇందులో సగానికిపైగా ఆస్తులను సేకరించి, బాధితులకు పరిహారం అందజేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు. కాగా ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడా (8 కి.మీ.) మార్గంలో నిత్యం 8 మెట్రో రైళ్లకు 18 రకాల ప్రయోగపరీక్షలు(టెస్ట్న్)్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదే మార్గంలో మార్చి 21,2015 (ఉగాది) రోజున మెట్రో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మెట్రో సొబగులు చూతము రారండి
సాక్షి, సిటీ బ్యూరో: మెట్రో ప్రాజెక్టులో ప్రతి అంశమూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగోల్-మెట్టుగూడ రూట్లో రూపుదిద్దుకుంటున్న నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లతో పాటు, ఉప్పల్ మెట్రో డిపో చూపరులను కట్టిపడేస్తోంది. ఆ విశేషాలు చూస్తే... స్టేషన్ ఇలా ఉంటుంది... స్టేషన్‌ను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది స్ట్రీట్ లెవల్, రెండోది మధ్యభాగం (కాన్కోర్స్), మూడోది ప్లాట్ఫారం, మధ్యభాగంలోనే ప్రయాణికులకు కావాల్సిన షాపింగ్ మాల్స్, ఫుడ్‌కోర్టులు ఉంటాయి. స్టేషన్ మధ్యభాగం (కాన్కోర్స్లో) పెయిడ్, అన్‌పెయిడ్ ఏరియాలు వేర్వేరుగా విభజిస్తారు. పెయిడ్ ఏరియాలోకి ప్రవేశించిన తరవాత అక్కడి నుంచి 22 అడుగుల ఎత్తునున్న ప్లాట్‌ఫారంపైకి నేరుగా చేరుకునేందుకు 4 చోట్ల మెట్లు, రెండు లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు ఇరువైపులా ఉంటాయి. మెట్రో రైలు స్టేషన్ పొడవు 140 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. స్టేషన్లోకి చేరుకునేందుకు రోడ్డుకు ఇరువైపులా రెండు చోట్ల మెట్లు, ఒక ఎస్కలేటరు, ఒక లిఫ్టు ఉంటాయి. ప్రతి స్టేషన్ ను 228 ప్రీకాస్ట్ సెగ్మెంట్లతో నిర్మిస్తారు. కాంక్రీటు నిర్మాణం 5 వేల క్యూబిక్ మీటర్లు ఉంటుంది. స్టేషన్ నిర్మాణంలో బైండింగ్ స్టీలు 60 వేల మీటర్లు (సుమారు 60 కి.మీ) వినియోగించారు. ఇతర నిర్మాణాలకు స్టీలు వినియోగం: 230 మెట్రిక్ టన్నులు. స్టేషన్ పైకప్పు (రూఫ్షీటింగ్): 35 వేల చదరపు అడుగులు. ప్రతి స్టేషన్లో ఫ్లోరింగ్: 50 వేల చదరపు అడుగులు. స్టేషన్లో ఫుడ్‌కోర్టులు, షాపింగ్, వాణిజ్య కేంద్రాల నిడివి: స్టేషన్ స్థాయిని బట్టి 10 వేల నుంచి 37 వేల చదరపు అడుగుల్లో ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం: 1.30 లక్షల లీటర్లు. స్టేషన్ లోపల విద్యుత్, సిగ్నలింగ్, టెలికాం విభాగాలకు సంబంధించి 40 కి.మీ మేర కేబుల్ వ్యవస్థ ఉంటుంది. ప్లాట్ఫారం వెడల్పు: 21 అడుగులు. ఉప్పల్ డిపో ప్రత్యేకతలివీ.. ట్రాక్పొడవు: 11 కి.మీ ప్రస్తుతం ఈ డిపోలో ఉన్న రైళ్లు: ఏడు (ఒక్కో రైలుకు 3 భోగీలు) డిపో నిర్మాణానికి వినియోగించిన మట్టి: 60 వేల ట్రక్కులు. ప్రహరీ: మూడు కిలోమీటర్లు. వినియోగించిన కాంక్రీటు: 65 వేల క్యూబిక్ మీటర్లు వాడిన స్టీలు: 1200 మెట్రిక్ టన్నులు పైకప్పునకు: 1.90 లక్షల చదరపు అడుగుల మేర రూఫ్షీటింగ్. డ్రైనేజ్ వ్యవస్థ నిడివి: 35 కి.మీ. అంతర్గత రహదారులు: 5 కి.మీ. భారీ క్రేన్లు: 6 టర్న్‌టేబుల్స్ (ఒక దిశ నుంచి మరో దిశకు రైలు కోచ్ మారేందుకు): 7 మొత్తం కంట్రోల్ ఇక్కడి నుంచే.. మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో మార్గాన్ని కమ్యునికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం, డ్రైవర్ లెస్ టెక్నాలజీ ఆధారంగా నిర్వహించనున్నారు. ప్రతి రైలులో డ్రైవర్ ఉన్నప్పటికీ ఆయన పని కేవలం స్టేషన్లో 20 సెకన్ల పాటు రైలు ఆగినపుడు డోర్లు తెరుచుకునే, మూసుకునే బటన్ నొక్కడమే. ఇందుకోసం ఉప్పల్ మెట్రో డిపో ప్రాంగణంలో అత్యాధునిక ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ను 1.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక్కడి నుంచే ఏ మార్గంలో రైలు ఏ స్పీడులో వెళుతుందో... రైలు ఎక్కడ ఉందో ఇట్టే కంప్యూటర్ తెరపై వీక్షించవచ్చు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మన మెట్రో ప్రస్థానం.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ విశేషాలపై విశ్వవ్యాప్తంగా పేరొందిన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ‘కనెక్టింగ్ ది సిటీ ఆఫ్ నిజాం’పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 19న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనుందని ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి.