nallabellam
-
యథేచ్ఛగా "నల్ల" దందా
మానుకోట చుట్టూ నల్లబెల్లం విక్రయాలు శివారు ప్రాంతాల్లో వ్యాపారుల అడ్డా మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం రెండు గంటల్లో వ్యవహారం పూర్తి అర్ధరాత్రి దందాకు అడ్డుకట్ట ఏదీ ? సాక్షి, హన్మకొండ : గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా మత్తులో తండాలు తూగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారుల దాడులకు చిక్కకుండా బెల్లం మాఫియా కొత్త పద్ధతిలో పనులు చక్కబెట్టుకుంటోంది. గతంలో మహబూబాబాద్ కేంద్రంగా ఉన్న తమ అడ్డాలను మార్చి చుట్టుపక్కలకు విస్తరించారు. మొబైల్ ఫోన్లను విరివిగా ఉపయోగిస్తూ గుడుంబా తయారీదారులకు నల్లబెల్లాన్ని యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. కొత్త పంథాలో.. బెల్లం అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తులు కొత్త పంథాలో గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడుంబా విచ్చలవిడిగా తయారయ్యేది. మహబూబాబాద్ మార్కెట్లో బెల్లం విరివిగా లభ్యమయ్యేది. పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చే బెల్లం లోడును మహబూబాబాద్ పట్టణంలో నిల్వ చేసేవారు. తాజాగా జరుగుతున్న దాడులతో మహబూబాబాద్‌లో బెల్లం అమ్మకాలు తగ్గిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. మహబూబాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున బెల్లం నిల్వ చేయడాన్ని తగ్గించిన వ్యాపారులు.. శివారు ప్రాంతాల్లో తాత్కాలిక అడ్డాలను ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నారు. ఫోన్లలో సమాచారం.. అక్రమంగా బెల్లం సరఫరా చేసే వ్యక్తులు మొబైల్ ఫోన్ల ద్వారా గుడుంబా తయారీదారులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఎవరెవరికి ఎంత బెల్లం కావాలో ఆర్డర్ తీసుకుని లారీలలో బెల్లం లోడు వచ్చే రోజు, సమయం గురించి గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన ఉల్లిగడ్డ బస్తాలు, అడుగున నల్లబెల్లం పెడుతున్నారు. ఇలా పకడ్బందీ వ్యూహంతో వచ్చే బెల్లం లోడు లారీలను అర్ధరాత్రి , తెల్లవారుజామున మహబూబాబాద్ పట్టణానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచుతారు. ముందస్తు సమాచారం ప్రకారం అక్కడికి చేరుకున్న టాటామ్యాజిక్, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై బెల్లాన్ని గుడుంబా బట్టీలకు తరలిస్తున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మొత్తం తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. క్వింటా రూ .8000.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, చిత్తూరు నుంచి బెల్లం మహబూబాబాద్‌కు సరఫరా అవుతోంది. అక్కడ బహిరంగ మార్కెట్లో క్వింటా ధర మూడు వేల రూపాయలుగా ఉంది. అదే బెల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చి క్వింటా రూ. 8000కు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క క్వింటాపై దాదాపు మూడు రెట్ల లాభాలు ఉండటంతో ఈ వ్యవహారంలో పాలుపంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అక్రమ పద్ధతిలో బెల్లం అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఇటీవల అర్ధరాత్రి వేళ నల్లబెల్లం సరఫరా చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు పోలీసుల భయంతో చీకట్లో పరిగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయి చనిపోయిన సంఘటన బెల్లం మాఫియా ఆగడాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు బెల్లం మాఫియాలో ఉన్న ప్రధాన సూత్రదారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాని, సా«ధారణ వ్యాపారులు, ఆటోడ్రైవర్లపై ఎక్కువ నిర్భంధం అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
1.50 క్వింటాళ్ల పటిక స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను మహబూబాబాద్ రూరల్ పోలీసులు పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టాటాఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ జె.కృష్ణారెడ్డి, ఎస్సై సీహెచ్.శ్రీనివాస్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అమనగల్ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన హుస్సేన్ టాటాఏస్‌లో మరిపెడ నుంచి పది క్వింటాళ్ల నల్లబెల్లం, 1.50 క్వింటాళ్ల పటిక తీసుకుని ఆదివారం రాత్రి గుండాలగడ్డ తండాకు వచ్చాడు. ఈ బెల్లాన్ని తీసుకెళ్లేందుకు నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం శివారు సుందరం తండాకు చెందిన గుగులోత్ లక్పతి, బానోత్ రవి, గుగులోత్ రాము, నేతావత్ రవి మరికొందరు గుండాలగడ్డ తండాకు వచ్చారు. ఇది లె లుసుకున్న పోలీసులు ఎక్సైజ్ వారికి సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ ఎస్సై రాయబారపు రవికుమార్, రూరల్ పీఎస్ హె డ్ కానిస్టేబుల్ డి.మనోహరస్వామి, సిబ్బంది తండాకు వెళ్లగా నింది తులు పరారయ్యారు. పోలీసులు టాటాఏస్,æ బెల్లం, పటికను స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. పరారైన ఆటోడ్రైవర్ హుస్సేన్, లక్పతి, రాము, బానోత్ రవి, నేతావత్ రవిపై కేసు నమోదు చేశామని తెలిపారు. కేసముద్రంలో 12 క్వింటాళ్ల బెల్లం.. కేసముద్రం : అక్రమంగా విక్రయిస్తున్న 12 క్వింటాళ్ల బెల్లం పట్టుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎక్సైజ్ ఎస్సై రేష్మా కథనం ప్రకా రం.. మండల కేంద్రానికి చెందిన పాలరమేష్ అనే వ్యాపారి అక్రమంగా బెల్లాన్ని ఓ గదిలో డంప్‌చేసి విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారి ఇంటì సమీపంలోని ఓ గదిలో 24 బస్తాల బెల్లం, మరికొంత దూరంలో 170 కేజీల పటిక లభ్యమయ్యాయి. బెల్లం,పటిక స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. దాడులు నిర్వహించిన వారిలో ఎక్సైజ్ సిబ్బంది యాదగిరి, గౌస్, అయూబ్, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. -
మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్టు
చింతపల్లి, న్యూస్‌లైన్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థితో పా టు నల్లబెల్లం వ్యాపారిని పోలీసులు గురువా రం అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, సారా తయారీకి వినియోగించే బెల్లా న్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ ప్రసాద్ తెలిపారు. చింతపల్లి మండలం తాజంగికి చెందిన రుబ్బా సంజీవరావు కొద్దిరోజులుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో సంజీవరావు ఇంటిని సోదా చేయగా సుమారు రూ.20వేల విలువైన 158 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. సంజీవరావు తాజంగి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోతుగెడ్డ జంక్షన్‌కు చెందిన షేక్ అక్బరుద్దీన్ కిరాణా దుకాణంలో తనిఖీలు చేయగా రూ.5,800 విలువైన 250 కిలోల బెల్లం దొరికిందని, వారిద్దరిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు. -
నల్లబెల్లం కేరాఫ్ భద్రాచలం?
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం కేంద్రంగా నల్లబెల్లం వ్యాపారం ‘మూడుపువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతోంది. కొంతమంది ప్రముఖలు ఈ అక్రమ వ్యాపారానికి సూత్ర ధారులుగా వ్యవహరిస్తుండడం, అధికారులు కూడా సహకరిస్తుండడంతో దీనికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి బడాబాబుల అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా కిందిస్థాయి అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో బెల్ల వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మద్యం కొనుగోలు చేయలేని గిరిజనులు అనేకమంది గుడుంబాకు బానిసలుగానే మిగిలిపోతున్నారు. అంతంత మాత్రమే ఆదాయం ఉన్న గిరిజనులు మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలానికి చెందిన కొంతమంది నల్లబెల్లం రవాణానే వ్యాపారంగా ఎంచుకున్నారు. పశువుల దాణా పేరిట..! పశువుల దాణా పేరిట నల్లబెల్లం విక్రయాలకు అనుమతులు తెచ్చుకుంటున్న వ్యాపారుల్లో కొంతమంది లాభాల కోసం గుడుంబా తయారీని ప్రోత్సహిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ఇందిరామార్కెట్ , ఇండస్ట్రీయల్ ఏరియా, ఐటీడీఏ రోడ్లలో భారీగా నల్లబెల్లం నిల్వలు చేసిన వ్యాపారస్తులు భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు కూడా భద్రాచలం నుంచే నల్లబెల్లం రవాణా చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యాపారి పోలీసులకు పట్టుబడిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వ చ్చింది. ఇక్కడి ఎక్సైజ్, పోలీస్‌శాఖ వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారని పట్టణ వాసులు అంటున్నారు. ఇటీవల కూనవరం రోడ్లో రాత్రి వేళ నల్లబెల్లంతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నప్పటికీ తెల్లవారే సరికి అది మాయమైనట్లుగా ప్రచారం జరిగింది. ఇక ఎక్సైజ్ శాఖ వారు అయితే నెలసరి టార్గెట్ కోసమే అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. సెల్‌షాపు నిర్వాహకుడే సూత్రధారి..?: భద్రాచలం ఏఎస్పీగా ప్రకాష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్లబెల్లం వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో కొంత వ్యాపారులు వెనక్కు తగ్గడంతో నల్లబెల్లానికి డిమాండ్ పెరిగింది. దీనిని సాకుగా తీసుకున్న ఓ సెల్‌షాపు నిర్వహకుడు పెద్ద ఎత్తున నల్లబెల్లాన్ని నిల్వ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాచలం, సారపాకల్లో సెల్‌షాపులు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి దీనికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం వద్ద 20 టన్నుల నల్లబెల్లాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ అక్రమ వ్యాపారం వెనుక సెల్ షాపు నిర్వాహకుడు ప్రమేయం ఉందనే విషయం వెల్లడైంది. ఈ వ్యాపారికి గతంలో కూడా అక్రమ వ్యాపారాలతో సంబంధాలు ఉండగా, కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇతనితో పాటు పట్టణంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న చాలామంది ‘హస్తాలు’ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల పట్టణం నుంచి డివిజన్ వ్యాప్తంగా సుమారు 15 లారీల నల్లబెల్లం గిరిజన గ్రామాలకు తరలివెళ్తోందని అంచనా. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం నల్లబెల్లం అక్రమ వ్యాపారం, గుడుంబా తయారీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ సీఐగా బాధ్యతలు తీసుకొని రెండు నెలలే అయింది. అక్రమ వ్యాపారుల జాబితాను సేకరించాం. సెల్ షాపు నిర్వాహకుడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లుగా తెలిసింది. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. నల్లబెల్లం విక్రయాలపై ప్రజలు సెల్ నంబర్ 9440902683 కు ఫోన్ చేసి చెప్పవచ్చు. - రామకిషన్, ఎక్సైజ్ సీఐ, భద్రాచలం