కట్నం కోసం భార్య జెడ కత్తిరించిన భర్త
పెగడపల్లి : అదనపు కట్నం తేవాలని ఓ వ్యక్తి భార్య జెడ కత్తిరించిన ఘటన మండలంలోని నామాపూర్‌లో గురువారం జరిగింది. ఎస్సై కోటేశ్వ ర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లెంకల కొమురవ్వ-రాజమల్లు దంపతుల కూతురు మంజుల వివాహం అదే గ్రామానికి చెందిన దండవేని రాజమల్లుతో ఎనిమిదేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో 5 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదు, ఇతర లాంఛనాలు కట్నంగా ఇచ్చారు.
కొనేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు పిల్లలు జన్మించారు. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం మంజులను రాజమల్లు, అత్త కొముర వ్వ, మామా బక్కయ్య, ఆడబిడ్డ బూత్కూరి మల్లవ్వ వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గురువారం మంజుల ఉపాధి హామీ పనికి వెళ్తుండగా రాజమల్లు అడ్డుకుని జెడ కత్తిరించాడు. దాడిచేసి గాయపర్చాడు. బాధితురాలు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజమల్లు, కొమురవ్వ, బక్కయ్య, మల్లవ్వపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.