విజయవంతమైన నరకాసుర వధ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతురుణ మాఫీపై వంచనకు పాల్పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో గ్రామగ్రామాన విజయవంతమైందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో జ్యోతుల నెహ్రూ విలేకర్లసమావేశంలో మాట్లాడుతూ... నరకాసుర వధ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం, మహిళాలోకం కదిలి వచ్చిందని తెలిపారు.
ఆర్థిక మంత్రి యనమల తన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారని నెహ్రూ ఆరోపించారు. దొడ్డి దారిన మంత్రి అయిన మీరా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించేది అని యనమలను ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని రెండుసార్లు ఓడించారని యనమలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అలా ఎందుకు ఓడించారో ఇప్పటికైనా తెలుసుకోవాలని యనమలకు నెహ్రూ సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించడమే ఆంధ్రప్రదేశ్ మంత్రులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడిపై సదరు మంత్రులు హద్దులు మీరి మాట్లాడడం తగదని అన్నారు. టీడీపీ నేతలు సొంత డబ్బా, అలాగే వారి నాటకాలు చూస్తుంటే నవ్వోస్తోందని నెహ్రూ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే తామే సన్మానం చేస్తామని టీడీపీ నేతలకు వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ నెహ్రూ సవాల్ విసిరారు.
రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం వంచనకు పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని గ్రామ గ్రామాన నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామగ్రామాన నరకాసుర వధ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ నిర్వహించింది.