
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయవాడ ఈస్ట్, వెస్ట్ నేతలకు సరైన గౌరవం దక్కలేదు. సమావేశం స్టేజ్ మీద తన ఫొటో లేకపోవడంతో బుద్ధా వెంకన్న తన అసంతృప్తిని వెళ్లగక్కారు. స్టేజ్‌కు మీదకు రావాల్సిందిగా కొల్లు రవీంద్ర బుద్దాని ఆహ్వానించినా అందుకు ఆయన నిరాకరించారు.
అనంతరం సమావేశం నుంచి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వెళ్లిపోయారు. ఆ సమయంలో వర్ల రామయ్య బుద్దాను ఆపేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ సమావేశంలోనే గద్దె రామ్మోహన్‌ను కూడా స్టేజ్ మీదకు ఆహ్వానించలేదంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.