Nancharaiah Merugumala
-
‘మండలి’ చరిత్రలో ఎన్నో మలుపులు
భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని పశ్చిమబెంగాల్లో మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చికాకు తప్పదు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తేలిపోయింది. ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం రద్దయిన పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధ రణకు మమతా బెన ర్జీ కేబినెట్ మే 17న నిర్ణయించింది. కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక లాంఛనమే. కేంద్ర ప్రభుత్వం చొరవతో బెంగాల్లో కౌన్సిల్ ఏర్పాటుకు పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానించాకే రాష్ట్ర అసెంబ్లీ కోరిక నెరవేరుతుంది. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ రద్దుకు లేదా మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానాలపై కేంద్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందిం చవు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నా విపరీత జాప్యం సర్వసాధారణం. ఒక్కోసారి ఒక రాష్ట్రంలో మండలి పునరుద్ధ రణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, పాతిక ముప్పయి ఏళ్లయినా ఆ పని జరగదు. తమిళనాడులో శాసనమండలి పునరుద్ధరణకు 1989లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంత వరకూ అతీగతీ లేదు. అయినా, రాష్ట్రాలను పరిపాలించే పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగానో, ఆచరణలో కౌన్సిల్ వల్ల అవరోధాల వల్లనో విధాన పరిషత్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి పంపడం గత 30 ఏళ్లుగా జరుగున్న పనే. కేంద్రంలో తమకు అనుకూల ప్రభుత్వం ఉందా? వ్యతిరేక ప్రభుత్వం ఉందా? కేంద్రం పట్టించుకోకపోతే తమ తీర్మానం వృ«థా ప్రయాసేనా? అని ప్రజాతంత్ర రాజకీయ పార్టీలు ఆలోచిం చవు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో తనను బద్ధ శత్రువుగా భావించే బీజేపీ అధికారంలో ఉన్నా తాను ముందే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా, తన తక్షణ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్లో కౌన్సిల్ పునరుద్ధరణకు తీర్మానం పంపాలనే కృత నిశ్చయంతో తృణమూల్ ప్రభుత్వం ఉంది. కౌన్సిల్ అవసరం ఏమొచ్చింది? తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2011 లోనే కౌన్సిల్ మళ్లీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటిం చింది. అప్పటికి 34 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సింగూరు, నందిగ్రామ్ భూపోరాటాల్లో మమతకు బాసటగా నిలిచిన మేధావులు, విశిష్ట వ్యక్తులకు చట్టసభలో స్థానం కల్పించడానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిపై మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లు పట్టింది. మండలి మళ్లీ ఏర్పాటు ఆలోచన ఇన్నాళ్లకు కొద్దిగానైనా ముందుకు సాగడానికి ఈ అంశాన్ని నిన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా విడుదల చేసిన తృణమూల్ ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ఒక్కటే కారణం కాదు. సీఎం మమత, ఆర్థిక మంత్రి మదన్ మిత్రా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు. నందిగ్రామ్‌లో ఓడిన మమత తన పాత స్థానం భబానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమౌతున్న మాట వాస్తవమే. ఆమెకైతే సీఎంగా కొనసాగడానికి తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చీకాకు తప్పదు. మొత్తం 294 సీట్లలో మమత తన పూర్వ అనుచరుడు సువేందు అధికారిపై పోటీచేసిన నందిగ్రామ్‌పై దేశ ప్రజలందరి దృష్టి నిలిచింది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీ యాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం లేదని తేలిపోయింది. అందుకే, మహారాష్ట్ర, యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని నేటి ముఖ్యమంత్రులు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 నవంబర్‌లో అనూహ్య పరిస్థితుల్లో మహారాష్ట్ర సీఎం అయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యారు. బిహార్‌లో సీఎం పదవి చేపట్టిన నేతల్లో లాలూ, రబ్రీ, నితీశ్! బిహార్‌లో ఇప్పటికి 23 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టగా వారిలో ఏడుగురు ఎమ్మెల్సీలే. ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమి(జేడీయూ–బీజేపీ) మెజారిటీ సాధించడంతో 2005లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచీ ఆయన కౌన్సిల్ సభ్యునిగానే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 1990లో లోక్‌సభ ఎంపీగా ఉన్న లాలూ ప్రసాద్ తొలిసారి సీఎం పదవి చేపట్టాక రాష్ట్ర శాసన మండలికి ఎన్నికై ఐదేళ్లూ సీఎంగా ఉన్నారు.1995 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రెండేళ్లు సీఎం పదవిలో కొనసాగి రాజీనామా చేశారు. 1997లో ఆయన భార్య రబ్రీదేవి తన భర్త ఖాళీచేసిన పదవిని చేపట్టాక ఎమ్మెల్సీగా ఎన్నికై 2000 ఎన్నికల్లో మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌లో యాదవవర్గం నుంచి తొలి సీఎం అయిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయిన తొలి నేత. ఆయన పదవిలో ఉన్నది 51 రోజులేగాని రెండో బీసీ కమిషన్ (మండల్ కమిషన్) చైర్మన్‌గా దేశ ప్రజలందరికీ పరిచయమయ్యారు. సీఎం పదవి దక్కాక కౌన్సిల్‌కు ఎన్నికవడం కొత్త ఆనవాయితీ! గత 14 సంవత్సరాలకు పైగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రి పదవులో కొనసాగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 1952 నుంచి 1999 వరకూ సీఎం పదవిలో ఎమ్మెల్యేలే ఉన్నారు. 1999 నవంబర్ 2000 అక్టోబర్ మధ్య సీఎం పీఠంపై ఉన్న రామ్‌ప్రకాశ్ గుప్తా(బీజేపీ) యూపీలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ. బీఎస్పీ అధినేత్రి మాయా వతి 2007 ఎన్నికల్లో తన పార్టీ తొలిసారి మెజారిటీ సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టి మండలికి ఎన్నికై పదవిలో కొనసాగారు. 2002 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నిక ల్లోనూ అసెంబ్లీకి ఆమె పోటీ చేయలేదు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఎస్పీకి అప్పుడు మెజారిటీ రావడంతో ఆయన సీఎం అయ్యాక కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. తర్వాత 2017 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. తర్వాత కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మొదట సీఎం అయ్యాక కౌన్సిల్ సభ్యుడైన తొలి నేత రాజాజీ 1952 మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదు. దాంతో సీఎం పదవి చేపట్టాలని సి.రాజగోపాలాచారిని నెహ్రూ ఒప్పించారు. రాజాజీని గవర్నర్ శ్రీప్రకాశ కౌన్సిల్‌కు నామి నేట్ చేశాక సీఎంగా ప్రమాణం చేయించారు. దేశంలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ రాజాజీయే. మళ్లీ బెంగాల్ విషయానికొస్తే, 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అజయ్‌ముఖర్జీ నాయక త్వాన తొలి కాంగ్రెసేతర (యునైటెడ్ ఫ్రంట్) సర్కారు ఏర్పడింది. జ్యోతిబసు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని 8 నెలలకే గవర్నర్ ధర్మవీర బర్తరఫ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ మద్దతున్న పీసీ ఘోష్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ఖండించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న కౌన్సిల్లో ఘోష్ సర్కారుపై విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. 1969 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ వెంటనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానించి పంపగా, ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో దానికి ఆమోద ముద్ర వేయించారు. ఇందిర చొరవతో రద్దయిన మండలి మమత పట్టుదలతో ఎప్పుడు ప్రాణం పోసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. వ్యాసకర్త : నాంచారయ్య మెరుగుమాల సీనియర్ జర్నలిస్ట్ -
రాజకీయ జూదంగా కోటాల ఆట
రిజర్వేషన్లను ఎన్నికల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్దేశాలకు అతీతంగా ఉండేలా కొత్త కోటాలను 9వ షెడ్యూలులో చేర్చడం అతి సునాయాసం అన్నట్టుగా చెబుతున్నాయి. ఆ దారిన సాధించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టుబడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశంపై వివిధ రాజకీయపక్షాల వైఖరి ఆందోళనకరమైనదిగా మారుతోంది. రిజర్వేషన్ల కోసం వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల అమలులోని సాధ్యాసాధ్యాలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ధోరణి ప్రబలుతోంది. సామాజిక ఉద్రిక్తతలకు దారితీయగల సున్నిత సామా జిక అంశమైన రిజర్వేషన్లను బాధ్యతారహితమైన ఎన్నికల వాగ్దానంగా పలు రాజకీయ పార్టీలు దిగజారుస్తున్నాయి. కొత్తగా ఏ సామాజిక వర్గానికైనా రిజ ర్వేషన్లను కల్పించాలంటే ఎదురయ్యే రాజ్యాంగపరమైన, చట్టపరమైన అడ్డం కులను, చిక్కులను రాజకీయపార్టీలు విస్మరిస్తుండటం వల్ల అది కేవలం కేంద్రం లేదా రాష్ట్రం అధికారాల పరిధిలోని అంశం మాత్రమేననే అపోహ ప్రజల్లో ప్రబలుతోంది. ఇటీవలి కాలంలో తలెత్తిన పలు రిజర్వేషన్ల ఉద్యమాలు హింసాత్మకంగా మారి సామాజిక అశాంతికి దారితీయడంలో ప్రభు త్వాలు, పార్టీల బాధ్యతారహితమైన చర్యల, వాగ్దానాల పాత్ర తక్కువేమీ కాదు. వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని సుప్రీం కోర్టు పదేపదే చెబుతోంది. అయినా అంతకు మించిన కోటా అమలు సాధ్యమనే రీతిలో ప్రభుత్వాలు, పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా రిజర్వేషన్లను కల్పి స్తామని ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశాలకు అతీ తంగా కోటాలను పెంచడానికి వీలుగా వాటిని 9వ షెడ్యూలులో చేర్చడం అతి సులువనే రీతిలో మాట్లాడుతున్నాయి. ఈ దారిన కల్పించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని సుప్రీం కోర్టు హెచ్చరించింది. అది తెలిసి కూడా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ రిజర్వేషన్లను కోరే పలు∙సామాజిక వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన, వెనుకబడ్డామని భావిస్తున్న వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టు బడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం. అప్పుడే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ముందుకు వచ్చిన, వస్తున్న రిజర్వేషన్ల ఉద్య మాలను సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో జాట్లు తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రారంభించిన ఉద్యమం హరియా ణాకు విస్తరించింది. ఫలితంగా ఆ ప్రభుత్వాలు జాట్లను బీసీ జాబితాలో చేర్చాయి. కోర్టులు ఈ నిర్ణయం చెల్లదని కొట్టివేశాయి. దీంతో కేంద్రంలోని నాటి యూపీఏ సర్కారు జాట్లను బీసీ లిస్టులో చేర్చింది. అదీ చెల్లదని సుప్రీం కోర్టు 2015 మార్చి 17న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చాక కూడా హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం 2016లో జాట్లకు బీసీ హోదాను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ, 2016 మేలో పంజాబ్, హరియాణా హైకోర్టు కూడా సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తూ ఈ నిర్ణయం చట్టవ్యతిరేకమని ప్రకటించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ జాట్లను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించిందని కూడా కోర్టు గుర్తుచేసింది. రాజస్థాన్‌లో గుజ్జర్ల కోటా అందోళన కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా, రాజస్థాన్‌లో బీసీలైన గుజ్జర్లు తమను షెడ్యూల్డ్ జాతుల(ఎస్టీ–ఆదివాసీలు)జాబితాలో చేర్చాలని ఉద్యమించారు. బీసీ కులాన్ని ఎస్టీ లిస్టులో చేర్చడం కుదరదని గుజ్జర్లకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వసుంధరారాజే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచి, గుజ్జర్లను బాగా వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) గ్రూపులో చేర్చింది. గుజ్జర్లకు ప్రత్యేకించి ఐదు శాతం కోటా కల్పిస్తూ చేసిన ఈ చట్టం ఫలితంగా ఆ రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. ఆ కారణంగా ఆ చట్టం అమలుపై రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్టే విధించాయి. రిజర్వేషన్లకు సంబంధించిన ఓ కేసులో 1993 నవంబర్‌లో నాటికే సుప్రీం కోర్టు ఎక్కడైనా మొత్తం కోటా 50 శాతానికి మించకూడదని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలో మరాఠాలకు కోటా సాధ్యమా? మహారాష్ట్రలో దాదాపు నాలుగోవంతు జనాభాగా ఉన్న మరాఠాలు (ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అధికులు ఆ వర్గం వారే) 2014 పార్లమెంటు ఎన్నికల ముందు తమను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లను కల్పించాలని ఉద్యమిం చారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2008లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఎన్సీపీ నేత శరద్ పవార్లు ఈ డిమాం డ్కు లోపాయికారి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి నాలుగేళ్లపాటూ ఈ సమస్యను అవి సాగదీశాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠాలను బీసీల జాబితాలో చేర్చి, వారికి 16 శాతం కోటాను కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దాని అమలును నిలిపివేసి, బొంబాయి హైకోర్టు విచారణ చేపట్టింది. మొత్తం కోటా 50 శాతం దాటిందనీ, మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిలేరని కోర్టు తేల్చింది. గుజరాతీ ప్రధాని పాలనలో పాటీదార్ల ఆందోళన! గుజరాత్లో 2015 జులైలో 22 ఏళ్ల యువకుడు హార్దిక్‌పటేల్ నాయకత్వాన పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఆధ్వర్యంలో కోటా ఆందోళన మొదలైంది. జనాభాలో 12 శాతంగా ఉన్న పటేళ్లు దాదాపు అన్ని రంగా ల్లోనూ ముందున్న సామాజికవర్గం. వారు కూడా తమను బీసీ జాబితాలో చేర్చాలనీ, లేకుంటే అన్ని కోటాలు రద్దుచేయాలని వీధుల్లోకి వచ్చారు. పోలీసు కాల్పుల్లో 12 మంది పాటీదార్లు ప్రాణాలు కోల్పోయారు. కిందటేడాది ఏప్రిల్ 30న పాటీదార్లకు కోటా కల్పించే లక్ష్యంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కులాలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్ కల్పించింది. కానీ కోటా మొత్తం 50 శాతం దాటిందని గుజరాత్ హైకోర్టు ఈ కొత్త రిజర్వేషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యమని ప్రకటించిన పాస్ నేతలు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. పటేళ్ల కోటా సాధ్యాసాధ్యాలపై పూర్తి అవగాహన ఉన్నాగాని, కాంగ్రెస్ ఈ వివాదాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వేసిన ఎత్తుగడ ఫలించినట్టు కనిపిస్తోంది. పాస్ ప్రతినిధివర్గంతో కేంద్ర మాజీ మంత్రి కపిల్సిబ్బల్ జరిపిన చర్చలతో కాంగ్రెస్ పాటీదార్ల నేతల మద్దతును సంపాదించింది. తాము అధికారంలోకి వస్తే 31 సీ అధికరణ సాయంతో కోర్టుల విచారణలో వీగిపోని విధంగా పటేళ్లకు బీసీ హోదా కల్పించి, రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న 49 శాతం రిజర్వేషన్లకు అదనంగా పాటీదార్లకు కోటా కల్పించగలమని వారిని నమ్మించగలిగారు. 9వ షెడ్యూలులో అన్ని కోటా చట్టాలనూ చేర్చడం కుదిరేనా? మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిన చట్టాలను కోర్టుల విచారణ పరిధి నుంచి తప్పించడానికి వీలుగా వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్పించడంలో 1994లో తమిళనాడు సీఎం జయలలిత విజయం సాధిం చారు. కేంద్రంలోని నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమె 76వ రాజ్యాంగ సవరణను చేయించడం ద్వారా తమిళనాడు కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చించారు. అప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా కోటా కోసం, బీసీ హోదా కోసం డిమాండ్ చేసే ప్రతి సామాజికవర్గం 9వ షెడ్యూలు ప్రస్తావన తేవడం మొదలైంది. 2007లో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు... 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు సైతం కోర్టుల పరిశీలనకు అతీతం కాదనీ, 1974 ఏప్రిల్ 23 తర్వాత ఇందులో చేర్చిన చట్టాలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా ఉంటే, వాటిని చెల్లవని ప్రకటించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి 1951లో చేసిన తొలి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూలు ఏర్పాటు చేసి, జమీందారీల రద్దు, భూసంస్కరణ చట్టాలను అందులో చేర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడానికి చట్టాన్ని చేసి, కేంద్ర ఆమోదానికి పంపింది. 49 శాతానికి మించి పెరిగిన ఈ కొత్త కోటాలు అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చాల్పి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రపదేశ్‌లో కాపులను బీసీల్లో చేర్చి వారికి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ 1980ల మధ్యలో మొదలైంది. చివరికి 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోట్ల విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కాపు సామాజికవర్గం డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి వారిని బీసీ జాబిలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. విభజనానంతర ఏపీలో కూడా మొత్తం కోటాలు దాదాపు 50 శాతం వరకూ ఉండగా, కాపులను బీసీల్లో చేర్చి ఇతర బీసీ కులాలకు నష్టంలేని రీతిలో రిజర్వేషన్లు అమలుచేస్తానని చంద్రబాబు నాయుదు నాయకత్వంలోని తెలుగుదేశం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం అమలు కోసం కాపులు ఉద్యమిం చగా, తెలుగుదేశం ప్రభుత్వం కిందటేడాది ఫిబ్రవరిలో రిటైర్డ్ జడ్జి మంజు నాథ నాయకత్వాన బీసీ కమిషన్‌ను నియమించింది. వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని ఓ పక్క మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టారు. 9 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన బీసీ కమిషన్ ఇంకా ఆ పని పూర్తిచేసే స్థితికి చేరలేదు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా కాపులను బీసీల్లో చేర్చడం తథ్యమంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. బీసీ కమిషన్ ఏ కులాన్నయినా వెనుకబడిన కులమని నిర్థారించకుండా బీసీ జాబి తాలో చేర్చవద్దని, చేర్చినా చెల్లవని గతంలో కోర్టులు తీర్పులిచ్చాయి. అయినా మంజునాథ కమిషన్ ఓ నిర్ధారణకు రాకుండానే పాలకపక్షం కాపులకు కోటా వచ్చినట్టేననే విధంగా వారికి హామీలిస్తోంది. రిజర్వేషన్లను ఎన్ని కల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు ఇలా అసత్యాలు, అర్థస త్యాలతో వివిధ సామాజికవర్గాల ఆకాంక్షలతో ఆటలాడక తప్పదు. పలు రాష్ట్రాల్లో బీసీ హోదా కోసం అనేక సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తుండగా, వారి డిమాండ్లలో ఇమిడి ఉన్న రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు వివరించడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నించడం లేదు. ఏ కులం ఏమడిగినావెంటనే ఇస్తామని చెబుతూ సర్కార్లు ప్రజల ఉద్వేగాలతో, ఆకాంక్షలతో చెలగాటమాడుతుండటం ప్రమాదకరం. నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ పాత్రికేయులు -
లాహోర్ నుంచి బంజారాహిల్స్ వరకూ!
విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ తెలుగునాట మూడు దశాబ్దాలకుపైగా పనిచేయడమేగాదు, హైదరాబాద్ ప్రజలు, పాలకుల గురించి పుస్తకాలు రాసి చరిత్రకారునిగా ప్రసిద్ధికెక్కారు. రిటైరయ్యాక కూడా పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ పత్రికల్లో వ్యాసాలు రాసి రాజధాని విశేషాలెన్నో ప్రజలకు చెప్పారు. చారిత్రక విశేషాలను కథలుకథలుగా వివరించిన లూథర్ చాలా ఆలస్యంగా (రిటైరైన పాతికేళ్లకు)స్వీయచరిత్ర రాయడం ఆశ్చర్యకరమే మరి. దేశ విభజన నాటికి పదమూడేళ్ల బాలుడైన లూథర్ ఇప్పుడు 85 ఏళ్ల వయసులో ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేరుతో రాసిన ఆత్మకథలో సొంత సంగతులతో పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నాటి పరిస్థితులు, సీఎంల వ్యవహార శైలి గురించి వెల్లడించారు. ఇప్పటికీ పాకిస్తాన్ గురించీ ముఖ్యంగా దాదాపు సగానికి పైగా జనాభా ఉన్న అక్కడి పంజాబ్ గురించి భారత ప్రజలకు పట్టని అనేక విశేషాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. పాకిస్తాన్ అనగానే ఇప్పటికీ ఉర్దూలోనే మెజారిటీ జనం మాట్లాడతారనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈ విషయంపైనే లూథర్ రాస్తూ, తాను స్కూల్లో చదివే రోజుల్లో ముస్లిం స్త్రీపురుషులు, హిందూ, సిక్కు కుర్రాళ్లు తప్పనిసరిగా ఉర్దూ నేర్చుకునే వారనీ, ఉర్దూరాని అబ్బాయిలను మగ పిల్లలుగా పరిగణించేవారు కాదని వెల్లడించారు. జనం మాతృభాష పంజాబీకి అప్పట్లో గుర్తింపు లేదు. 2006లో లూథర్ తన జన్మస్థలం లాహోర్ వెళ్లారు. తన అభినందనసభలో వక్తలందరూ పంజాబీలో మాట్లాడారనీ, తాను పంజాబ్‌కు దూరంగా ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న కారణంగా పంజాబీలో కాకుండా ఉర్దూలో మాట్లాడతానంటే అందుకు సభాధ్యక్షులు అంగీకరించారని లూథర్ చెప్పిన విషయం ప్రస్తుత పాక్ పంజాబ్‌లో వచ్చిన గణనీయ మార్పులకు అద్దం పడుతోంది. ఇప్పుడు పంజాబీయే పాకిస్తానీ ముస్లింలు, ఇండియాలోని పంజాబీ హిందువులు, సిక్కులను మళ్లీ కలుపుతోందనే విషయం ఏ బాన్సాయ్ ట్రీ చదివితే అర్థమౌతుంది. సామాజిక గౌరవం కోసం స్వర్ణకారులే క్షత్రియులయ్యారు! గాంధీ, నెహ్రూలయినా, అమితాబ్‌బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ అయినా తమ సొంతూళ్లు, తమ కులాలు, కుటుంబాల గురించి తమ ఆత్మకథల్లో చెప్పుకున్నవారే. ఇలాంటి వివరాల కోసమే ప్రముఖుల స్వీయచరిత్రలు చదువుతాం. లూథర్ తన పేరును బట్టి తనను క్రైస్తవుడనుకునేవారని తెలపడమేగాక, ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందో కూడా వివరించారు. రిజర్వేషన్ సౌకర్యాలు ఆశించి అనేక కులాలు బీసీ హోదా కోసం ఉద్యమిస్తున్న రోజులివి. నూరేళ్ల క్రితం పంజాబ్‌లో బాగా చదువుకుని, ఆర్థికంగా పైకొచ్చిన అనేక బీసీ కులాలవారు సామాజిక గుర్తింపు, గౌరవం కోసం క్షత్రియులమని చెప్పుకోవడమేగాక, జనాభా లెక్కల సేకరణలో అలాగే రికార్డు చేయించుకునేవారు. లూథర్ కుటుంబీకులు స్వర్ణకారులే అయినా తాము ఖత్రీలమని (పంజాబ్‌లో క్షత్రియులపేరు) ప్రకటించుకున్నారు. నరేంద్ర లూథర్ సమీప బంధువు ఒకరు అసలు విషయం ఆయనకు చిన్నప్పుడే చెప్పారట! ఇలాంటి ఆసక్తికర విషయాలు ఏ బాన్సాయ్ ట్రీలో ఎన్నో ఉన్నాయి. మొదట పూర్వపు ఆంధ్ర రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా చేరిన లూథర్ ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి హయాంలో ఏడాది పదవి పొడిగింపు పొంది, 59 ఏళ్ల వయసులో రిటైరయ్యారు. సీఎం కావడానికి ముందు రాజకీయ, పాలనాపరమైన అనుభవం లేని ఎన్టీఆర్‌తో ఎలాంటి వింత అనుభవాలు ఎదురైందీ లూథర్ ఆసక్తికరమైన రీతిలో చెప్పారు. తన కొడుకు రాహుల్ మద్యానికి బానిసై పడిన కష్టాలు, అతని నుంచి విడాకులు తీసుకున్న కోడలిని ఎలా కూతురుగా చూసుకున్నదీ లూథర్ మనసును కదలించేలా రాశారు. ప్రస్తుతం పాక్‌లోని తన పూర్వీకుల గ్రామం బుడ్ఢా గొరాయాకు అంకితమిచ్చిన ఈ పంజాబీ అధికారి స్వీయ చరిత్రలో ఇప్పటి పాకిస్తాన్, ఇండియాల కథేగాక, తెలుగు ప్రాంతాల దశాబ్దాల విశేషాలు సజీవ చిత్రాలుగా దర్శనమిస్తాయి. ప్రతులకు : ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పేజీలు 267, వెల: రూ. 350, ప్రచురణ: నియోగి బుక్స్, niyogibooks@gmail.com (నేటి సాయంత్రం 6.30 గంటలకు విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ స్వీయ చరిత్ర ‘ఏ బాన్సాయ్ ట్రీ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో జరగనుంది. పుస్తకావిష్కరణ తోపాటు లిటిల్ థియేటర్ గ్రూప్ వారిచే పుస్తకపఠనం కూడా ఉంటుంది.) – నాంచారయ్య మెరుగుమాల -
రాజకీయాల్లో కులానికి రజనీ కొఠారీ కొత్త భాష్యం
సోమవారం ఢిల్లీలో కన్నుమూసిన ప్రఖ్యాత రాజకీయ సిద్ధాంతవేత్త రజనీ కొఠారీ మానసపుత్రిక సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవల పింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్). ఇది సామాజికశాస్త్రాల పరిశోధనాసంస్థ. 1963లో స్థాపించిన ఈ సంస్థ రెండేళ్ల క్రితం స్వర్ణోత్సవం జరుపుకుంది. కొఠారీ పేరు చెబితే సీఎస్డీఎస్.. సీఎస్డీఎస్ అనగానే కొఠారీ పేరు గుర్తుకొచ్చేలా ఆయన ఈ సంస్థను నిర్మిం చారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోలింగ్‌కు ముందు, తర్వాత జనం ఎటు, ఎందుకు మొగ్గారని సర్వే చేసి, మీడియా సంస్థలకు అందని అనేక వాస్తవాలను ప్రజలకు వెల్లడించడం ద్వారా సీఎస్డీఎస్ భారత ప్రజా స్వామ్యం ఆధునిక రూపాలను ఆవిష్కరిస్తూనే ఉంది. ఆమ్ఆద్మీ పార్టీలో చేరిన ఎన్నికల విశ్లేషకుడు, సీనియర్ ఫెలో యోగేంద్రయాదవ్ నిన్నమొన్నటి వరకూ టీవీ చానళ్లలో సీఎస్డీఎస్ ముఖచిత్రంలా దర్శనమిచ్చే వాడు. 1960, 70ల వరకూ మార్క్సిస్టు మేధావులు సమ కాలీన రాజకీయ పరిణామాలపై వర్గమేతప్ప కులం ‘వాసన’ లేకుండా చేసిన సైద్ధాంతీకరణల నుంచి కొఠారీ తన రచనలు, సీఎస్డీఎస్ ద్వారా భారత ప్రజలకు ప్రజాస్వామ్యం, ఎన్నికలపై సమగ్ర అవ గాహనకల్పించే ప్రయత్నం చేశారు. రాం మనోహర్ లోహియా తర్వాత భారత సమాజం, రాజకీయాల్లో కులం పాత్ర ఎంతటిదో వివరించిన దార్శనికుడు కొఠారీ. 1928 ఆగస్ట్ 16న గుజరాతీ సం పన్న జైన వైశ్య కుటుంబంలో పుట్టిన కొఠారీ 33 ఏళ్ల వయసులో 1970లో రాసిన ‘పాలిటిక్స్ ఇన్ ఇండియా’ నాటి వరకూ సాగిన భారత రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పింది. రాజకీయాల విశ్లేషణపై రాజ కీయ పండితులకు కొత్త పాఠాలు నేర్పింది. 1973లో ఆయన సంపాదకత్వంలో విడుదలైన ‘కాస్ట్ ఇన్ ఇండి యన్ పాలిటిక్స్’ భారత రాజకీయాల్లో కులం పాత్ర ఏమిటో విడమరిచి చెప్పింది. తమిళనాడులో ఒకప్పటి అంటరాని కులమైన నాడార్లు ఎలా ప్రగతి సాధించారు? తెలుగునాట ప్రధాన వ్యవసాయ కులాలైన కమ్మలు, రెడ్లు పలు వర్గాలుగా చీలి ఉన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఎలా రాజకీయ పునాదులయ్యారు? గుజ రాత్లో అనేక పేర్లతో విడిపోయిన జనం క్షత్రియులు అనే పేరుతో ఎలా ఏకమ య్యారు? అనే ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో వివరించారు. ‘‘రాజకీయాల్లో కులతత్వం ఉందని బాధపడే మేధావులు కోరుకు నేది సమాజంతో ఎలాంటి బం ధంలేని రాజకీయాలు. వారికి రాజకీ యాలు, కుల స్వభావంపై స్పష్టమైన అవగాహనలేదనుకోవాలి. వారిలో చాలా మంది రాజకీయాలనూ, కులవ్యవస్థనూ బయటకు విసిరిపారేయాలని కోరుకుంటున్నారు’’అని కొఠారీ 40 ఏళ్ల క్రితమే పై పుస్తకానికి రాసిన ముందు మాటలో తేల్చి చెప్పారు. రాజకీయనాయకులు తమ ఆచరణ ద్వారా సమాజంలోని ఇతర వర్గాలు, సంఘాల పునాదులను మార్చినట్టుగానే కులం రూపాన్ని కూడా మార్చుతారు’’ అంటూ కులవ్యవస్థను అర్థం చేసుకోవ డంలో కొత్త పనిముట్లు అందించారు కొఠారీ. నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ పాత్రికేయులు