తొలివిడత ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 జెడ్పీటీసీ స్థానాలు, 496 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
కర్నూలు డివిజన్‌లోని 19 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది.. నంద్యాల డివిజన్‌లోని 17 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు డివిజన్లలోని 496 ఎంపీటీసీ స్థానాలకు 1,311 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,451 మంది సిబ్బంది ఎన్నికల విధులకు గాను శనివారం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.169 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. మండలాల్లోని ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలను మరోసారి వివరించారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు.. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. కర్నూలు డివిజన్‌కు సంబంధించి 57 జోన్లు.. 111 రూట్లను ఏర్పాటు చేయగా.. 76 జీపులు, 118 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. నంద్యాల డివిజన్‌లోని 49 జోన్లు, 94 రూట్లకు 67 జీపులు, 97 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు.
నేడే పోలింగ్
Published Sun, Apr 6 2014 2:31 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement