తెలుగుదేశం యువ కిశోరం లోకేష్ బాబుకు ఉన్నట్టుండి రెడ్లు గుర్తుకు వచ్చారు. రాయలసీమలో పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్న లోకేష్‌కు ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు గుర్తుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో అయినా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అయినా లోకేష్‌కు రెడ్లు గుర్తుకు రాలేదు. ఎందుకో ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు అంటూ మాట్లాడు తున్నారు. రెడ్ల సామాజిక వర్గ మీటింగులు పెడుతున్నారు! ఆ మీటింగుల్లో ఎవరో ఒక రెడ్డి చెప్పారట.. లోకేష్ పేరును లోకేష్ రెడ్డిగా పెట్టుకోమంటూ! ఏమిటో ఈ కలికాలం!
చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా కడపకు మించిన స్థాయిలోనే రెడ్ల జనాభా ఉంది. అయితే లోకేష్ ఆ జిల్లాల్లో ఎక్కడా రెడ్ల ప్రస్తావన, రెడ్లను ఉద్ధరించే ప్రస్తావన తీసుకురాలేదు. మరి కడప రెడ్లనే లోకేష్ ఉద్ధరిస్తారు కాబోలు. తమది రెడ్ల పార్టీ అని చెప్పుకోవడానికి కడప జిల్లాలో లోకేష్ చాలా ప్రయాసపడుతున్నారు. తనకు నోరు తిరగని రీతిలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అయితే లోకేష్‌కు రెడ్లపై ప్రేమాప్యాయాతలు కారిపోతున్న దశలో గుర్తుకు చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. వాటిల్లో ఒకటి.. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాల్లో హతమైన రెడ్లకు ఇప్పుడు లోకేషుడు ఏం సమాధానం ఇస్తారనేది!
తన తండ్రి సీఎంగా ఉండగా.. అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర నాయకత్వంలో సాగించిన ఫ్యాక్షన్ హత్యాకాండలో కనీసం రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీశారు కదా!. అందులో మెజారిటీ మంది కాంగ్రెస్ కార్యకర్తలు. కనీసం వంద మందికి పైగా రెడ్లు. రాజకీయ కక్షల కొద్దీ, అక్కసు కొద్దీ, ఆధిపత్యం కోసం జరిగిన హత్యలవి. మరి ఆ హత్యలు జరిగినప్పుడు రెడ్లు గుర్తుకు రాలేదా!. బహుశా అప్పటికి లోకేష్‌కు ఈ మాత్రం బుద్ధి కూడా రాలేదనుకుందాం. మరి చంద్రబాబుకు తెలియదా!
1995 నుంచి 2004ల మధ్యన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎంతమంది రెడ్లు కేవలం రాజకీయ కారణాలు, ఆధిపత్యం, ఫ్యాక్షన్ కారణాలతో హత్యకు గురయ్యారో లోకేష్‌కు తెలుసోలేదో కానీ... స్థానికులకు తెలుసు. అప్పటి చరిత్రను మరిచిపోదాం అంటారా.. 2014 నుంచి 2019 మధ్యన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్లను తెగ నరకలేదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, లోకేషుడు మంత్రయ్యాకానే.. పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కంగటి నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయలేదా!
పెద్దగా హడావుడి లేకుండా, కేవలం తన జీప్ లో మాత్రమే ప్రయాణిస్తూ.. ప్రత్యర్థులు తన కోసం పొంచి ఉంటారనే భయపడాల్సిన నేపథ్యం లేని నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయడంలో తెలుగుదేశం నేతల పాత్ర ఎంతో అప్పుడు లోకేష్ చెప్పరా?. రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో ప్రసాద్ రెడ్డిని కత్తులతో నరికినప్పుడు లోకేష్‌కు రెడ్లు గుర్తుకు రాలేదు కాబోలు!
నారాయణరెడ్డి కానీ, ప్రసాద్‌రెడ్డి కానీ విపరీతమైన ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వారు కాదు. కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అడ్డుగా ఉన్న వారే కానీ.. వారేమీ తమ ప్రత్యర్థులను హత్యలు చేసిన వారు, చేయించిన వారు కాదు. కేవలం రాజకీయంగా అడ్డున్నారనే కారణాలతోనే ఈ హత్యలు జరిగాయి. ఇవే కావు.. పరిటాల రవి, ఆర్వోసీ కాలం నాటి హత్యలు కూడా కేవలం క్రూరత్వంతో, రాక్షసత్వంతో జరిగిన హత్యలే హత్యలను సమర్థించుకోవడానికి వాటికి ఫ్యాక్షన్ రంగును పులిమారు.
చదవండి: బాబు బాగా ‘వరెస్టు’.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం..
ప్రత్యేకించి చంద్రబాబు తనయుడు అనంతపురం దాటాకా, కర్నూలు దాటుకుని వచ్చాకా.. కడపలో అడుగుపెట్టాకా రెడ్ల సంక్షేమం, రెడ్లపై ప్రేమాప్యాయతలు కురిస్తూ కామెడీ చేస్తున్నారు. ఇలా రెడ్లపై మాట్లాడే దమ్ము కనీసం, ప్రేమ చూపే శక్తి పక్క జిల్లాల్లో కూడా నీకు లేకపాయె కదా లోకేషా! తండ్రికి మించిన జిత్తుల మారిలా ఉన్నావే!
ఎన్నికల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని స్వయంగా లోకేష్ తన ప్రకటన ద్వారా నిరూపించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు సరి కాదంటున్నారు రాయలసీమ వాసులు. ఒక రాయలసీమ రెడ్డి సోదరుడు సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం ఇది.
-సత్యానందరెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment