విశ్రాంత సీఎస్ నరేంద్ర లూథర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి (సీఎస్) నరేంద్ర లూథర్ (89) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య బింది, కుమార్తె సంధ్యా లూథర్, కొడుకు రాహుల్ లూథర్ ఉన్నారు. కవి, రచయిత, చరిత్రకారుడు, కాలమిస్టు, సొసైటీ ఫర్ సేవ్ రాక్ అధ్యక్షుడిగా ఆయన హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేశారు. 1932 మార్చి 23న పంజాబ్‌లోని హోషి యార్‌పూర్‌లో జన్మించిన ఆయన.. దేశ విభజనప్పుడు లాహోర్ నుంచి భారత దేశానికి తన కుటుంబంతో కలసి 14 ఏళ్ల వయసులో శరణార్థిగా వచ్చారు. ఐఏఎస్ అధికారిగా హైదరాబాద్‌లో పనిచేసే క్రమంలో నగర చరిత్ర, సంస్కృతి, ఉర్దూ భాషపై మమకారం పెంచుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సేవలందించారు. 1991లో ఉమ్మడి ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు.
హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ‘హైదరాబాద్–ఏ బయోగ్రఫీ’, లష్కర్–ది స్టోరీ ఆఫ్ సికింద్రాబాద్, ‘పోయెట్’, లవర్, బిల్డర్, మహ్మద్ అలీ కుతుబ్‌షా–ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాలు ప్రాచుర్యాన్ని పొందాయి. హైదరాబాద్ శిలల విశిష్టతపై రా క్యుమెంటరీ పేరుతో డాక్యుమెంటరీ సైతం తీశారు. దేశ విభజన సమయంలో తన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, లాహోర్ నుంచి పంజాబ్‌కు ప్రత్యేక రైలు ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో ‘ది ఫ్యామిలీ సాగా’పేరు తో గతేడాది ఓ నవలను ప్రచురించారు. హైదరాబాద్‌లో శిలలను ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా ఆయన సొసైటీ ఫర్ సేవ్ రాక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. వీటితో పాటు ‘విట్ అండ్ విస్‌డమ్ సొసైటీ, యుద్దవీర్ ఫౌండేషన్ తదితర సంస్థల్లో కూడా కీలక పాత్ర పోషించారు. బంజారాహిల్స్‌లో 1977లో ఓ భారీ శిల చుట్టూ తన ఇంటి ని నిర్మించుకున్నారు. దానిని ధ్వంసం చేయడం కన్నా పరిరక్షించడానికే మక్కువ చూపారు. లూథర్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు.
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు
గూడూరు డివిజన్ సబ్‌కలెక్టర్‌గా పని చేస్తున్న సమయం లో నెల్లూరు జిల్లాపై తుపాను విరుచుకుపడింది. నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో రెండు రైళ్లు తుపానులో చిక్కుకుపోయాయి. జాతీయ రహదారిపై నడుములోతు నీళ్లు పారుతుండటంతో వాహనాలు ముందుకు వెళ్లని పరిస్థి తి. ఆ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీళ్లలో ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరుకుని ప్రయాణికులకు ఆహారం, పునరావాస ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
నరేంద్ర లూథర్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, దాని పాలకుల చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. సేవ్ రాక్స్ సొసైటీ అధ్యక్షుడిగా హైదరాబాద్‌లోని సహజ శిలల పరిరక్షణకు ఉద్యమించారని, నిజాయితీపరుడైన అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment