'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ
వచ్చే వారం దీపావళికి బోలెడన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిన్న చిత్రాలు రిలీజయ్యాయి. వాటిలో ఓ మూవీనే 'నరుడి బ్రతుకు నటన'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)కథేంటి?సత్య (శివకుమార్) నటుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. యాక్టింగ్ నీకు చేతకాదని తండ్రి (దయానంద్ రెడ్డి) కాస్త పద్ధతిగా తిడతాడు. ఒక్కగానొక్క ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వరస్ట్ యాక్టర్ అని సత్య ముఖంపైనే చెబుతారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో కేరళ వెళ్లిపోతాడు. పరిచయమే లేని డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి ఇంట్లో ఇతడు ఉండాల్సి వస్తుంది. కేరళలో ఇతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు.. అసలు మన దగ్గర కూడా ఇలాంటివి తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మహా అయితే ఓసారి చూడొచ్చు. హీరో కోసం ఇంకోసారి చూడొచ్చేమో గానీ ఫీల్ గుడ్ చిత్రాలు మళ్లీ మళ్లీ చూడొచ్చు. అలాంటి ఓ సినిమానే 'నరుడు బ్రతుకు నటన'. ఏంటి అంత బాగుందా అని మీరనుకోవచ్చు. నిజంగా చాలా బాగా తీశారు.నువ్వో వరస్ట్ యాక్టర్.. జీవితంలో కష్టాలు తెలిస్తేనే నువ్వో మంచి నటుడివి అవుతావ్ అని హీరో సత్యని ఫ్రెండ్ తిడతాడు. అంతకుముందు ఊరు పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు. తండ్రి కూడా కాస్త పద్ధతిగా తిడతాడు. దీంతో కోపమొచ్చి కేరళ వెళ్లిపోతాడు. కాస్త డబ్బులు ఉండటం వల్ల కొన్నిరోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే అహం. దీంతో చేతిలో ఉన్న ఫోన్ అమ్మాలనుకుంటాడు. అదేమో ఓ పిల్లాడు తీసుకుని పారిపోతాడు. అలా అన్ని కోల్పోయిన సత్యకి సల్మాన్ పరిచయమవుతాడు. అతడితో అన్ని షేర్ చేసుకుంటాడు. వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏమో గానీ చూసే ప్రేక్షకుడికి చాలా విషయాలు నేర్పిస్తారు.డబ్బు ఉంటే చాలు.. జీవితం ఆనందంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని ఈ సినిమాలో చూపించిన విధానం సూపర్. ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీ టచ్ చేస్తూ చివరకు ఓ మంచి అనుభూతి ఇచ్చేలా మూవీని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని అందరితో తిట్టించుకున్న సత్య.. తనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ పలికిస్తాడు. చూస్తున్న మనం కూడా అతడితో పాటు ఫీల్ అవుతాం!చిన్న పాప ఎపిసోడ్, ప్రెగ్నెంట్ అమ్మాయి ఎపిసోడ్ మనల్ని భావోద్వేగాన్ని గురిచేస్తాయి. ఇక సల్మాన్ లవ్ స్టోరీ, మందు పార్టీ, వేశ్య దగ్గరకు వెళ్లిన సీన్స్‌లో సత్య-సల్మాన్ చేసిన సందడి నవ్విస్తుంది. చూస్తున్నంతసేపు ఓ మలయాళ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లే అక్కడక్కడ మలయాళ పాటలు కూడా వినిపించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇవి వస్తున్నప్పుడు మనకు భాషతో ఇబ్బంది కూడా అనిపించదు. అంతలా లీనమైపోతాం. రెండు గంటల సినిమా అప్పుడే అయిపోందా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన శివకుమార్.. ఇందులో సత్యగా నటించాడు. హీరో అనడం కంటే మనలో ఒకడిలానే అనిపిస్తాడు. నితిన్ ప్రసన్న చేసిన డి.సల్మాన్ పాత్ర అయితే హైలైట్. సరదా సరదాగా సాగిపోతూనే చాలా విషయాలు నేర్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే దాదాపు కేరళలో షూటింగ్ అంతా చేశారు. సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. దర్శకుడు రిషికేశ్వర్ మంచి పాయింట్ తీసుకున్నాడు. అంతే నిజాయతీగా ప్రెజెంట్ చేశాడు. కాకపోతే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని, మూవీని కాస్త ప్రమోట్ చేసుంటే బాగుండనిపించింది. ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అస్సలు మిస్సవొద్దు!రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ)