రాజకీయాల్లో కులానికి రజనీ కొఠారీ కొత్త భాష్యం | Rajani Kothari reinterpretation on caste politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో కులానికి రజనీ కొఠారీ కొత్త భాష్యం

Published Wed, Jan 21 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

రజనీ కొఠారీ 1928-2015

రజనీ కొఠారీ 1928-2015

 సోమవారం ఢిల్లీలో కన్నుమూసిన ప్రఖ్యాత రాజకీయ సిద్ధాంతవేత్త రజనీ కొఠారీ మానసపుత్రిక సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవల పింగ్ స్టడీస్ (సీఎస్‌డీఎస్). ఇది సామాజికశాస్త్రాల పరిశోధనాసంస్థ. 1963లో స్థాపించిన ఈ సంస్థ రెండేళ్ల క్రితం స్వర్ణోత్సవం జరుపుకుంది. కొఠారీ పేరు చెబితే సీఎస్‌డీఎస్.. సీఎస్‌డీఎస్ అనగానే కొఠారీ పేరు గుర్తుకొచ్చేలా ఆయన ఈ సంస్థను నిర్మిం చారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోలింగ్‌కు ముందు, తర్వాత జనం ఎటు, ఎందుకు మొగ్గారని సర్వే చేసి, మీడియా సంస్థలకు అందని అనేక వాస్తవాలను ప్రజలకు వెల్లడించడం ద్వారా సీఎస్‌డీఎస్ భారత ప్రజా స్వామ్యం ఆధునిక రూపాలను ఆవిష్కరిస్తూనే ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరిన ఎన్నికల విశ్లేషకుడు, సీనియర్ ఫెలో యోగేంద్రయాదవ్ నిన్నమొన్నటి వరకూ టీవీ చానళ్లలో సీఎస్‌డీఎస్ ముఖచిత్రంలా దర్శనమిచ్చే వాడు.

1960, 70ల వరకూ మార్క్సిస్టు మేధావులు సమ కాలీన రాజకీయ పరిణామాలపై వర్గమేతప్ప కులం ‘వాసన’ లేకుండా చేసిన సైద్ధాంతీకరణల నుంచి కొఠారీ తన రచనలు, సీఎస్‌డీఎస్ ద్వారా భారత ప్రజలకు ప్రజాస్వామ్యం, ఎన్నికలపై సమగ్ర అవ గాహనకల్పించే ప్రయత్నం చేశారు. రాం మనోహర్ లోహియా తర్వాత భారత సమాజం, రాజకీయాల్లో కులం పాత్ర ఎంతటిదో వివరించిన దార్శనికుడు కొఠారీ. 1928 ఆగస్ట్ 16న గుజరాతీ సం పన్న జైన వైశ్య కుటుంబంలో పుట్టిన కొఠారీ 33 ఏళ్ల వయసులో 1970లో రాసిన ‘పాలిటిక్స్ ఇన్ ఇండియా’ నాటి వరకూ సాగిన భారత రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పింది. రాజకీయాల విశ్లేషణపై రాజ కీయ పండితులకు కొత్త పాఠాలు నేర్పింది. 1973లో ఆయన సంపాదకత్వంలో విడుదలైన ‘కాస్ట్ ఇన్ ఇండి యన్ పాలిటిక్స్’ భారత రాజకీయాల్లో కులం పాత్ర ఏమిటో విడమరిచి చెప్పింది. తమిళనాడులో ఒకప్పటి అంటరాని కులమైన నాడార్లు ఎలా ప్రగతి సాధించారు? తెలుగునాట ప్రధాన వ్యవసాయ కులాలైన కమ్మలు, రెడ్లు పలు వర్గాలుగా చీలి ఉన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఎలా రాజకీయ పునాదులయ్యారు? గుజ రాత్‌లో అనేక పేర్లతో విడిపోయిన జనం క్షత్రియులు అనే పేరుతో ఎలా  ఏకమ య్యారు? అనే ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో వివరించారు.

‘‘రాజకీయాల్లో కులతత్వం ఉందని బాధపడే మేధావులు కోరుకు నేది సమాజంతో ఎలాంటి బం ధంలేని రాజకీయాలు. వారికి రాజకీ యాలు, కుల స్వభావంపై స్పష్టమైన అవగాహనలేదనుకోవాలి. వారిలో చాలా మంది రాజకీయాలనూ, కులవ్యవస్థనూ బయటకు విసిరిపారేయాలని కోరుకుంటున్నారు’’అని కొఠారీ 40 ఏళ్ల క్రితమే పై పుస్తకానికి రాసిన ముందు మాటలో తేల్చి చెప్పారు. రాజకీయనాయకులు తమ ఆచరణ ద్వారా సమాజంలోని ఇతర వర్గాలు, సంఘాల పునాదులను మార్చినట్టుగానే కులం రూపాన్ని కూడా మార్చుతారు’’ అంటూ కులవ్యవస్థను అర్థం చేసుకోవ డంలో కొత్త పనిముట్లు అందించారు కొఠారీ.                                                   
  నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement