
దేశద్రోహ చట్టంగా పేరుపడ్డ ఐపీసీ సెక్షన్ 124ఎ అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు నిచ్చింది. ఈ తీర్పు పట్ల ఒక హైకోర్టు న్యాయవాది గానూ, దేశద్రోహం కేసులో నిందితుడిగానూ ఉన్న నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.
దేశద్రోహ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాలు తెచ్చాయి. దురదృష్టవశాత్తూ ఈ చట్టాలు రెండింటినీ దగ్గరగా పరిశీలిస్తే వాటి స్వరూప, స్వభావాలు ఒకేలా ఉంటాయి. వాటి వినియోగ లక్ష్యం కూడా ఒకేలా ఉంటుంది.
దేశద్రోహ చట్టం, చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం రెండింటినీ కూడా ఒకే రకమైన ప్రయోజనం కోసం ఈనాడు దేశంలో వినియోగిస్తున్నారు. ఈ రెండు చట్టాలు కూడా రాజ్యాంగం ఇచ్చిన పౌరుల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తున్నాయి. హక్కులు నిజమైన అర్థంలో అమలు జరగాలంటే, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలంటే దేశద్రోహంపై సుప్రీం కోర్టు తీసుకున్న వైఖరిని ‘ఉపా’ చట్టంపై కూడా తీసు కోవాలని కోరుతున్నాను. (చదవండి: దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే)
నాపై దేశద్రోహం కేసు సహా మరో తొమ్మిది ‘ఉపా’ కేసులు పెట్టారు. దాదాపు సంవత్సరం పాటు జైల్లో ఉంచారు. విడుదల అయ్యాక కేసుల విచారణకు తిరిగి తిరిగీ అలసి పోతున్నాను. ‘ఉపా’ చట్టం పైన కూడా సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాను.
– నలమాస కృష్ణ
హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment