నేడు ఢిల్లీకి గవర్నర్
* రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టాకతొలిసారిగా హస్తినకు..
* 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే బస.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీలు
* 7న తిరిగి హైదరాబాద్ రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక తొలిసారిగా గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 3.35 గంటలకు బయలు దేరి వెళ్లి.. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. తిరిగి 7న సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు వస్తారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌తోపాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు పాలనపరంగా తాను తీసుకోదలుచుకున్న చర్యలను రాష్ట్రపతికి గవర్నర్ వివరించనున్నట్లు తెలిపాయి. అలాగే పాలనాపరంగా సహకరించేందుకు సలహాదారులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల, పదవీ విరమణ చేసిన రాష్ట్రేతర అధికారులను నియమించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. ఈ విషయంపైన కూడా కేంద్ర హోంశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులతో గవర్నర్ చర్చించనున్నట్లు సమాచారం.
సచివాలయంలో పాలన పరమైన మార్పులు
రాష్ట్ర సచివాలయంలో పరిపాలన పరమైన మార్పులకు గవర్నర్ శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ముఖ్యంగా సీఎం సహాయ నిధితో పాటు ప్రజలకు అత్యవసరమైన అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై ఆయన సోమవారం కసరత్తు చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పాలన పరంగా మరిన్ని కీలక నిర్ణయాలను గవర్నర్ తీసుకోనున్నట్లు తెలిపాయి.