నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్‌ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు.
కొత్తగా రెండు రేంజ్‌లు
ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్‌లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్‌ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్‌లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్‌లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్‌ల సంఖ్య 8 పెరిగింది.
ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్
గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు.
వైల్డ్‌లైఫ్ విభాగాలు ప్రత్యేకం
వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి.
నల్లమలలో 73 పెద్ద పులులు
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది.
పెరిగిన సిబ్బంది
నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు.
పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్‌క్యాంపుల్లో నియమించనున్నారు.
పర్యవేక్షణ సులభం
జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం.
– వినీత్‌కుమార్, జిల్లా అటవీ అధికారి
అడవులతోనే సమృద్ధిగా వర్షాలు
అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.
– విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– బోరు రమణ, చాగలమర్రి