నరసింహన్ ను కలిసిన దిగ్విజయ్ సింగ్
* శాంతిభద్రతలు సహా పలు అంశాలపై నివేదిక అందజేత
* అనంతరం ఏపీ భవన్‌లో గవర్నర్‌ను కలసిన దిగ్విజయ్
* ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన అనంతరం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్.. రాష్ట్రంలో తాజా పరిస్థితులను రాష్ట్రపతికి, ప్రధానమంత్రితో సహా పలు ముఖ్య శాఖలకు నివేదించారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. శాంతిభద్రతలు సహా పలు అంశాలపై ప్రధానికి 10 పేజీల నివేదికను అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి పాలన, ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో పరిస్థితులను నివేదించినట్లు సమాచారం. కాగా, రాష్ట్రపతి పాలన సందర్భంగా గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమించాల్సి ఉండగా కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అనుగ్రహ నారాయణ్ తివారీ పేరును ఇందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
గవర్నర్‌తో దిగ్విజయ్ భేటీ..
గవర్నర్ నరసింహన్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం.
దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో.. కిరణ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతోపాటు పలు రాజకీయ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కాగా, గవర్నర్ బస చేసిన ఏపీభవన్‌లోని శబరి బ్లాక్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.