భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని పశ్చిమబెంగాల్లో మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చికాకు తప్పదు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తేలిపోయింది.
ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం రద్దయిన పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధ రణకు మమతా బెన ర్జీ కేబినెట్ మే 17న నిర్ణయించింది. కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక లాంఛనమే. కేంద్ర ప్రభుత్వం చొరవతో బెంగాల్‌లో కౌన్సిల్ ఏర్పాటుకు పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానించాకే రాష్ట్ర అసెంబ్లీ కోరిక నెరవేరుతుంది. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ రద్దుకు లేదా మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానాలపై కేంద్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందిం చవు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నా విపరీత జాప్యం సర్వసాధారణం. ఒక్కోసారి ఒక రాష్ట్రంలో మండలి పునరుద్ధ రణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, పాతిక ముప్పయి ఏళ్లయినా ఆ పని జరగదు. తమిళనాడులో శాసనమండలి పునరుద్ధరణకు 1989లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంత వరకూ అతీగతీ లేదు. అయినా, రాష్ట్రాలను పరిపాలించే పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగానో, ఆచరణలో కౌన్సిల్ వల్ల అవరోధాల వల్లనో విధాన పరిషత్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి పంపడం గత 30 ఏళ్లుగా జరుగున్న పనే. కేంద్రంలో తమకు అనుకూల ప్రభుత్వం ఉందా? వ్యతిరేక ప్రభుత్వం ఉందా? కేంద్రం పట్టించుకోకపోతే తమ తీర్మానం వృ«థా ప్రయాసేనా? అని ప్రజాతంత్ర రాజకీయ పార్టీలు ఆలోచిం చవు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో తనను బద్ధ శత్రువుగా భావించే బీజేపీ అధికారంలో ఉన్నా తాను ముందే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా, తన తక్షణ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్‌లో కౌన్సిల్ పునరుద్ధరణకు తీర్మానం పంపాలనే కృత నిశ్చయంతో తృణమూల్ ప్రభుత్వం ఉంది.
కౌన్సిల్ అవసరం ఏమొచ్చింది?
తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2011 లోనే కౌన్సిల్ మళ్లీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటిం చింది. అప్పటికి 34 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సింగూరు, నందిగ్రామ్ భూపోరాటాల్లో మమతకు బాసటగా నిలిచిన మేధావులు, విశిష్ట వ్యక్తులకు చట్టసభలో స్థానం కల్పించడానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిపై మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లు పట్టింది. మండలి మళ్లీ ఏర్పాటు ఆలోచన ఇన్నాళ్లకు కొద్దిగానైనా ముందుకు సాగడానికి ఈ అంశాన్ని నిన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా విడుదల చేసిన తృణమూల్ ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ఒక్కటే కారణం కాదు. సీఎం మమత, ఆర్థిక మంత్రి మదన్ మిత్రా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు. నందిగ్రామ్‌లో ఓడిన మమత తన పాత స్థానం భబానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమౌతున్న మాట వాస్తవమే. ఆమెకైతే సీఎంగా కొనసాగడానికి తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో సీఎంగాని, సీఎం అభ్యర్థిగాని అసెంబ్లీకి పోటీచేస్తే, సొంత స్థానంపై దృష్టి పెట్టి ఐదారు రోజులు అక్కడే తిష్ట వేయాల్సిన అవసరం ఉంటుందని మొన్నటి నందిగ్రామ్ పోరు నిరూపించింది. పార్టీకి మెజారిటీ వచ్చి ఇతర కారణాల వల్ల సొంత సీట్లో ఓడితే సీఎం పదవి చేపట్టడానికి ఇబ్బంది లేకున్నా కొంత చీకాకు తప్పదు. మొత్తం 294 సీట్లలో మమత తన పూర్వ అనుచరుడు సువేందు అధికారిపై పోటీచేసిన నందిగ్రామ్‌పై దేశ ప్రజలందరి దృష్టి నిలిచింది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి బెంగాల్‌కు మండలి అవసరమని మమత గుర్తించిన కారణంగానే అధికారం చేపట్టిన నెలలోపే అందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మమత మాదిరిగా 25–30 ఏళ్లుగా ఎన్నికల రాజకీ యాల్లో కొనసాగుతున్న బడా నేతలు ఇక ముందు ప్రతిసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జనాదరణ ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం లేదని తేలిపోయింది. అందుకే, మహారాష్ట్ర, యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని నేటి ముఖ్యమంత్రులు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 నవంబర్‌లో అనూహ్య పరిస్థితుల్లో మహారాష్ట్ర సీఎం అయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యారు.
బిహార్‌లో సీఎం పదవి చేపట్టిన నేతల్లో లాలూ, రబ్రీ, నితీశ్!
బిహార్‌లో ఇప్పటికి 23 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టగా వారిలో ఏడుగురు ఎమ్మెల్సీలే. ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమి(జేడీయూ–బీజేపీ) మెజారిటీ సాధించడంతో 2005లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచీ ఆయన కౌన్సిల్ సభ్యునిగానే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 1990లో లోక్‌సభ ఎంపీగా ఉన్న లాలూ ప్రసాద్ తొలిసారి సీఎం పదవి చేపట్టాక రాష్ట్ర శాసన మండలికి ఎన్నికై ఐదేళ్లూ సీఎంగా ఉన్నారు.1995 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రెండేళ్లు సీఎం పదవిలో కొనసాగి రాజీనామా చేశారు. 1997లో ఆయన భార్య రబ్రీదేవి తన భర్త ఖాళీచేసిన పదవిని చేపట్టాక ఎమ్మెల్సీగా ఎన్నికై 2000 ఎన్నికల్లో మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌లో యాదవవర్గం నుంచి తొలి సీఎం అయిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయిన తొలి నేత. ఆయన పదవిలో ఉన్నది 51 రోజులేగాని రెండో బీసీ కమిషన్ (మండల్ కమిషన్) చైర్మన్‌గా దేశ ప్రజలందరికీ పరిచయమయ్యారు.
సీఎం పదవి దక్కాక కౌన్సిల్‌కు ఎన్నికవడం కొత్త ఆనవాయితీ!
గత 14 సంవత్సరాలకు పైగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రి పదవులో కొనసాగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 1952 నుంచి 1999 వరకూ సీఎం పదవిలో ఎమ్మెల్యేలే ఉన్నారు. 1999 నవంబర్ 2000 అక్టోబర్ మధ్య సీఎం పీఠంపై ఉన్న రామ్‌ప్రకాశ్ గుప్తా(బీజేపీ) యూపీలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ. బీఎస్పీ అధినేత్రి మాయా వతి 2007 ఎన్నికల్లో తన పార్టీ తొలిసారి మెజారిటీ సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టి మండలికి ఎన్నికై పదవిలో కొనసాగారు. 2002 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నిక ల్లోనూ అసెంబ్లీకి ఆమె పోటీ చేయలేదు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఎస్పీకి అప్పుడు మెజారిటీ రావడంతో ఆయన సీఎం అయ్యాక కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. తర్వాత 2017 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. తర్వాత కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
మొదట సీఎం అయ్యాక కౌన్సిల్ సభ్యుడైన తొలి నేత రాజాజీ
1952 మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదు. దాంతో సీఎం పదవి చేపట్టాలని సి.రాజగోపాలాచారిని నెహ్రూ ఒప్పించారు. రాజాజీని గవర్నర్ శ్రీప్రకాశ కౌన్సిల్‌కు నామి నేట్ చేశాక సీఎంగా ప్రమాణం చేయించారు. దేశంలో సీఎం అయిన తొలి ఎమ్మెల్సీ రాజాజీయే. మళ్లీ బెంగాల్ విషయానికొస్తే, 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అజయ్‌ముఖర్జీ నాయక త్వాన తొలి కాంగ్రెసేతర (యునైటెడ్ ఫ్రంట్) సర్కారు ఏర్పడింది. జ్యోతిబసు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని 8 నెలలకే గవర్నర్ ధర్మవీర బర్తరఫ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ మద్దతున్న పీసీ ఘోష్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ఖండించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న కౌన్సిల్‌లో ఘోష్ సర్కారుపై విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. 1969 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ వెంటనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానించి పంపగా, ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో దానికి ఆమోద ముద్ర వేయించారు. ఇందిర చొరవతో రద్దయిన మండలి మమత పట్టుదలతో ఎప్పుడు ప్రాణం పోసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.
వ్యాసకర్త : నాంచారయ్య మెరుగుమాల
సీనియర్ జర్నలిస్ట్
‘మండలి’ చరిత్రలో ఎన్నో మలుపులు
Published Mon, May 31 2021 2:42 AM | Last Updated on Mon, May 31 2021 9:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment