నల్లబెల్లం కేరాఫ్ భద్రాచలం?
Published Sun, Aug 11 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం కేంద్రంగా నల్లబెల్లం వ్యాపారం ‘మూడుపువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతోంది. కొంతమంది ప్రముఖలు ఈ అక్రమ వ్యాపారానికి సూత్ర ధారులుగా వ్యవహరిస్తుండడం, అధికారులు కూడా సహకరిస్తుండడంతో దీనికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి బడాబాబుల అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా కిందిస్థాయి అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో బెల్ల వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మద్యం కొనుగోలు చేయలేని గిరిజనులు అనేకమంది గుడుంబాకు బానిసలుగానే మిగిలిపోతున్నారు. అంతంత మాత్రమే ఆదాయం ఉన్న గిరిజనులు మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలానికి చెందిన కొంతమంది నల్లబెల్లం రవాణానే వ్యాపారంగా ఎంచుకున్నారు.
పశువుల దాణా పేరిట..!
పశువుల దాణా పేరిట నల్లబెల్లం విక్రయాలకు అనుమతులు తెచ్చుకుంటున్న వ్యాపారుల్లో కొంతమంది లాభాల కోసం గుడుంబా తయారీని ప్రోత్సహిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ఇందిరామార్కెట్ , ఇండస్ట్రీయల్ ఏరియా, ఐటీడీఏ రోడ్‌లలో భారీగా నల్లబెల్లం నిల్వలు చేసిన వ్యాపారస్తులు భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు కూడా భద్రాచలం నుంచే నల్లబెల్లం రవాణా చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యాపారి పోలీసులకు పట్టుబడిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వ చ్చింది. ఇక్కడి ఎక్సైజ్, పోలీస్‌శాఖ వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారని పట్టణ వాసులు అంటున్నారు. ఇటీవల కూనవరం రోడ్‌లో రాత్రి వేళ నల్లబెల్లంతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నప్పటికీ తెల్లవారే సరికి అది మాయమైనట్లుగా ప్రచారం జరిగింది. ఇక ఎక్సైజ్ శాఖ వారు అయితే నెలసరి టార్గెట్ కోసమే అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
సెల్‌షాపు నిర్వాహకుడే సూత్రధారి..?:
భద్రాచలం ఏఎస్పీగా ప్రకాష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్లబెల్లం వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో కొంత వ్యాపారులు వెనక్కు తగ్గడంతో నల్లబెల్లానికి డిమాండ్ పెరిగింది. దీనిని సాకుగా తీసుకున్న ఓ సెల్‌షాపు నిర్వహకుడు పెద్ద ఎత్తున నల్లబెల్లాన్ని నిల్వ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాచలం, సారపాకల్లో సెల్‌షాపులు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి దీనికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం వద్ద 20 టన్నుల నల్లబెల్లాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ అక్రమ వ్యాపారం వెనుక సెల్ షాపు నిర్వాహకుడు ప్రమేయం ఉందనే విషయం వెల్లడైంది. ఈ వ్యాపారికి గతంలో కూడా అక్రమ వ్యాపారాలతో సంబంధాలు ఉండగా, కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇతనితో పాటు పట్టణంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న చాలామంది ‘హస్తాలు’ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల పట్టణం నుంచి డివిజన్ వ్యాప్తంగా సుమారు 15 లారీల నల్లబెల్లం గిరిజన గ్రామాలకు తరలివెళ్తోందని అంచనా.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
నల్లబెల్లం అక్రమ వ్యాపారం, గుడుంబా తయారీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ సీఐగా బాధ్యతలు తీసుకొని రెండు నెలలే అయింది. అక్రమ వ్యాపారుల జాబితాను సేకరించాం. సెల్ షాపు నిర్వాహకుడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లుగా తెలిసింది. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. నల్లబెల్లం విక్రయాలపై ప్రజలు సెల్ నంబర్ 9440902683 కు ఫోన్ చేసి చెప్పవచ్చు.
- రామకిషన్, ఎక్సైజ్ సీఐ, భద్రాచలం
Advertisement
Advertisement