విద్వేష ప్రసంగాలపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
విద్వేష ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. జకీర్ నాయక్ ప్రసంగాల అంశం తీవ్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తన ప్రసంగంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక బోధనల వల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని, ఇలాంటి తీవ్రవాద సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు యువత సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేవారిని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకునేవారిని కూడా ఖండించాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావించారు. యూనివర్సిటీ ఆఫ్ నైరోబిలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, విద్వేషాలు లేని ప్రపంచం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు సురక్షితంగా, భద్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉగ్రవాదం పీచమణిచే శక్తి యువతకే ఉంటుందని ఆయన అన్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా నిలకడగా పోరాడాలని, అదే సమయంలో దేశవాసుల భద్రతను కూడా మర్చిపోకూడదని తెలిపారు.