‘పూడికతీత’పై పోలీస్‌ నజర్‌! | Prepare to action on corrupt officials | Sakshi
Sakshi News home page

‘పూడికతీత’పై పోలీస్‌ నజర్‌!

Published Mon, Apr 17 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

‘పూడికతీత’పై పోలీస్‌ నజర్‌!

‘పూడికతీత’పై పోలీస్‌ నజర్‌!

అవినీతి అధికారులపై  చర్యలకు సిద్ధం
‘గ్రేటర్‌’ ఫిర్యాదులతో సీసీఎస్‌లో ఆరు కేసులు నమోదు
అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై లోతుగా దర్యాప్తు
ఇప్పటికే కొందరు బాధ్యుల్ని గుర్తించిన పోలీసులు


సిటీబ్యూరో: నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్‌ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్‌పై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ‘గ్రేటర్‌’ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం ఆరు కేసుల్ని నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారుల్లో కొందరిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. సెంట్రల్‌ జోన్‌ కేంద్రంగా జరిగి, రూ.1.1 కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌ దర్యాప్తు డీసీపీ అవినాష్‌ మహంతి పర్యవేక్షణలో జరుగుతోంది. ఏటా వర్షాకాలానికి దాదాపు ఆరు నెలల ముందు నుంచే జీహెచ్‌ఎంసీ నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభిస్తుంది.

వరదనీటితో నాలాలు పొంగిపొర్లకుండా, వాటి పరిసర ప్రాంతాలకు ముంపు సమస్య లేకుండా చేయడానికి ఈ చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో కొన్నేళ్ళుగా అవినీతి జరుగుతోందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో కొన్ని కీలక నిబంధనలు మార్చారు. ఎంత మేరకు పూడికతీశారో పక్కాగా తూకం వేసి ఆ మొత్తాన్నే కాంట్రాక్టర్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల అండతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు దీన్నీ తమకు అనువుగా మార్చేసుకుని భారీ దోపిడీకి తెరలేపారు. నాలాల నుంచి తీసిన పూడికను లారీల ద్వారా జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. అలా తీసుకువెళ్ళే సమయంలో వేబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేయించి కచ్చితంగా బిల్లు తీసుకోవాల్సిందే.

ఆ బిల్లుల్లో ఏ లారీ ద్వారా పూడికను తరలిస్తున్నారో దాని నెంబర్‌ నమోదు చేయాలి. జీహెచ్‌ఎంసీ అధికారులతో కుమ్మక్కైన కాంట్రాక్టర్లు ఇక్కడే తమ తెలివితేటలు ప్రదర్శించారు. తరలించని పూడికకు లారీ నెంబర్లు ఎందుకులే అనుకున్నారో ఏమో గానీ... వేబ్రిడ్జ్‌ బిల్లుల్లో ‘వాహనాలను మార్చేశారు’. వడ్డించేది తమ వారే కదా అనే ఉద్దేశంతో అడ్డగోలుగా నకిలీ బిల్లులు సృష్టించేశారు. వాటిలో లారీ నెంబర్లు ఉండాల్సిన చోట బైక్స్, ఆటోలు, కార్ల నెంబర్లను పొందుపరిచి తయారు చేశారు. గత నెల్లో ఈ బిల్లుల్ని అధికారులకు సమర్పించిన కాంట్రాక్టర్లు ఏకంగా రూ.1.1 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఈ బిల్లుల్ని పరిశీలిస్తున్న సమయంలో ఆడిట్‌ అధికారులకు అనుమానం వచ్చింది. వాటిపై ఉన్న వాహనాల నెంబర్లను వెరిఫై చేయగా... అవి లారీలవి కాదని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు చెందినవిగా వెలుగులోకి వచ్చింది. దీంతో వారు విషయాన్ని బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్థన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా అంతర్గత విచారణ ప్రారంభమైంది.

ఈ కుంభకోణానికి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టకూడదని జనార్థన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ‘గ్రేటర్‌’ అధికారులు శనివారం నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు ‘తరలింపు వ్యవహారాలకు’ సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ నుంచి కొన్ని రికార్డులు సేకరిస్తున్న అధికారులు ఇప్పటికే బాధ్యులపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టులు ప్రారంభించాలని సీసీఎస్‌ అధికారులు నిర్ణయించారు. ఈ తరహా స్కామ్‌లు గతంలోనూ అనేకం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన వ్యవహారానికి సంబంధించే తాము ఆరు కేసులు నమోదు చేశామని జీహెచ్‌ఎంసీకి చెందిన విభాగాలు పాత కుంభకోణాలకు గుర్తించి ఫిర్యాదు చేస్తే వాటినీ దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement