Nathan Lion
-
‘లయన్’ పంజా
మన స్పిన్ కోటలో ప్రత్యర్థి బాగా పాగా వేసింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా పాచిక పారుతుంటే... ఆతిథ్య వేదికపై భారత్ వణుకుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కంటే కాస్త ఎక్కువ స్కోరు చేసిందేమో కానీ... నాథన్ లయన్ (23.3–1–64–8) గర్జనకు తలవంచింది. వికెట్లు రాలిన తీరుతో భారత శిబిరం బిక్కమొహమేసింది. 76 పరుగుల అత్యల్ప లక్ష్యం ఆసీస్ ముందుండగా... మూడో రోజు తొలి సెషన్లోనే మూడో టెస్టు ముగిసే అవకాశముంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టూ 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇండోర్: ఈ సిరీస్‌లో స్పిన్‌తో గెలిచిన భారత్ ఇప్పుడదే స్పిన్‌కు ఉక్కిరిబిక్కిరవుతోంది. తిప్పేసే చోటే (పిచ్) బొక్కబోర్లా పడుతోంది. ఒక ఇన్నింగ్స్ అంటే ఏమో అనుకోవచ్చు... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మన పిచ్‌పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో టీమిండియా పరాజయం అంచున నిలిచింది. మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసేందుకు సిద్ధమైంది. వికెట్ల పతనంలో రెండో రోజు (16 వికెట్లు) మొదటి రోజు (14)ను మించింది. మూడో రోజు పర్యాటక ఆ్రస్టేలియా ముందు కేవలం 76 పరుగుల లక్ష్యమే ముందుండగా... స్పిన్ బంతులు బొంగరంలా తిరుగుతున్న పిచ్‌పై భారత్‌లో ఏ మూలనో ఆశలు రేపుతోంది. 75 పరుగుల్లోపే 10 వికెట్లు తీస్తే మాత్రం ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కాదు పిచ్‌నే ‘టర్నింగ్’ విన్నర్ అవుతుంది. రెండో రోజు ఆటలో ముందుగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 76.3 ఓవర్లలో 197 పరుగుల వద్ద ముగిసింది. పర్యాటక జట్టుకు 88 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్ 60.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. 11 పరుగులు... 6 వికెట్లు... ఓవర్‌నైట్ స్కోరు 156/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా ఉదయం గంటకుపైగా బాగానే ఆడింది. హ్యాండ్స్కాంబ్ (19; 1 ఫోర్), కామెరాన్ గ్రీన్ (21; 2 ఫోర్లు) జోడీ 17 ఓవర్లపాటు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటేలా కనిపించింది. అయితే 186 పరుగుల వద్ద హ్యాండ్స్కాంబ్, మరుసటి ఓవర్లో గ్రీన్ అవుట్ కాగానే ఆసీస్ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయింది. 200 స్కోరుకు ముందే 197 పరుగుల వద్దే ఆలౌటైంది. పేస్‌తో ఉమేశ్ (3/12), స్పిన్‌తో అశ్విన్ (3/44) రె చ్చిపోయారు. ఆరు వికెట్లను వీరిద్దరు పంచుకొని ప్రత్యర్థిని పడగొట్టేశారు. లయన్ గర్జన ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేయడంతో ఇక జాగ్రత్తగా ఆడితే ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. కానీ భారత్ రెండో ఇన్నింగ్స్‌పై లయన్ గర్జనకు చక్కని ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆ్రస్టేలియానే పైచేయి సాధించింది. ఓపెనర్లు రోహిత్ (33 బంతుల్లో 12), శుబ్‌మన్ (15 బంతుల్లో 5)లకు ఒక్క బౌండరీ అయిన కొట్టే అవకాశం ఇవ్వకుండా లయన్ ఇద్దరి పని పట్టాడు. కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) వచ్చి ఫోర్లు కొడుతున్నాడులే అనే ఆనందాన్ని కునెమన్ దూరం చేశాడు. 54 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పెవిలియన్‌లో కూర్చున్నాయి. ప్రధాన వికెట్లే లయన్ ఉచ్చులో పడినా... పుజారా (142 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ ఉన్నంత సేపూ జట్టు ధీమాగానే ఉంది. స్టార్క్ బౌలింగ్‌లో ఖాజా కళ్లు చెదిరే క్యాచ్‌కు అయ్యర్ ఆట ముగియగా జట్టు పతనం మొదలైంది. శ్రీకర్ భరత్ (3) మళ్లీ నిరాశపరచగా... స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌కు పుజారా ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అశ్విన్ (16; 2 ఫోర్లు), అక్షర్ (15 నాటౌట్; 1 సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. లయన్ 8, స్టార్క్, కునెమన్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 109; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఖాజా (సి) గిల్ (బి) జడేజా 60; లబుషేన్ (బి) జడేజా 31; స్మిత్ (సి) భరత్ (బి) జడేజా 26; హ్యాండ్స్కాంబ్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 19; గ్రీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 21; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 3; స్టార్క్ (బి) ఉమేశ్ 1; లయన్ (బి) అశ్విన్ 5; మర్ఫీ (బి) ఉమేశ్ 0; కునెమన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146, 5–186, 6–188, 7– 192, 8–196, 9–197, 10–197. బౌలింగ్: అశ్విన్ 20.3–4–44–3, జడేజా 32–8–78–4, అక్షర్ 13– 1–33–0, ఉమేశ్ 5–0–12–3, సిరాజ్ 6–1– 13–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 12; గిల్ (బి) లయన్ 5; పుజారా (సి) స్మిత్ (బి) లయన్ 59; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్ 13; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 7; అయ్యర్ (సి) ఖాజా (బి) స్టార్క్ 26; భరత్ (బి) లయన్ 3; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 16; అక్షర్ (నాటౌట్) 15; ఉమేశ్ (సి) గ్రీన్ (బి) లయన్ 0; సిరాజ్ (బి) లయన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (60.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–15, 2–32, 3–54, 4–78, 5–113, 6–118, 7–140, 8–155, 9–155, 10–163. బౌలింగ్: స్టార్క్ 7–1–14–1, కునెమన్ 16–2–60–1, నాథన్ లయన్ 23.3–1–64–8, మర్ఫీ 14–6–18–0. -
పటిష్టస్థితిలో ఆసీస్
సిడ్నీ: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే దిశగా ఆ్రస్టేలియా పయనిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్ (5/68) తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేయడంతో... న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. అతనికి ప్యాట్ కమిన్స్ (3/44) చక్కటి సహకారం అందించాడు. అరంగేట్రం బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిఫ్స్ (52; 6 ఫోర్లు, సిక్స్) టెస్టుల్లో తొలి ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 203 పరుగుల ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా జట్టుకు న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వార్నర్ (23 బ్యాటింగ్; ఫోరు), బర్న్స్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
తేలిగ్గా తలొగ్గుతుందా?
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే గతంలో మాటకు మాటతో మొదలయ్యేది. ఇప్పుడు దాని స్థానంలో ‘ఆట’ చర్చకు వస్తోంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో మైదానంలో కంటే ఆ జట్టు మానసికంగా ఎక్కువ కుదేలైంది. ఈ నేపథ్యంలో కంగారూలు బలహీన పడ్డారని, వారి సొంతగడ్డపై టీమిండియా తొలిసారి సిరీస్ నెగ్గేస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. మూలాలను విశ్లేషిస్తే మాత్రం ఇదేమంత సులువు కాదని తెలుస్తుంది. ఎందుకంటే... సాక్షి క్రీడా విభాగం:సరిగ్గా రెండు నెలల క్రితం యూఏఈలో ఆస్ట్రేలియా–పాకిస్తాన్ టెస్టు మ్యాచ్. పరాజయం తప్పించుకోవాలంటే ఐదో రోజంతా ఆడాల్సిన పరిస్థితి ఆసీస్‌ది. అది కూడా మెరుగైన పాక్ బౌలింగ్‌ను కాచుకుంటూ! మిగతా జట్లయితే పరాజయం ఖాయం అనుకుని చేతులెత్తేసేవి. కానీ, కంగారూలు అదరలేదు. బెదరలేదు. ప్రత్యర్థి ఎంత గింజుకున్నా పట్టు వదల్లేదు. చివరకు ‘డ్రా’ చేసుకుని గాని మైదానం వీడలేదు. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడగా, కెప్టెన్ టిమ్ పైన్ వీరోచితంగా నిలిచి పరాజయం తప్పించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత బలహీనపడినా... ఆస్ట్రేలియా తేలిగ్గా తలొగ్గదని చెప్పేందుకు ఈ తాజా ఉదాహరణ ఒక్కటి చాలు. తటస్థ వేదికపైనే ప్రత్యర్థిది పైచేయి కాకుండా చూసుకున్న ఆ జట్టు... సొంత గడ్డపై మరింత ధీమా గా ఆడుతుందనడంలో సందేహం లేదు. వారు లేకుంటేనేం... పూర్తిగా కాకున్నా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లోటును భర్తీ చేయగల బ్యాట్స్‌మెన్ ఆసీస్‌కు ఉన్నారు. ఇందులో ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష కీలకం కాగా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అరోన్ ఫించ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష నమ్మదగ్గవారు. ట్రావిస్ హెడ్ స్ట్రోక్ ప్లేయర్. పైన్ అచ్చమైన టెస్టు ఆటగాడు. అరంగేట్ర ఓపెనర్ మార్కస్ హ్యారిస్ ఇటీవల దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించి ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టులో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు సభ్యుడైన ఖాజా రెండు శతకాలు బాదాడు. అదే ఫామ్‌ను యూఏఈలోనూ కొనసాగించి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి నిలకడకు మార్‡్ష సోదరుల ప్రతిభ తోడైతే జట్టుకు భారీ స్కోరు ఖాయం. వీరితో పాటు ఫించ్, హెడ్, హ్యారిస్‌ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటేనే టీమిండియాకు అవకాశాలుంటాయి. అయితే, గతంలో ఇక్కడ పర్యటించిన ఇషాంత్, షమీలకు తోడు భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ రూపంలో ఈసారి మరింత మెరుగైన పేస్ వనరులున్నందున కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి. నిలవగలరా వీరి ధాటికి... మిషెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హాజల్‌వుడ్ వైవిధ్యమైన పేస్ త్రయం ఇది. యార్కర్లు, ఇన్ స్వింగర్లతో విరుచుకుపడే ఎడంచేతి వాటం స్టార్క్ ప్రపంచ స్థాయి బౌలర్. నాణ్యమైన బౌలరైన ఇతడిని దీటుగా ఎదుర్కొనగలిగే టెక్నిక్ భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కోహ్లి ఒక్కడికే ఉంది. నిప్పులు చెరిగే స్టార్క్ బంతులు టీమిండియా ఓపెనర్లకు కఠిన సవాలే. రెండేళ్ల క్రితం పునరాగమనం చేసినప్పటి నుంచి కమిన్స్ పేస్ మరింత పదునెక్కింది. జట్టంతా తేలిపోయిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడు విశేషంగా రాణించి మూడు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. పెర్త్‌లాంటి వేగవంతమైన పిచ్‌పై కమిన్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఇక హాజల్‌వుడ్ నిలకడైన వేగంతో పాటు కచ్చితమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షిస్తాడు. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఖాజాపై ఎంత అంచనాలున్నాయో బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌పై అంతే అంచనాలున్నాయి. చిన్నోడేనని చిన్నచూపొద్దు... ఆసీస్ జట్టులో అందరికంటే బలహీనంగా కనిపిస్తూ, పెద్దగా వార్తల్లోనూ నిలవని ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్. చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయే అతడిని చిన్నచూపు చూస్తే పెద్ద దెబ్బ తినడం ఖాయం. గత పర్యటనలో అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ప్రధాన బౌలర్లను దీటుగా ఎదుర్కొని విజయం దిశగా వెళ్తున్న భారత్‌ను లయన్ ఊహించని విధంగా కుప్పకూల్చాడు. కోహ్లి (141), విజయ్ (99), రహానే (0), రోహిత్ (6) సహా ఏకంగా ఏడుగురిని ఔట్ చేసి కంగారూలను గెలిపించాడు. దేశవాళీ, అంతర్జాతీయం కలిపి ఇటీవలి పది మ్యాచ్‌ల్లో ఒకటి, రెండింట్లో మినహా మిగతా వాటిలో లయన్ మూడు అంతకుపైనే వికెట్లు తీశాడు. ఈ విషయంలో భారత స్పిన్నర్ అశ్విన్ కూడా అతడి ముందు దిగదుడుపే. మరి... గతం కంటే మరింత మెరుగైన లయన్‌ను ఈసారి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అప్పుడేం జరిగిందంటే... సౌరభ్ గంగూలీ నేతృత్వంలో టీమిండియా 2003–04 సీజన్లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. నాడు ఆసీస్ జట్టుకు తురుపుముక్కల్లాంటి పేసర్ మెక్‌గ్రాత్, స్పిన్నర్ షేన్ వార్న్ సేవలు సిరీస్ మొత్తానికి అందుబాటులో లేవు. నాలుగు టెస్టులకు గాను బ్రెట్‌లీ రెండే ఆడాడు. జాసన్ గిలెస్పీ, నాథన్ బ్రాకెన్లాంటి పేసర్లే వారికి పెద్ద దిక్కయ్యారు. అయినా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి దిగ్గజాలున్న భారత్‌ను ఆస్ట్రేలియా నిలువరించింది. కొంత తడబడినా సిరీస్‌ను 1–1తో సమం చేసింది. దీన్నిబట్టి చెప్పేదేమంటే... ఆస్ట్రేలియా బయటకు ఎలాగైనా ఉండని, మైదానంలోకి దిగితే దాని ఆటే మారిపోతుంది. -
రాణించిన షబ్బీర్, రహీమ్: బంగ్లాదేశ్ 253/6
చిట్టగాంగ్: స్పిన్నర్ నాథన్ లయన్ ఐదు వికెట్లతో చెలరేగినా బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడుతోంది. షబ్బీర్ రహమాన్ (66; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (62 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లకు 253 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై లయన్ టాప్ ఆర్డర్‌ను వరుసగా అవుట్ చేయడంతో 85 పరుగులే 4 వికెట్లు కోల్పోయింది. కానీ షబ్బీర్, రహీమ్ ఐదో వికెట్‌కు 105 పరుగులు జత చేసి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు.