
విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ తెలుగునాట మూడు దశాబ్దాలకుపైగా పనిచేయడమేగాదు, హైదరాబాద్ ప్రజలు, పాలకుల గురించి పుస్తకాలు రాసి చరిత్రకారునిగా ప్రసిద్ధికెక్కారు. రిటైరయ్యాక కూడా పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ పత్రికల్లో వ్యాసాలు రాసి రాజధాని విశేషాలెన్నో ప్రజలకు చెప్పారు. చారిత్రక విశేషాలను కథలుకథలుగా వివరించిన లూథర్ చాలా ఆలస్యంగా (రిటైరైన పాతికేళ్లకు)స్వీయచరిత్ర రాయడం ఆశ్చర్యకరమే మరి. దేశ విభజన నాటికి పదమూడేళ్ల బాలుడైన లూథర్ ఇప్పుడు 85 ఏళ్ల వయసులో ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేరుతో రాసిన ఆత్మకథలో సొంత సంగతులతో పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నాటి పరిస్థితులు, సీఎంల వ్యవహార శైలి గురించి వెల్లడించారు. ఇప్పటికీ పాకిస్తాన్ గురించీ ముఖ్యంగా దాదాపు సగానికి పైగా జనాభా ఉన్న అక్కడి పంజాబ్ గురించి భారత ప్రజలకు పట్టని అనేక విశేషాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి.
పాకిస్తాన్ అనగానే ఇప్పటికీ ఉర్దూలోనే మెజారిటీ జనం మాట్లాడతారనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈ విషయంపైనే లూథర్ రాస్తూ, తాను స్కూల్లో చదివే రోజుల్లో ముస్లిం స్త్రీపురుషులు, హిందూ, సిక్కు కుర్రాళ్లు తప్పనిసరిగా ఉర్దూ నేర్చుకునే వారనీ, ఉర్దూరాని అబ్బాయిలను మగ పిల్లలుగా పరిగణించేవారు కాదని వెల్లడించారు. జనం మాతృభాష పంజాబీకి అప్పట్లో గుర్తింపు లేదు. 2006లో లూథర్ తన జన్మస్థలం లాహోర్ వెళ్లారు. తన అభినందనసభలో వక్తలందరూ పంజాబీలో మాట్లాడారనీ, తాను పంజాబ్‌కు దూరంగా ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న కారణంగా పంజాబీలో కాకుండా ఉర్దూలో మాట్లాడతానంటే అందుకు సభాధ్యక్షులు అంగీకరించారని లూథర్ చెప్పిన విషయం ప్రస్తుత పాక్ పంజాబ్‌లో వచ్చిన గణనీయ మార్పులకు అద్దం పడుతోంది. ఇప్పుడు పంజాబీయే పాకిస్తానీ ముస్లింలు, ఇండియాలోని పంజాబీ హిందువులు, సిక్కులను మళ్లీ కలుపుతోందనే విషయం ఏ బాన్సాయ్ ట్రీ చదివితే అర్థమౌతుంది.
సామాజిక గౌరవం కోసం స్వర్ణకారులే క్షత్రియులయ్యారు!
గాంధీ, నెహ్రూలయినా, అమితాబ్బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ అయినా తమ సొంతూళ్లు, తమ కులాలు, కుటుంబాల గురించి తమ ఆత్మకథల్లో చెప్పుకున్నవారే. ఇలాంటి వివరాల కోసమే ప్రముఖుల స్వీయచరిత్రలు చదువుతాం. లూథర్ తన పేరును బట్టి తనను క్రైస్తవుడనుకునేవారని తెలపడమేగాక, ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందో కూడా వివరించారు. రిజర్వేషన్ సౌకర్యాలు ఆశించి అనేక కులాలు బీసీ హోదా కోసం ఉద్యమిస్తున్న రోజులివి. నూరేళ్ల క్రితం పంజాబ్‌లో బాగా చదువుకుని, ఆర్థికంగా పైకొచ్చిన అనేక బీసీ కులాలవారు సామాజిక గుర్తింపు, గౌరవం కోసం క్షత్రియులమని చెప్పుకోవడమేగాక, జనాభా లెక్కల సేకరణలో అలాగే రికార్డు చేయించుకునేవారు. లూథర్ కుటుంబీకులు స్వర్ణకారులే అయినా తాము ఖత్రీలమని (పంజాబ్‌లో క్షత్రియులపేరు) ప్రకటించుకున్నారు. నరేంద్ర లూథర్ సమీప బంధువు ఒకరు అసలు విషయం ఆయనకు చిన్నప్పుడే చెప్పారట! ఇలాంటి ఆసక్తికర విషయాలు ఏ బాన్సాయ్ ట్రీలో ఎన్నో ఉన్నాయి.
మొదట పూర్వపు ఆంధ్ర రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా చేరిన లూథర్ ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి హయాంలో ఏడాది పదవి పొడిగింపు పొంది, 59 ఏళ్ల వయసులో రిటైరయ్యారు. సీఎం కావడానికి ముందు రాజకీయ, పాలనాపరమైన అనుభవం లేని ఎన్టీఆర్‌తో ఎలాంటి వింత అనుభవాలు ఎదురైందీ లూథర్ ఆసక్తికరమైన రీతిలో చెప్పారు. తన కొడుకు రాహుల్ మద్యానికి బానిసై పడిన కష్టాలు, అతని నుంచి విడాకులు తీసుకున్న కోడలిని ఎలా కూతురుగా చూసుకున్నదీ లూథర్ మనసును కదలించేలా రాశారు. ప్రస్తుతం పాక్‌లోని తన పూర్వీకుల గ్రామం బుడ్ఢా గొరాయాకు అంకితమిచ్చిన ఈ పంజాబీ అధికారి స్వీయ చరిత్రలో ఇప్పటి పాకిస్తాన్, ఇండియాల కథేగాక, తెలుగు ప్రాంతాల దశాబ్దాల విశేషాలు సజీవ చిత్రాలుగా దర్శనమిస్తాయి.
ప్రతులకు : ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేజీలు 267, వెల: రూ. 350, ప్రచురణ: నియోగి బుక్స్, niyogibooks@gmail.com
(నేటి సాయంత్రం 6.30 గంటలకు విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ స్వీయ చరిత్ర ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో జరగనుంది. పుస్తకావిష్కరణ తోపాటు లిటిల్ థియేటర్ గ్రూప్ వారిచే పుస్తకపఠనం కూడా ఉంటుంది.) – నాంచారయ్య మెరుగుమాల
Comments
Please login to add a commentAdd a comment