రిజర్వేషన్ల కోసం పాటీదార్ల ఆందోళన (ఫైల్ ఫొటో)
రిజర్వేషన్లను ఎన్నికల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్దేశాలకు అతీతంగా ఉండేలా కొత్త కోటాలను 9వ షెడ్యూలులో చేర్చడం అతి సునాయాసం అన్నట్టుగా చెబుతున్నాయి. ఆ దారిన సాధించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టుబడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం.
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశంపై వివిధ రాజకీయపక్షాల వైఖరి ఆందోళనకరమైనదిగా మారుతోంది. రిజర్వేషన్ల కోసం వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల అమలులోని సాధ్యాసాధ్యాలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ధోరణి ప్రబలుతోంది. సామాజిక ఉద్రిక్తతలకు దారితీయగల సున్నిత సామా జిక అంశమైన రిజర్వేషన్లను బాధ్యతారహితమైన ఎన్నికల వాగ్దానంగా పలు రాజకీయ పార్టీలు దిగజారుస్తున్నాయి. కొత్తగా ఏ సామాజిక వర్గానికైనా రిజ ర్వేషన్లను కల్పించాలంటే ఎదురయ్యే రాజ్యాంగపరమైన, చట్టపరమైన అడ్డం కులను, చిక్కులను రాజకీయపార్టీలు విస్మరిస్తుండటం వల్ల అది కేవలం కేంద్రం లేదా రాష్ట్రం అధికారాల పరిధిలోని అంశం మాత్రమేననే అపోహ ప్రజల్లో ప్రబలుతోంది. ఇటీవలి కాలంలో తలెత్తిన పలు రిజర్వేషన్ల ఉద్యమాలు హింసాత్మకంగా మారి సామాజిక అశాంతికి దారితీయడంలో ప్రభు త్వాలు, పార్టీల బాధ్యతారహితమైన చర్యల, వాగ్దానాల పాత్ర తక్కువేమీ కాదు. వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని సుప్రీం కోర్టు పదేపదే చెబుతోంది.
అయినా అంతకు మించిన కోటా అమలు సాధ్యమనే రీతిలో ప్రభుత్వాలు, పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా రిజర్వేషన్లను కల్పి స్తామని ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశాలకు అతీ తంగా కోటాలను పెంచడానికి వీలుగా వాటిని 9వ షెడ్యూలులో చేర్చడం అతి సులువనే రీతిలో మాట్లాడుతున్నాయి. ఈ దారిన కల్పించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని సుప్రీం కోర్టు హెచ్చరించింది. అది తెలిసి కూడా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ రిజర్వేషన్లను కోరే పలు∙సామాజిక వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన, వెనుకబడ్డామని భావిస్తున్న వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టు బడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం. అప్పుడే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ముందుకు వచ్చిన, వస్తున్న రిజర్వేషన్ల ఉద్య మాలను సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాం.
ఉదాహరణకు, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో జాట్లు తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రారంభించిన ఉద్యమం హరియా ణాకు విస్తరించింది. ఫలితంగా ఆ ప్రభుత్వాలు జాట్లను బీసీ జాబితాలో చేర్చాయి. కోర్టులు ఈ నిర్ణయం చెల్లదని కొట్టివేశాయి. దీంతో కేంద్రంలోని నాటి యూపీఏ సర్కారు జాట్లను బీసీ లిస్టులో చేర్చింది. అదీ చెల్లదని సుప్రీం కోర్టు 2015 మార్చి 17న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చాక కూడా హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం 2016లో జాట్లకు బీసీ హోదాను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ, 2016 మేలో పంజాబ్, హరియాణా హైకోర్టు కూడా సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తూ ఈ నిర్ణయం చట్టవ్యతిరేకమని ప్రకటించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ జాట్లను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించిందని కూడా కోర్టు గుర్తుచేసింది.
రాజస్థాన్‌లో గుజ్జర్ల కోటా అందోళన
కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా, రాజస్థాన్‌లో బీసీలైన గుజ్జర్లు తమను షెడ్యూల్డ్ జాతుల(ఎస్టీ–ఆదివాసీలు)జాబితాలో చేర్చాలని ఉద్యమించారు. బీసీ కులాన్ని ఎస్టీ లిస్టులో చేర్చడం కుదరదని గుజ్జర్లకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వసుంధరారాజే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచి, గుజ్జర్లను బాగా వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) గ్రూపులో చేర్చింది. గుజ్జర్లకు ప్రత్యేకించి ఐదు శాతం కోటా కల్పిస్తూ చేసిన ఈ చట్టం ఫలితంగా ఆ రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. ఆ కారణంగా ఆ చట్టం అమలుపై రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్టే విధించాయి. రిజర్వేషన్లకు సంబంధించిన ఓ కేసులో 1993 నవంబర్‌లో నాటికే సుప్రీం కోర్టు ఎక్కడైనా మొత్తం కోటా 50 శాతానికి మించకూడదని తీర్పు ఇచ్చింది.
మహారాష్ట్రలో మరాఠాలకు కోటా సాధ్యమా?
మహారాష్ట్రలో దాదాపు నాలుగోవంతు జనాభాగా ఉన్న మరాఠాలు (ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అధికులు ఆ వర్గం వారే) 2014 పార్లమెంటు ఎన్నికల ముందు తమను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లను కల్పించాలని ఉద్యమిం చారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2008లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఎన్సీపీ నేత శరద్ పవార్‌లు ఈ డిమాం డ్‌కు లోపాయికారి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి నాలుగేళ్లపాటూ ఈ సమస్యను అవి సాగదీశాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠాలను బీసీల జాబితాలో చేర్చి, వారికి 16 శాతం కోటాను కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దాని అమలును నిలిపివేసి, బొంబాయి హైకోర్టు విచారణ చేపట్టింది. మొత్తం కోటా 50 శాతం దాటిందనీ, మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిలేరని కోర్టు తేల్చింది.
గుజరాతీ ప్రధాని పాలనలో పాటీదార్ల ఆందోళన!
గుజరాత్‌లో 2015 జులైలో 22 ఏళ్ల యువకుడు హార్దిక్‌పటేల్ నాయకత్వాన పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఆధ్వర్యంలో కోటా ఆందోళన మొదలైంది. జనాభాలో 12 శాతంగా ఉన్న పటేళ్లు దాదాపు అన్ని రంగా ల్లోనూ ముందున్న సామాజికవర్గం. వారు కూడా తమను బీసీ జాబితాలో చేర్చాలనీ, లేకుంటే అన్ని కోటాలు రద్దుచేయాలని వీధుల్లోకి వచ్చారు. పోలీసు కాల్పుల్లో 12 మంది పాటీదార్లు ప్రాణాలు కోల్పోయారు. కిందటేడాది ఏప్రిల్ 30న పాటీదార్లకు కోటా కల్పించే లక్ష్యంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కులాలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్ కల్పించింది. కానీ కోటా మొత్తం 50 శాతం దాటిందని గుజరాత్ హైకోర్టు ఈ కొత్త రిజర్వేషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యమని ప్రకటించిన పాస్ నేతలు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. పటేళ్ల కోటా సాధ్యాసాధ్యాలపై పూర్తి అవగాహన ఉన్నాగాని, కాంగ్రెస్ ఈ వివాదాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వేసిన ఎత్తుగడ ఫలించినట్టు కనిపిస్తోంది. పాస్ ప్రతినిధివర్గంతో కేంద్ర మాజీ మంత్రి కపిల్‌సిబ్బల్ జరిపిన చర్చలతో కాంగ్రెస్ పాటీదార్ల నేతల మద్దతును సంపాదించింది. తాము అధికారంలోకి వస్తే 31 సీ అధికరణ సాయంతో కోర్టుల విచారణలో వీగిపోని విధంగా పటేళ్లకు బీసీ హోదా కల్పించి, రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న 49 శాతం రిజర్వేషన్లకు అదనంగా పాటీదార్లకు కోటా కల్పించగలమని వారిని నమ్మించగలిగారు.
9వ షెడ్యూలులో అన్ని కోటా చట్టాలనూ చేర్చడం కుదిరేనా?
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిన చట్టాలను కోర్టుల విచారణ పరిధి నుంచి తప్పించడానికి వీలుగా వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్పించడంలో 1994లో తమిళనాడు సీఎం జయలలిత విజయం సాధిం చారు. కేంద్రంలోని నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమె 76వ రాజ్యాంగ సవరణను చేయించడం ద్వారా తమిళనాడు కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చించారు. అప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా కోటా కోసం, బీసీ హోదా కోసం డిమాండ్ చేసే ప్రతి సామాజికవర్గం 9వ షెడ్యూలు ప్రస్తావన తేవడం మొదలైంది. 2007లో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు... 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు సైతం కోర్టుల పరిశీలనకు అతీతం కాదనీ, 1974 ఏప్రిల్ 23 తర్వాత ఇందులో చేర్చిన చట్టాలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా ఉంటే, వాటిని చెల్లవని ప్రకటించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి 1951లో చేసిన తొలి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూలు ఏర్పాటు చేసి, జమీందారీల రద్దు, భూసంస్కరణ చట్టాలను అందులో చేర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడానికి చట్టాన్ని చేసి, కేంద్ర ఆమోదానికి పంపింది. 49 శాతానికి మించి పెరిగిన ఈ కొత్త కోటాలు అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చాల్పి ఉంటుంది.
రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రపదేశ్‌లో కాపులను బీసీల్లో చేర్చి వారికి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ 1980ల మధ్యలో మొదలైంది. చివరికి 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోట్ల విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కాపు సామాజికవర్గం డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి వారిని బీసీ జాబిలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. విభజనానంతర ఏపీలో కూడా మొత్తం కోటాలు దాదాపు 50 శాతం వరకూ ఉండగా, కాపులను బీసీల్లో చేర్చి ఇతర బీసీ కులాలకు నష్టంలేని రీతిలో రిజర్వేషన్లు అమలుచేస్తానని చంద్రబాబు నాయుదు నాయకత్వంలోని తెలుగుదేశం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం అమలు కోసం కాపులు ఉద్యమిం చగా, తెలుగుదేశం ప్రభుత్వం కిందటేడాది ఫిబ్రవరిలో రిటైర్డ్ జడ్జి మంజు నాథ నాయకత్వాన బీసీ కమిషన్‌ను నియమించింది. వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని ఓ పక్క మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టారు. 9 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన బీసీ కమిషన్ ఇంకా ఆ పని పూర్తిచేసే స్థితికి చేరలేదు.
అయినా సందర్భం వచ్చినప్పుడల్లా కాపులను బీసీల్లో చేర్చడం తథ్యమంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. బీసీ కమిషన్ ఏ కులాన్నయినా వెనుకబడిన కులమని నిర్థారించకుండా బీసీ జాబి తాలో చేర్చవద్దని, చేర్చినా చెల్లవని గతంలో కోర్టులు తీర్పులిచ్చాయి. అయినా మంజునాథ కమిషన్ ఓ నిర్ధారణకు రాకుండానే పాలకపక్షం కాపులకు కోటా వచ్చినట్టేననే విధంగా వారికి హామీలిస్తోంది. రిజర్వేషన్లను ఎన్ని కల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు ఇలా అసత్యాలు, అర్థస త్యాలతో వివిధ సామాజికవర్గాల ఆకాంక్షలతో ఆటలాడక తప్పదు. పలు రాష్ట్రాల్లో బీసీ హోదా కోసం అనేక సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తుండగా, వారి డిమాండ్లలో ఇమిడి ఉన్న రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు వివరించడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నించడం లేదు. ఏ కులం ఏమడిగినావెంటనే ఇస్తామని చెబుతూ సర్కార్లు ప్రజల ఉద్వేగాలతో, ఆకాంక్షలతో చెలగాటమాడుతుండటం ప్రమాదకరం.
నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment