ఎట్టకేలకు...
- శాసన మండలికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అర్జునుడు ఎంపిక
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాగుల్ మీరా
సాక్షి, విజయవాడ : తెలుగుదేశంలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగుల్‌మీరాలను పదవులు వరించాయి. బచ్చుల అర్జునుడును శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ)గా ఎంపిక చేయగా, నాగుల్ మీరాను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్ణయం తీసుకున్నారు.
బచ్చులకు ఎమ్మెల్సీ.....
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు గతంలోనే ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డారు. అయితే ఆయనకు బదులు బీసీ కోటాలో బుద్దా వెంకన్నకు అవకాశం ఇచ్చారు. దాంతో అప్పట్లోనే ఆయన కినుక వహించినా ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుని గా బచ్చులకు గుర్తింపు ఉంది.
నాగుల్‌మీరా.....
పశ్చిమ నియోజకవర్గం నుంచి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ వారికి పశ్చిమ నియోజకవర్గం కేటాయించసాగింది. 2014లో చివరి నిమిషం వరకు నాగుల్మీరానే పశ్చిమ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ దక్కించుకుంది. టికెట్ రాకపోయినా నాగుల్‌మీరా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అంతా భావించారు. అయితే సమీకరణల్లో భాగంగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది.
జిల్లా నుంచి పలువురు ప్రాతినిధ్యం
కృష్ణాజిల్లా నుంచి పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే వివిధ హోదాల్లో ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్నలు ఉండగా, టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జగ్గయ్యపేటకు చెందిన తొండెపు దశరధజనార్దన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ మహిళా కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పామర్రుకు చెందిన వర్ల రామయ్య హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రామానుజయ ఉన్నారు. వీరు కాక, తాజాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాగుల్‌మీరాకు ఇచ్చారు.
జయ‘మంగళం’.....
కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అయితే ఆయనను పక్కన పెట్టారు. కనీసం కార్పొరేషన్ lపదవి కూడా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతంలో వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు.
నామినేషన్ దాఖలు..
మచిలీపట్నం : ఎమ్మెల్సీ పదవికి బచ్చుల అర్జునుడు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అంబటి బ్రాహ్మణయ్యకు అనుంగశిష్యుడిగా ఆయన పేరొందారు. బందరుకోట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్‌గా 2000 నుంచి 2005 వరకు పనిచేశారు. 2014 ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ దాదాపు బచ్చులకు ఖరారైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేప«థ్యంలో ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బచ్చుల ఎంపికవుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆయనకు పదవి రాలేదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మంత్రి దేవినేని ఉమాకు నమ్మకస్తుడిగా ఉన్న బచ్చులకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.