నాలా పనులకు ఆస్తుల సేకరణ | Hyderabad: Acquisition of Assets For Drainage Works in GHMC | Sakshi
Sakshi News home page

నాలా పనులకు ఆస్తుల సేకరణ

Published Sat, Apr 16 2022 8:02 PM | Last Updated on Sat, Apr 16 2022 8:04 PM

Hyderabad: Acquisition of Assets For Drainage Works in GHMC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే వర్షాకాలంలోగా వరదముప్పు సమస్యల పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్‌ఎంసీకి ఆస్తుల సేకరణ సవాల్‌గా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంపు  ముప్పు తగ్గించేందుకు రూ.900 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిల్లో వీలైనన్ని పనుల్ని ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. నాలాల విస్తరణ, ఆధునికీకరణ, బాక్స్‌ డ్రెయిన్లు, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 కోట్ల మేర పనులు పూర్తి చేయాలంటే 350కిపైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఆస్తులు కోల్పోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలంటే వందల కోట్లు కావాలి.  

► జీహెచ్‌ఎంసీ ఖజానాపై ఆస్తుల సేకరణల భారం పడకుండా ఉండేందుకు ఎస్సార్‌డీపీ ఫ్లైఓవర్లు, లింక్‌ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రాంతాల్లో ఆస్తుల సేకరణకు టీడీఆర్‌ను వినియోగించుకున్నారు. ఆస్తులు కోల్పోయే బాధితులకు తగిన విధంగా నచ్చచెబుతూ టీడీఆర్‌తో ఎక్కువ ప్రయోజనముంటుందని వివరించడం ద్వారా చాలా వరకు వారిని ఒప్పించగలిగారు. అలా వివిధ పనులకు చాలా ఆస్తులు సేకరించారు. 

► ఇప్పుడు నాలాల పనులకు సైతం అదే విధానానికి  సిద్ధమయ్యారు. కానీ.. పనులు వేసవిలోగానే పూర్తి  చేయాల్సి ఉన్నందున ఎక్కువ సమయం లేకపోవడంతో వీలైనంత త్వరితగతిన సేకరించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మే నెలలోపే  పనులు పూర్తిచేయాల్సి ఉన్నందున వీలైనన్ని ఆస్తులు సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ అవసరం లేని, ఇతరత్రా ఆటంకాలు లేని ప్రాంతాల్లో పనుల వేగం పెంచారు. ఆస్తుల సేకరణ అవసరమైన చోట   బాధితులు టీడీఆర్‌కు ఒప్పుకోకపోతే , నగదుగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే  జీహెచ్‌ఎంసీ ఖజానాపై పెను ప్రభావం చూపనుంది.  

పనుల్లో కొన్ని.. 
► బైరామల్‌గూడ జంక్షన్‌ నుంచి చెరువు వరకు బాక్స్‌ డ్రెయిన్‌ పనులకు సంబంధించి మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. పల్లె చెరువు నుంచి అలీనగర్‌ వరకు ముర్కి నాలా ఆధునికీకరణకు సంబంధించి రెండు ఆస్తులు, ఇదే నాలాకు సంబంధించి ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌ నుంచి నిమ్రా కాలనీ వరకు లింక్‌ లేని ప్రాంతాల్లో పనులకు మరో మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది.  

► పాతబస్తీలో చోటా బ్రిడ్జి నుంచి తలాబ్‌ కట్ట బ్రిడ్జి వరకు రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం చేయాలంటే 36 ఆస్తులు సేకరించాల్సి ఉండగా, మెజారిటీ ఆస్తు లు సేకరించినప్పటికీ, మరో అయిదారు ఆస్తులు సేకరించాల్సి ఉంది. కిషన్‌బాగ్‌ నాలాకు సంబంధించి దాదాపు 25 ఆస్తులు సేకరించాల్సి ఉంది.   

► సన్నీ గార్డెన్‌ నుంచి శివాజీ నగర్‌ వరకు ముర్కి నాలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి వందకు పైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలో చేయాల్సిన పనులకు 65 ఆస్తులకు పై గా సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఆస్తుల్ని సేకరించాల్సి ఉంది.  

టీడీఆర్‌తో ప్రయోజనాలు.. 
► అమలులో ఉన్న  భూసేకరణ చట్టం మేరకు ఆస్తులు కోల్పోయేవారికి వారు  కోల్పోయే భూమి/ఆస్తుల మార్కెట్‌ విలువకు 200 శాతం నగదు చెల్లించాలి. అదే టీడీఆర్‌ రూపేణా అయితే కోల్పోయే భూమికి 400 శాతం మేర  విస్తీర్ణంతో నిర్మాణాలు చేసేందుకు అనుమతిస్తారు. అలా ఆస్తిహక్కు బదలాయింపు కోసం ఇచ్చే పత్రాలే టీడీఆర్‌ సర్టిఫికెట్లు. వాటిని పొందిన వారు స్వయంగా వాడుకోవచ్చు లేదా ఇతరులకు విక్రయించుకోవచ్చు.  

► టీడీఆర్‌ హక్కులున్నవారి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉండటంతో వాటిని  అమ్ముకోవాలనుకునేవారికి, కొనుక్కోవాలనుకునే వారికీ మార్గం సుగమమైంది.  హక్కుల బదలాయింపు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. నిర్మాణ అనుమతులకు సంబంధించి సెట్‌బ్యాక్స్‌లో కొన్ని మినహాయింపులున్నాయి. అదనపు అంతస్తు నిర్మించుకునే వెసులుబాటు  ఉంటుంది.  (క్లిక్‌: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement