Nala Pudikatita
-
నాలా పనులకు ఆస్తుల సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే వర్షాకాలంలోగా వరదముప్పు సమస్యల పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్ఎంసీకి ఆస్తుల సేకరణ సవాల్‌గా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంపు ముప్పు తగ్గించేందుకు రూ.900 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిల్లో వీలైనన్ని పనుల్ని ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. నాలాల విస్తరణ, ఆధునికీకరణ, బాక్స్ డ్రెయిన్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 కోట్ల మేర పనులు పూర్తి చేయాలంటే 350కిపైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఆస్తులు కోల్పోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలంటే వందల కోట్లు కావాలి. ► జీహెచ్ఎంసీ ఖజానాపై ఆస్తుల సేకరణల భారం పడకుండా ఉండేందుకు ఎస్సార్డీపీ ఫ్లైఓవర్లు, లింక్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రాంతాల్లో ఆస్తుల సేకరణకు టీడీఆర్‌ను వినియోగించుకున్నారు. ఆస్తులు కోల్పోయే బాధితులకు తగిన విధంగా నచ్చచెబుతూ టీడీఆర్‌తో ఎక్కువ ప్రయోజనముంటుందని వివరించడం ద్వారా చాలా వరకు వారిని ఒప్పించగలిగారు. అలా వివిధ పనులకు చాలా ఆస్తులు సేకరించారు. ► ఇప్పుడు నాలాల పనులకు సైతం అదే విధానానికి సిద్ధమయ్యారు. కానీ.. పనులు వేసవిలోగానే పూర్తి చేయాల్సి ఉన్నందున ఎక్కువ సమయం లేకపోవడంతో వీలైనంత త్వరితగతిన సేకరించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మే నెలలోపే పనులు పూర్తిచేయాల్సి ఉన్నందున వీలైనన్ని ఆస్తులు సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ అవసరం లేని, ఇతరత్రా ఆటంకాలు లేని ప్రాంతాల్లో పనుల వేగం పెంచారు. ఆస్తుల సేకరణ అవసరమైన చోట బాధితులు టీడీఆర్‌కు ఒప్పుకోకపోతే , నగదుగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే జీహెచ్ఎంసీ ఖజానాపై పెను ప్రభావం చూపనుంది. పనుల్లో కొన్ని.. ► బైరామల్‌గూడ జంక్షన్ నుంచి చెరువు వరకు బాక్స్ డ్రెయిన్ పనులకు సంబంధించి మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. పల్లె చెరువు నుంచి అలీనగర్ వరకు ముర్కి నాలా ఆధునికీకరణకు సంబంధించి రెండు ఆస్తులు, ఇదే నాలాకు సంబంధించి ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ నుంచి నిమ్రా కాలనీ వరకు లింక్ లేని ప్రాంతాల్లో పనులకు మరో మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. ► పాతబస్తీలో చోటా బ్రిడ్జి నుంచి తలాబ్ కట్ట బ్రిడ్జి వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం చేయాలంటే 36 ఆస్తులు సేకరించాల్సి ఉండగా, మెజారిటీ ఆస్తు లు సేకరించినప్పటికీ, మరో అయిదారు ఆస్తులు సేకరించాల్సి ఉంది. కిషన్‌బాగ్ నాలాకు సంబంధించి దాదాపు 25 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ► సన్నీ గార్డెన్ నుంచి శివాజీ నగర్ వరకు ముర్కి నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వందకు పైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో చేయాల్సిన పనులకు 65 ఆస్తులకు పై గా సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఆస్తుల్ని సేకరించాల్సి ఉంది. టీడీఆర్‌తో ప్రయోజనాలు.. ► అమలులో ఉన్న భూసేకరణ చట్టం మేరకు ఆస్తులు కోల్పోయేవారికి వారు కోల్పోయే భూమి/ఆస్తుల మార్కెట్ విలువకు 200 శాతం నగదు చెల్లించాలి. అదే టీడీఆర్ రూపేణా అయితే కోల్పోయే భూమికి 400 శాతం మేర విస్తీర్ణంతో నిర్మాణాలు చేసేందుకు అనుమతిస్తారు. అలా ఆస్తిహక్కు బదలాయింపు కోసం ఇచ్చే పత్రాలే టీడీఆర్ సర్టిఫికెట్లు. వాటిని పొందిన వారు స్వయంగా వాడుకోవచ్చు లేదా ఇతరులకు విక్రయించుకోవచ్చు. ► టీడీఆర్ హక్కులున్నవారి వివరాలు ఆన్లైన్లో అందుబాటులోకి ఉండటంతో వాటిని అమ్ముకోవాలనుకునేవారికి, కొనుక్కోవాలనుకునే వారికీ మార్గం సుగమమైంది. హక్కుల బదలాయింపు కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. నిర్మాణ అనుమతులకు సంబంధించి సెట్‌బ్యాక్స్‌లో కొన్ని మినహాయింపులున్నాయి. అదనపు అంతస్తు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. (క్లిక్: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం) -
‘పూడికతీత’పై పోలీస్ నజర్!
⇒అవినీతి అధికారులపై చర్యలకు సిద్ధం ⇒‘గ్రేటర్’ ఫిర్యాదులతో సీసీఎస్‌లో ఆరు కేసులు నమోదు ⇒అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై లోతుగా దర్యాప్తు ⇒ఇప్పటికే కొందరు బాధ్యుల్ని గుర్తించిన పోలీసులు సిటీబ్యూరో: నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్‌పై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ‘గ్రేటర్’ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం ఆరు కేసుల్ని నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారుల్లో కొందరిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. సెంట్రల్ జోన్ కేంద్రంగా జరిగి, రూ.1.1 కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఈ స్కామ్ దర్యాప్తు డీసీపీ అవినాష్ మహంతి పర్యవేక్షణలో జరుగుతోంది. ఏటా వర్షాకాలానికి దాదాపు ఆరు నెలల ముందు నుంచే జీహెచ్ఎంసీ నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభిస్తుంది. వరదనీటితో నాలాలు పొంగిపొర్లకుండా, వాటి పరిసర ప్రాంతాలకు ముంపు సమస్య లేకుండా చేయడానికి ఈ చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో కొన్నేళ్ళుగా అవినీతి జరుగుతోందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో కొన్ని కీలక నిబంధనలు మార్చారు. ఎంత మేరకు పూడికతీశారో పక్కాగా తూకం వేసి ఆ మొత్తాన్నే కాంట్రాక్టర్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల అండతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు దీన్నీ తమకు అనువుగా మార్చేసుకుని భారీ దోపిడీకి తెరలేపారు. నాలాల నుంచి తీసిన పూడికను లారీల ద్వారా జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. అలా తీసుకువెళ్ళే సమయంలో వేబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేయించి కచ్చితంగా బిల్లు తీసుకోవాల్సిందే. ఆ బిల్లుల్లో ఏ లారీ ద్వారా పూడికను తరలిస్తున్నారో దాని నెంబర్ నమోదు చేయాలి. జీహెచ్ఎంసీ అధికారులతో కుమ్మక్కైన కాంట్రాక్టర్లు ఇక్కడే తమ తెలివితేటలు ప్రదర్శించారు. తరలించని పూడికకు లారీ నెంబర్లు ఎందుకులే అనుకున్నారో ఏమో గానీ... వేబ్రిడ్జ్ బిల్లుల్లో ‘వాహనాలను మార్చేశారు’. వడ్డించేది తమ వారే కదా అనే ఉద్దేశంతో అడ్డగోలుగా నకిలీ బిల్లులు సృష్టించేశారు. వాటిలో లారీ నెంబర్లు ఉండాల్సిన చోట బైక్స్, ఆటోలు, కార్ల నెంబర్లను పొందుపరిచి తయారు చేశారు. గత నెల్లో ఈ బిల్లుల్ని అధికారులకు సమర్పించిన కాంట్రాక్టర్లు ఏకంగా రూ.1.1 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఈ బిల్లుల్ని పరిశీలిస్తున్న సమయంలో ఆడిట్ అధికారులకు అనుమానం వచ్చింది. వాటిపై ఉన్న వాహనాల నెంబర్లను వెరిఫై చేయగా... అవి లారీలవి కాదని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు చెందినవిగా వెలుగులోకి వచ్చింది. దీంతో వారు విషయాన్ని బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా అంతర్గత విచారణ ప్రారంభమైంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టకూడదని జనార్థన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ‘గ్రేటర్’ అధికారులు శనివారం నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు ‘తరలింపు వ్యవహారాలకు’ సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీహెచ్ఎంసీ నుంచి కొన్ని రికార్డులు సేకరిస్తున్న అధికారులు ఇప్పటికే బాధ్యులపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టులు ప్రారంభించాలని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. ఈ తరహా స్కామ్‌లు గతంలోనూ అనేకం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన వ్యవహారానికి సంబంధించే తాము ఆరు కేసులు నమోదు చేశామని జీహెచ్ఎంసీకి చెందిన విభాగాలు పాత కుంభకోణాలకు గుర్తించి ఫిర్యాదు చేస్తే వాటినీ దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.