‘శారద’కు కోత
కశింకోట : మండలంలోని నరసాపురం ఆనకట్ట ప్రాంతంలోని శారదా నది కోతకు గురైంది. ఆనకట్ట ఎగువ భాగంతో పాటు దిగువన కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు రైతుల పంట భూములు సైతం నదిలో కలిసిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ ఆనకట్ట మంజూరైంది. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 16.17 కోట్ల అంచనా వ్యయంతో 2009లో నిర్మాణం చేపట్టారు.
తుది మెరుగులు తప్ప ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వడానికి వీలుగా ఆనకట్ట నిర్మాణం గత ఏడాది పూర్తయ్యింది. ఇంతలో కాంట్రాక్టర్ పనులను నిలిపి వేశారు. ఇప్పటికి రూ.15 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అధికారిక సమాచారం. ఆనకట్ట నుంచి కశింకోట, యలమంచిలి మండలాలకు చెందిన సుమారు 3500 ఎకరాల పంట భూములకు నీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన నాలుగు ఖానాలకు గేట్లు అమర్చాల్సి ఉంది. ఇందుకు రూ.2.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారు.
ఈ నిధుల మంజూరుకు సాంకేతిక సమస్యతో పాటు ప్రభుత్వం వద్ద నిధుల కొరత వల్ల ఈ ఏడాది గేట్లు ఏర్పాటు చేయని దుస్థితి నెలకొంది. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఈ నేపథ్యంలో ఖానాల నుంచి నది నీరు దిగువకు వృథాగాపోతోంది. ఇటీవల హుద్‌హుద్ తుఫాను వల్ల నది ఉప్పొంగి ప్రవహించింది.
దీంతో ఆనకట్టకు ఉన్న నాలుగు ఖానాల నుంచి నీరు ఉధృతంగా పారడంతో ఆనకట్ట దిగువన నది కుడి వైపున ఖానాలు ఉన్న ఎక్కువ భాగం కోతకు గురైంది. ఖానాలకు గేట్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు. తక్షణమే ఆనకట్ట ఖానాలకు గేట్లు ఏర్పాటు చేసి పంట భూములు కోతకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు.