Narendra Luther
-
విశ్రాంత సీఎస్ లూథర్ ఇక లేరు..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి (సీఎస్) నరేంద్ర లూథర్ (89) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య బింది, కుమార్తె సంధ్యా లూథర్, కొడుకు రాహుల్ లూథర్ ఉన్నారు. కవి, రచయిత, చరిత్రకారుడు, కాలమిస్టు, సొసైటీ ఫర్ సేవ్ రాక్ అధ్యక్షుడిగా ఆయన హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేశారు. 1932 మార్చి 23న పంజాబ్‌లోని హోషి యార్‌పూర్‌లో జన్మించిన ఆయన.. దేశ విభజనప్పుడు లాహోర్ నుంచి భారత దేశానికి తన కుటుంబంతో కలసి 14 ఏళ్ల వయసులో శరణార్థిగా వచ్చారు. ఐఏఎస్ అధికారిగా హైదరాబాద్‌లో పనిచేసే క్రమంలో నగర చరిత్ర, సంస్కృతి, ఉర్దూ భాషపై మమకారం పెంచుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సేవలందించారు. 1991లో ఉమ్మడి ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ‘హైదరాబాద్–ఏ బయోగ్రఫీ’, లష్కర్–ది స్టోరీ ఆఫ్ సికింద్రాబాద్, ‘పోయెట్’, లవర్, బిల్డర్, మహ్మద్ అలీ కుతుబ్‌షా–ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాలు ప్రాచుర్యాన్ని పొందాయి. హైదరాబాద్ శిలల విశిష్టతపై రా క్యుమెంటరీ పేరుతో డాక్యుమెంటరీ సైతం తీశారు. దేశ విభజన సమయంలో తన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, లాహోర్ నుంచి పంజాబ్‌కు ప్రత్యేక రైలు ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో ‘ది ఫ్యామిలీ సాగా’పేరు తో గతేడాది ఓ నవలను ప్రచురించారు. హైదరాబాద్‌లో శిలలను ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా ఆయన సొసైటీ ఫర్ సేవ్ రాక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. వీటితో పాటు ‘విట్ అండ్ విస్డమ్ సొసైటీ, యుద్దవీర్ ఫౌండేషన్ తదితర సంస్థల్లో కూడా కీలక పాత్ర పోషించారు. బంజారాహిల్స్‌లో 1977లో ఓ భారీ శిల చుట్టూ తన ఇంటి ని నిర్మించుకున్నారు. దానిని ధ్వంసం చేయడం కన్నా పరిరక్షించడానికే మక్కువ చూపారు. లూథర్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు గూడూరు డివిజన్ సబ్‌కలెక్టర్‌గా పని చేస్తున్న సమయం లో నెల్లూరు జిల్లాపై తుపాను విరుచుకుపడింది. నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో రెండు రైళ్లు తుపానులో చిక్కుకుపోయాయి. జాతీయ రహదారిపై నడుములోతు నీళ్లు పారుతుండటంతో వాహనాలు ముందుకు వెళ్లని పరిస్థి తి. ఆ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీళ్లలో ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరుకుని ప్రయాణికులకు ఆహారం, పునరావాస ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ సంతాపం నరేంద్ర లూథర్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, దాని పాలకుల చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. సేవ్ రాక్స్ సొసైటీ అధ్యక్షుడిగా హైదరాబాద్‌లోని సహజ శిలల పరిరక్షణకు ఉద్యమించారని, నిజాయితీపరుడైన అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారని పేర్కొన్నారు. -
లాహోర్ నుంచి బంజారాహిల్స్ వరకూ!
విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ తెలుగునాట మూడు దశాబ్దాలకుపైగా పనిచేయడమేగాదు, హైదరాబాద్ ప్రజలు, పాలకుల గురించి పుస్తకాలు రాసి చరిత్రకారునిగా ప్రసిద్ధికెక్కారు. రిటైరయ్యాక కూడా పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ పత్రికల్లో వ్యాసాలు రాసి రాజధాని విశేషాలెన్నో ప్రజలకు చెప్పారు. చారిత్రక విశేషాలను కథలుకథలుగా వివరించిన లూథర్ చాలా ఆలస్యంగా (రిటైరైన పాతికేళ్లకు)స్వీయచరిత్ర రాయడం ఆశ్చర్యకరమే మరి. దేశ విభజన నాటికి పదమూడేళ్ల బాలుడైన లూథర్ ఇప్పుడు 85 ఏళ్ల వయసులో ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేరుతో రాసిన ఆత్మకథలో సొంత సంగతులతో పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నాటి పరిస్థితులు, సీఎంల వ్యవహార శైలి గురించి వెల్లడించారు. ఇప్పటికీ పాకిస్తాన్ గురించీ ముఖ్యంగా దాదాపు సగానికి పైగా జనాభా ఉన్న అక్కడి పంజాబ్ గురించి భారత ప్రజలకు పట్టని అనేక విశేషాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. పాకిస్తాన్ అనగానే ఇప్పటికీ ఉర్దూలోనే మెజారిటీ జనం మాట్లాడతారనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈ విషయంపైనే లూథర్ రాస్తూ, తాను స్కూల్లో చదివే రోజుల్లో ముస్లిం స్త్రీపురుషులు, హిందూ, సిక్కు కుర్రాళ్లు తప్పనిసరిగా ఉర్దూ నేర్చుకునే వారనీ, ఉర్దూరాని అబ్బాయిలను మగ పిల్లలుగా పరిగణించేవారు కాదని వెల్లడించారు. జనం మాతృభాష పంజాబీకి అప్పట్లో గుర్తింపు లేదు. 2006లో లూథర్ తన జన్మస్థలం లాహోర్ వెళ్లారు. తన అభినందనసభలో వక్తలందరూ పంజాబీలో మాట్లాడారనీ, తాను పంజాబ్‌కు దూరంగా ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న కారణంగా పంజాబీలో కాకుండా ఉర్దూలో మాట్లాడతానంటే అందుకు సభాధ్యక్షులు అంగీకరించారని లూథర్ చెప్పిన విషయం ప్రస్తుత పాక్ పంజాబ్‌లో వచ్చిన గణనీయ మార్పులకు అద్దం పడుతోంది. ఇప్పుడు పంజాబీయే పాకిస్తానీ ముస్లింలు, ఇండియాలోని పంజాబీ హిందువులు, సిక్కులను మళ్లీ కలుపుతోందనే విషయం ఏ బాన్సాయ్ ట్రీ చదివితే అర్థమౌతుంది. సామాజిక గౌరవం కోసం స్వర్ణకారులే క్షత్రియులయ్యారు! గాంధీ, నెహ్రూలయినా, అమితాబ్‌బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ అయినా తమ సొంతూళ్లు, తమ కులాలు, కుటుంబాల గురించి తమ ఆత్మకథల్లో చెప్పుకున్నవారే. ఇలాంటి వివరాల కోసమే ప్రముఖుల స్వీయచరిత్రలు చదువుతాం. లూథర్ తన పేరును బట్టి తనను క్రైస్తవుడనుకునేవారని తెలపడమేగాక, ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందో కూడా వివరించారు. రిజర్వేషన్ సౌకర్యాలు ఆశించి అనేక కులాలు బీసీ హోదా కోసం ఉద్యమిస్తున్న రోజులివి. నూరేళ్ల క్రితం పంజాబ్‌లో బాగా చదువుకుని, ఆర్థికంగా పైకొచ్చిన అనేక బీసీ కులాలవారు సామాజిక గుర్తింపు, గౌరవం కోసం క్షత్రియులమని చెప్పుకోవడమేగాక, జనాభా లెక్కల సేకరణలో అలాగే రికార్డు చేయించుకునేవారు. లూథర్ కుటుంబీకులు స్వర్ణకారులే అయినా తాము ఖత్రీలమని (పంజాబ్‌లో క్షత్రియులపేరు) ప్రకటించుకున్నారు. నరేంద్ర లూథర్ సమీప బంధువు ఒకరు అసలు విషయం ఆయనకు చిన్నప్పుడే చెప్పారట! ఇలాంటి ఆసక్తికర విషయాలు ఏ బాన్సాయ్ ట్రీలో ఎన్నో ఉన్నాయి. మొదట పూర్వపు ఆంధ్ర రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా చేరిన లూథర్ ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి హయాంలో ఏడాది పదవి పొడిగింపు పొంది, 59 ఏళ్ల వయసులో రిటైరయ్యారు. సీఎం కావడానికి ముందు రాజకీయ, పాలనాపరమైన అనుభవం లేని ఎన్టీఆర్‌తో ఎలాంటి వింత అనుభవాలు ఎదురైందీ లూథర్ ఆసక్తికరమైన రీతిలో చెప్పారు. తన కొడుకు రాహుల్ మద్యానికి బానిసై పడిన కష్టాలు, అతని నుంచి విడాకులు తీసుకున్న కోడలిని ఎలా కూతురుగా చూసుకున్నదీ లూథర్ మనసును కదలించేలా రాశారు. ప్రస్తుతం పాక్‌లోని తన పూర్వీకుల గ్రామం బుడ్ఢా గొరాయాకు అంకితమిచ్చిన ఈ పంజాబీ అధికారి స్వీయ చరిత్రలో ఇప్పటి పాకిస్తాన్, ఇండియాల కథేగాక, తెలుగు ప్రాంతాల దశాబ్దాల విశేషాలు సజీవ చిత్రాలుగా దర్శనమిస్తాయి. ప్రతులకు : ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేజీలు 267, వెల: రూ. 350, ప్రచురణ: నియోగి బుక్స్, niyogibooks@gmail.com (నేటి సాయంత్రం 6.30 గంటలకు విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ స్వీయ చరిత్ర ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో జరగనుంది. పుస్తకావిష్కరణ తోపాటు లిటిల్ థియేటర్ గ్రూప్ వారిచే పుస్తకపఠనం కూడా ఉంటుంది.) – నాంచారయ్య మెరుగుమాల -
ఉదయాన్ని స్వప్నిస్తూ నిదురలోకి..
అమరుడైన తమ మనిషి (లెజెండ్)ని ప్రజలు కీర్తిస్తారు. ఒక వ్యక్తి జీవించి ఉండగా లెజెండ్ కావడం అరుదు. మగ్దూం అటువంటి అరుదైన వ్యక్తి ! నా జీవితకాలంలో నేను (నరేంద్ర లూథర్) చూసిన లివింగ్ లెజెండ్ మగ్దూం. ఆయన గుణగానంలో సదా పరవశిస్తాను. మగ్దూం జీవితంలో సాహిత్యం-సామాజిక ఉద్యమాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. మగ్దూం కుమార్తెకు సంధ్యారాగం ‘అసావేరి’ అని పేరు పెట్టారు. అజ్ఞాతవాసంలో ఉండగా పుట్టిన కుమారుడి పేరు ‘సెకండ్ ఫ్రంట్’ ! తర్వాత కాలంలో ‘నుస్రత్’ (విజయం) అయ్యాడు ! ఉర్దూ దినపత్రిక సియాసత్ వ్యవస్థాపకుడు అబిద్ అలీఖాన్ ఇంట్లో ఓ మరుపురాని సాయంత్రం గడిపాం. జమీలా అనే అందమైన యువతి మగ్దూం సమక్షంలో ఆయన కవితలను గానం చేస్తోంది. అప్పుడు మగ్దూం వయసు సమారు 50 ఏళ్లు. నేను 30లోకి రాబోతున్నా.. మగ్దూంలోని యవ్వన కాంతి నన్ను ఆశ్చర్యపరచింది. ఏమిటీ రహస్యం అన్నాను. ‘నీ గురించి చింతించకు. వ్యక్తిగతం కానీ మంచి విషయాల గురించి ఆలోచించు’ అని హితవు పలికారు ! మగ్దూం సలహాను శిరోధార్యంగా భావించాను. వీలైనంత వరకూ అనుసరిస్తున్నాను. సంజీవయ్య ఎదుట కన్నుగీటారు.. ‘మల్లె పందిరి కింద’ కవితాగానం జరిగిన కొద్ది రోజుల తర్వాత మగ్దూంను అరెస్ట్ చేయాల్సిందిగా నేను ఆదేశించాల్సి వచ్చింది. ‘చట్టం అనుమతి లేకుండా వ్యక్తులు సమావేశం కారాదు’ అనే నిబంధనను ఉల్లంఘించిన నెపంతో ! ఆదేశాలు అమలులో ఉండగానే మగ్దూం ముఖ్యమంత్రి సంజీవయ్యను కలిశారు. అక్కడే చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ‘సమాజానికి పెనుముప్పు, పొంచి ఉంటే ప్రజలు కలసి మాట్లాడుకోవడం మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ కనీస జ్ఞానం లేనివాడు మీ చీఫ్ సెక్రటరీ’ అని మగ్దూం చెడామడా తిట్టారు. ప్రజాసంఘాలు, నాయకుల పట్ల అవగాహన ఉన్న సంజీవయ్య, మగ్దూంను విడుదల చెయ్యండి అన్నారు. తలదించుకున్న చీఫ్ సెక్రటరీతో కరచాలనం చేస్తూ, మగ్దూం నా వైపు కన్నుగీటారు ! ఒక ‘బ్రహ్మానందం’! బ్రహ్మానందరెడ్డి హయంలో ఒకసారి మగ్దూం నిరాహారదీక్షకు కూర్చున్నారు. పెరిగిన బియ్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ! మగ్దూం అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. దీక్షలో పరిస్థితి విషమిస్తోంది. విరమింపజేయాల ంటే ప్రభుత్వం నుంచి హామీని రాబట్టాలి. మగ్దూం సహా రాజ్‌బహదూర్ గౌర్ మరికొందరు చర్చలకు ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్‌ల పట్ల విముఖతతో ఉన్నారు. ఏవో ఫైళ్లను చూస్తున్నట్టు నటిస్తూ తల ఎత్తలేదు. మూతి బిగించిన వారితో సంభాషణ సాధ్యమా ? అప్పుడు మగ్దూం తన వాళ్లతో ‘‘బ్రహ్మానందంగా’ ఉండే వ్యక్తి కోసం కదా మనం వచ్చాం. ఇక్కడ అలాంటి వ్యక్తెవరూ లేనట్లుంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నట్లున్నారు. పోదాం పద’ అన్నారట ! ఆ మాటలకు ముఖ్యమంత్రి ‘బ్రహ్మానంద’భరితుడయ్యారు. ఉద్యమకారుల డిమాండ్లకు అంగీకరించారు. ‘రాజ్’ కూడా బ్రహ్మానందం చెందారు. పేదల కోసం విజయవంతంగా దీక్ష చేసిన మగ్దూం ఓ ముద్ద తిన్నారు మరి. నెరవేర్చని వాగ్దానం ‘మగ్దూం చాచా’ అని పిలిచే రాజ్ బహదూర్ గౌర్ కుమార్తె తమారా అంటే ఆయనకు ప్రత్యేక వాత్సల్యం. ఆమెకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మగ్దూం నెరవేర్చలేకపోయారు. 1969లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వి.వి.గిరి గెలిస్తే కోన్ ఐస్‌క్రీం ఇప్పిస్తానన్నారు మగ్దూం. శాసనమండలిలో సీపీఐ సభాపక్షనేతగా రాణించిన మగ్దూం పార్టీ పనులపై ఢిల్లీ వెళ్లారు. ఆగస్ట్ 25 ఉదయం రాజ్ బహదూర్‌కు ఫోన్ చేసి, నిద్రలేపారు. ఒంట్లో బాగోలేదన్నారు. మిత్రుడిని వెంటనే పంత్ హాస్పిటల్లో చేర్చారు గౌర్. మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆ ఒక్క సందర్భమే చాచా అన్న మాట నిలుపుకోలేకపోయారు అంటారు తమారా ! ఢిల్లీ నుంచి వచ్చిన మగ్దూం భౌతికకాయాన్ని సందర్శించేందుకు నగరం జనసంద్రం అయింది. అన్ని అశ్రునయనాలను నగరం ఎన్నడూ చూడలేదు. హజ్రత్ షా ఖామోష్లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అవిశ్వాసిని ఇక్కడ ఖననం చేసేందుకు ససేమిరా అంగీకరించం అన్నారు ఛాందసులు. అభ్యంతరాలను మగ్దూం అభిమానులు తోసిపుచ్చారు. ‘జిందాబాద్’ నినాదాలతో మగ్దూం భౌతికకాయాన్ని సగౌరవంగా విశ్రమింపజేశారు. సమాధిపై ఆయన కవితా పంక్తులు శిలాక్షరాలై ఉన్నాయి.. ‘బజ్న్ మే దూర్ వో గాతా రహా తన్హా తన్హా సో గయా సజ్ పర్ సర్ రఖ్ కే సహర్ సే పహెలె’ (సమూహాలకు దూరంగా పాడుతున్నాడతడు త నువుతో తనువుతో తంత్రిణిపై తలను చేర్చి నిదురలోకి జారాడు ఉదయానికి పూర్వమే) హైదరాబాద్ ఎన్నో ఉదయాస్తమాలను చూసింది. నవాబులు, జ మీందార్లు, పాలకులు.. ఎందరెందరి ఉదయాస్తమాలనో చూసింది ! ఒక అనాథ బాలుడిని ఈ నగరం మగ్దూం అనే మహనీయునిగా మలచింది ! ఆ హీరోకు పలికిన వీడ్కోలుతో సరిసమానమైనది అంతకు ముందు ఆ తర్వాత నగరం ఎన్నడూ చూడలేదు. మగ్దూంలాంటి మరొకరు కనిపిస్తారా..? మగ్దూం కనిపించిన ఉదయం ఆగమిస్తుందా..? ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి