nalamasa krishna
-
సుప్రీంకోర్టు వైఖరి అభినందనీయం
దేశద్రోహ చట్టంగా పేరుపడ్డ ఐపీసీ సెక్షన్ 124ఎ అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు నిచ్చింది. ఈ తీర్పు పట్ల ఒక హైకోర్టు న్యాయవాది గానూ, దేశద్రోహం కేసులో నిందితుడిగానూ ఉన్న నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. దేశద్రోహ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాలు తెచ్చాయి. దురదృష్టవశాత్తూ ఈ చట్టాలు రెండింటినీ దగ్గరగా పరిశీలిస్తే వాటి స్వరూప, స్వభావాలు ఒకేలా ఉంటాయి. వాటి వినియోగ లక్ష్యం కూడా ఒకేలా ఉంటుంది. దేశద్రోహ చట్టం, చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం రెండింటినీ కూడా ఒకే రకమైన ప్రయోజనం కోసం ఈనాడు దేశంలో వినియోగిస్తున్నారు. ఈ రెండు చట్టాలు కూడా రాజ్యాంగం ఇచ్చిన పౌరుల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తున్నాయి. హక్కులు నిజమైన అర్థంలో అమలు జరగాలంటే, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలంటే దేశద్రోహంపై సుప్రీం కోర్టు తీసుకున్న వైఖరిని ‘ఉపా’ చట్టంపై కూడా తీసు కోవాలని కోరుతున్నాను. (చదవండి: దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే) నాపై దేశద్రోహం కేసు సహా మరో తొమ్మిది ‘ఉపా’ కేసులు పెట్టారు. దాదాపు సంవత్సరం పాటు జైల్లో ఉంచారు. విడుదల అయ్యాక కేసుల విచారణకు తిరిగి తిరిగీ అలసి పోతున్నాను. ‘ఉపా’ చట్టం పైన కూడా సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాను. – నలమాస కృష్ణ హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్ -
మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్ చేశామని గద్వాల్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
20న నయీం బాధితుల ధర్నా
- నయీంతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలి - టిపిఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్ సిటీ) నయీంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులను వెంటనే అరెస్ట్ చేసి సమగ్రమైన న్యాయ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం టీపీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీపీఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ మాట్లాడుతూ దోషులు ఎంతటివారైనా అరెస్ట్ చేసి శిక్షించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నయీంను చేరదీసి పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు, ఆనాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. అధికార పక్షంలో ఉన్న నేతలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చింతల వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి డికే అరుణ లాంటి వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నయీం డైరీలో ఉన్న పేర్లు, వారు పాల్పడిన నేరాలను బయట పెట్టాలని కోరారు. నయీం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విలేకర్ల సమావేశంలో టిపిఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, ఉపాధ్యక్షులు కె. రవిచందర్, టివివి అధ్యక్షులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనేతర హక్కులు ఆధిపత్యంలో భాగమే!
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అక్టోబర్ 13న దాదాపు 10 వేలమంది గిరిజనులతో బహిరంగ సభ జరిగింది. 1/70 చట్టాన్ని సవరించాలని, గిరిజనుల తోపాటు గిరిజనేతరులకు కూడా అన్ని విషయాల్లో సమాన హక్కులు కల్పించాలన్నవి వీరి ప్రధాన డిమాండ్లు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేత రుల ఆధిపత్య భావజాలానికి పరాకాష్టగా జరుగు తున్న ఆందోళన ఈ రోజుది కాదు. ఏజెన్సీ ప్రాంతా ల్లో గిరిజన హక్కులను ఎత్తిపడుతూనే గిరిజనేత రుల సమస్యను ప్రతీఘాతుక ఉద్యమంగా మార్చా లని చూస్తున్న ఆధిపత్య శక్తులను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న బహుముఖ దోపిడీ వల్ల గిరిజన తెగలతోపాటు గిరిజనేతర సమాజం కూడా ప్రభావితమవుతున్నది. ఆదివాసీ ప్రాంతాల్లో పెరిగిపోతున్న గిరిజనేతరుల చొరబా టును ఓట్లరూపంలోనూ, తమ దోపిడీకి పునాది గానూ వాడుకోవచ్చనే భావనతో ఆదివాసేతర భూ స్వాములు, పెత్తందార్లు, రాజకీయ నేతలు అన్యా యమైన వాదనలు లేవదీస్తున్నారు. కనీస హక్కుల కోసం గిరిజనేతరులు చేస్తున్న డిమాండ్లు పైకి చాలా న్యాయంగానే కనిపిస్తున్నప్పటికీ వారెంచుకునే పోరాట రూపాలు సామాజిక న్యాయాన్ని, సహజ న్యాయాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి. గిరిజనేతర ఓట్ల కోసం గిరిజన నేతలుగా చలా మణి అవుతున్న గిరిజన దళారీలు కూడా ఈ ప్రతీ ఘాతుక ఉద్యమంలో ఏదో ఒక పాత్ర పోషించడం గమనార్హం. కానీ రాజకీయ పార్టీల వైఖరి, సర్వేజనా స్సుఖినోభవంతు అనే అవగాహన వల్ల వీరంతా గిరిజన హక్కుల విషయంలో సహజన్యాయాన్ని మర్చిపోతున్నారు. గిరిజన చట్టాలను, రాజ్యాంగ రక్షణలను రద్దు చేస్తే ఇక ఆదివాసీ అనే మనిషి కానరాని పరిస్థితి రాక తప్పదు. ఆ కాస్త రక్షణలు లేకుంటే ఆదివాసులకు గూడు కూడా ఉండదు. షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసిస్తున్న దళిత కులాలకు చెందిన నిరుద్యోగులు తమ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనతో ఉండటం వాస్తవం. 60, 70 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నా తమకు భూముల్లేవని, ఉన్నా పట్టాలు ఉండవనీ, గిరిజనుల కన్నా అధ్వాన స్థితిలో ఉన్న తాము కులవివక్ష కూ గురవుతున్నామని వీరంటున్నారు. పైగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్ భూమిపై తమకు హక్కులు వర్తించవని ఏజెన్సీలో దళిత, బీసీ కులాల్లోని విద్యా వంతులు నిరసన తెలుపుతున్నారు. సరిగ్గా ఈ స్థితి నే ఆధిపత్య శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలను ఎత్తివేయాలనే ఉద్యమాలు సహజ న్యాయాన్ని, ధర్మాన్ని చూడటం లేదు. పైగా గిరిజనులపై భారత పాలకులు ఏనాడూ ప్రేమను కురిపించలేదు. 1960-2011 మధ్యలో దేశంలో రెండున్నర కోట్లమంది ప్రజలు నిర్వాసి తులు కాగా, వారిలో 40 శాతం మంది గిరిజను లేనని కేంద్ర నివేదిక తెలిపింది. గిరిజనుల ప్రతిఘ టన వల్ల తీసుకొచ్చిన నామమాత్రపు రక్షణ చట్టాలు కూడా తమకు ఆటంకం అని భావిస్తున్న దళారీ పాలక వర్గాలు గిరిజన ప్రాంతాల సంపదను దోచు కోవడానికి తీవ్రమైన అణిచివేతను ప్రయోగిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కోనేరు రంగారావు కమిటీ ఆదివాసీల రక్షణ కోసం గతంలో చేసిన 41 సూచ నలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ తెలం గాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆదివాసీ ప్రాంతా ల్లో ప్రజలను నిర్వాసితులను చేసే వారి అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులను వ్యతిరేకించాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులు గౌరవంగా ఆదివాసీ ప్రజలతో కలిసి జీవించాలి. మైదాన ప్రాం తాల నుంచి బతుకు తెరువు కోసం వెళ్లిన వారికి ఈ దేశ మూలవాసులు ఎన్నడూ హాని తలపెట్టలేదని గుర్తించాలి. శతాబ్దాల పోరాటం ఫలితంగా గిరిజ నులకు సంక్రమించిన కనీస రక్షణ చట్టాలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత గిరిజన, గిరిజనేత రులందరిపై ఉంది. అటవీప్రాంతాల్లోకి వెళ్లి మాకు హక్కులెందుకివ్వరని అడగటం కన్నా, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు తాము ఉన్నచోటనే భూమిపై హక్కు కోసం, మెరుగైన జీవితం కోసం పోరాడితే పీడిత వర్గాల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. వారి మధ్య సమస్యలూ పరిష్కారమవుతాయి. (వ్యాసకర్త: నలమాస క్రిష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రజా ఫ్రంట్ 98499 96300) -
‘ముఖ్యమంత్రివిసామ్రాజ్యవాద విధానాలు’
రాంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజ్య్రవాద విధానాలు అవలంబిస్తున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) నాయకులు విమర్శించారు. నస్పూర్‌లోని సమంగళి ఫంక్షన్ హాల్లో ఐదు రోజులుగా నిర్వహిస్తోన్న టీపీఎఫ్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముగింపు శిక్షణ తరగతులకు టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మద్దిలేటి, నలమాస కృష్ణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంచడానికి భూమి లేదని, కొని ఇస్తామని చెబుతూనే మరోవైపు బహుళజాతి సంస్థలకు లక్షల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టడానికి సిద్ధపడిందని విమర్శించారు. తెలంగాణలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 18 లక్షలు ఉన్నాయని, వీరికి పంచడానికి 54 లక్షల ఎకరాల భూమి కావాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల ఉద్యోగాలు రద్దు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో న్యా యంగా 1170 టీఎంసీల నీటి వాటా రావాలని, దీనిపై ఎవరూ మాట్లాడడం లేదన్నా రు. పోలవరం, టైగర్‌జోన్, ఓసీపీలతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వైద్యం అందక విషజ్వరాలతో అనేక మంది గిరి జనులు మృతి చెందుతున్నారని తెలిపారు. టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.నర్సింహారెడ్డి, కార్యదర్శి చెంచు రమేశ్, కార్యవర్గ సభ్యులు మచ్చ విద్యాసాగర్, అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్, మహిళా నాయకులు ఎడ్ల జయ, నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు సమ్మయ్య, నాయకులు దేవి సత్యం, చార్వాక, కుమారస్వామి పాల్గొన్నారు.