జేఎన్‌యూ విద్యార్థి జాడ ఇంకా తెలియలేదా?
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్‌ను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేకపోయారని, అతడి జాడను కనుక్కోలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై పోలీసులు చెప్పిన సమాధానంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 22లోగా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తూ ఈ కేసు విచారణను అప్పటి వరకు వాయిదా వేసింది.
అదే సందర్భంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. విద్యార్థి ఎన్నికలకు సంబంధించి అహ్మద్ ఉంటున్న గది వద్దకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు అతడితో గొడవకు దిగారని, దాడి చేశారని అప్పటి నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు పోలీసులు కనుక్కోలేకపోయారని అతడి తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేశారు.