Narasimhan Delhi Tour
-
ప్రధానితో గవర్నర్ భేటీ
* శాంతిభద్రతలు సహా పలు అంశాలపై నివేదిక అందజేత * అనంతరం ఏపీ భవన్లో గవర్నర్‌ను కలసిన దిగ్విజయ్ * ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన అనంతరం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. రాష్ట్రంలో తాజా పరిస్థితులను రాష్ట్రపతికి, ప్రధానమంత్రితో సహా పలు ముఖ్య శాఖలకు నివేదించారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. శాంతిభద్రతలు సహా పలు అంశాలపై ప్రధానికి 10 పేజీల నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పాలన, ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో పరిస్థితులను నివేదించినట్లు సమాచారం. కాగా, రాష్ట్రపతి పాలన సందర్భంగా గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమించాల్సి ఉండగా కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అనుగ్రహ నారాయణ్ తివారీ పేరును ఇందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. గవర్నర్‌తో దిగ్విజయ్ భేటీ.. గవర్నర్ నరసింహన్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో.. కిరణ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతోపాటు పలు రాజకీయ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కాగా, గవర్నర్ బస చేసిన ఏపీభవన్‌లోని శబరి బ్లాక్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. -
నేడు ఢిల్లీకి గవర్నర్
* రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టాకతొలిసారిగా హస్తినకు.. * 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే బస.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీలు * 7న తిరిగి హైదరాబాద్ రాక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక తొలిసారిగా గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 3.35 గంటలకు బయలు దేరి వెళ్లి.. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. తిరిగి 7న సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు వస్తారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్తోపాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు పాలనపరంగా తాను తీసుకోదలుచుకున్న చర్యలను రాష్ట్రపతికి గవర్నర్ వివరించనున్నట్లు తెలిపాయి. అలాగే పాలనాపరంగా సహకరించేందుకు సలహాదారులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల, పదవీ విరమణ చేసిన రాష్ట్రేతర అధికారులను నియమించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. ఈ విషయంపైన కూడా కేంద్ర హోంశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులతో గవర్నర్ చర్చించనున్నట్లు సమాచారం. సచివాలయంలో పాలన పరమైన మార్పులు రాష్ట్ర సచివాలయంలో పరిపాలన పరమైన మార్పులకు గవర్నర్ శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ముఖ్యంగా సీఎం సహాయ నిధితో పాటు ప్రజలకు అత్యవసరమైన అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై ఆయన సోమవారం కసరత్తు చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పాలన పరంగా మరిన్ని కీలక నిర్ణయాలను గవర్నర్ తీసుకోనున్నట్లు తెలిపాయి.