ఆల్ ది బెస్ట్.. బఠానీలు తినడం మర్చిపోకండి!
బెంగళూరు: అంగారకగ్రహంపై పరిశోధన కోసం మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. ఇస్రో ఎంవోఎం ఫేస్బుక్ పేజీలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (జేపీఎల్) ఈ మేరకు గురువారం ఓ సందేశం పోస్టు చేసింది. ‘మీరు మార్స్ యాత్ర ప్రారంభిస్తున్నారు.
అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రయోగం సమయంలో తప్పనిసరిగా బఠానీలు పంచుకుని తినండి’ అంటూ ‘లక్కీ పీనట్స్(బఠానీలు)’ పేరుతో సందేశం ఉంచింది. ‘1960 క్రితం వరకూ మేం ఆరుసార్లు చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాం. ఎట్టకేలకు 1964లో ఏడోసారి విజయం సాధించాం. ఆ ప్రయోగం సందర్భంగా మా సిబ్బందిలో ఒకరు బఠానీలు తింటూ ఇతరులకూ పంచారు. దాంతో ఆ విజయం తాలూకు క్రెడిట్ మేం బఠానీలకు కట్టబెట్టేశాం. ఆ తర్వాత ప్రతిసారీ బఠానీలు పంచుకుంటున్నాం. అందుకే మీరూ విజయం సాధించాలని ఈ రహస్యాన్ని చెబుతున్నాం. గో ఎంవోఎం!!! గుడ్ లక్ ఎంవోఎం! డేర్ మైటీ థింగ్స్’ అంటూ నాసా శుభాకాంక్షలు తెలిపింది.