కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరి శుక్రవారం భోపాల్‌లో పీపీఈ కిట్ ధరించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు.
న్యూఢిల్లీ: గుజరాత్, మణిపూర్‌లు మినహా మిగిలిన రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌సీపీ నాలుగు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, బీజేపీ నుంచి జ్యోతిరాధిత్య సింధియా, జార్ఖండ్ నుంచి షిబు సోరెన్ వంటి వారు సులువుగా ఎగువ సభకు ఎన్నికయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపారు.
కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందింది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) ఒక సీటు సాధించుకుంది. బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. గుజరాత్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఓట్లను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యింది.
విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మేఘాలయలోని ఒక స్థానాన్ని మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి వాన్‌వే రాయ్ ఖర్లుకి విజయం సాధించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే శాసనసభ్యులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు ధరించడంలాంటి అన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంలో పడిన మణిపూర్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుని కాంగ్రెస్ అభ్యర్థి టి. మంగిబాబు పై బీజేపీకి చెందిన లీసెంబా సనజోబా గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment