National AIDS Control Organization
-
పదేళ్లలో 17 లక్షల మందికి ఎయిడ్స్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది. ► ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్లో 87,440 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. ► 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్ఐవీ సోకింది. ► తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి. ► 2020 నాటికి 23,18,737 హెచ్ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు. ► హెచ్ఐవీ వైరస్ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. -
‘నాకో’ నిధులు కాజేశారు!
ఎయిడ్స్ నియంత్రణ మండలి నిధులకు ‘స్వచ్ఛంద’ రోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీ శాక్స్)లో కోట్లాది రూపాయల నిధులను కొన్ని స్వచ్ఛంద సంస్థలు గద్దల్లా తన్నుకుపోయాయి. ‘స్వచ్ఛంద’ ముసుగులో కోట్లకు కోట్లు తినేశాయి. ఎల్లయ్య, పుల్లయ్య.. ఇలా రకరకాలుగా నకిలీ పేర్లు సృష్టించి హెచ్ఐవీ పరీక్షలు చేసేశారు. రికార్డుల్లో నమోదైన వారి చిరునామాలకు వెళ్లి క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ చేయగా వందకు ఒక్కటి కూడా నిజమైంది లేదని తేలింది. అంతేకాదు.. కాల పరిమితి తీరిన కిట్లను సైతం పరీక్షలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నిధుల వినియోగానికి, ఎయిడ్స్ పరీక్షా కిట్లకూ ఎక్కడా పొంతన లేదని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగితాలపై పేర్లు చూపి కోట్లు స్వాహా రాష్ట్రంలో హెచ్ఐవీ పరీక్షల పేరిట భారీగా గోల్మాల్ జరిగింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) ఇచ్చిన నిధులను కొన్ని ఎన్జీవోలు తప్పుడు లెక్కలు చూపి కాజేశాయి. హెచ్ఐవీ రోగులకు కౌన్సెలింగ్, వైద్యం, రోగుల గుర్తింపు చేపట్టకుండానే రూ.35 కోట్లు స్వాహా చేశాయి. హెఎల్ఎఫ్ పీపీటీ, అలియన్స్ తదితర బడా ఎన్జీవోలకు కోట్లాది రూపాయలు కేటాయించగా అవి చిన్న ఎన్జీవోలకూ సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. కనీసం రూ.10 కోట్లకు కూడా నికరంగా వైద్య పరీక్షలు చేయలేదని ఆడిట్లో వెల్లడైంది. జిల్లాల్లో స్థానికంగా పర్యవేక్షించే ప్రాజెక్ట్ మేనేజర్లు ఎన్జీవోల వద్ద వసూళ్లు చేసి జేడీలకు ముట్టచెపుతున్నట్లు తెలిసింది. గత నాలుగేళ్లలో కనీసం రూ.60 కోట్లు దుర్వినియోగమైంది. కాలం చెల్లిన కిట్ల బాగోతం బట్టబయలు ఎయిడ్స్ పరీక్షా కిట్లను నిర్దేశిత గడువు తేదీకి మించి ఒక్క రోజు కూడా ఎక్కువగా వాడకూడదు. అలా వాడితే ఫలితాలు తారుమారై తీవ్ర అనర్ధాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాలం చెల్లిన ఎయిడ్స్ టెస్ట్ కిట్లు హైదరాబాద్ మల్కాజిగిరిలోని ఓ స్వచ్ఛంద సంస్థ వద్ద ఇటీవల వెలుగుచూశాయి. తొలుత వీఎస్ఎస్ఏ(వెంకటేశ్వర సోషల్ సర్వీస్ ఏజెన్సీ)లో బయటపడ్డాయి. నిజామాబాద్ నుంచి సుమారు 10 వేల ఎక్స్పైరీ కిట్లు రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాలకు తరలించారు. వీటిని సంచార పరీక్షా కేంద్రాలు(మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్)లో వాడుతున్నట్లు తేలింది. ఈ విషయం బయటపెట్టిన క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు బెదిరించటంతో నోరు మూసుకున్నారు. ఈ కిట్లు వీఎస్ఎస్ఏ, లెప్రా ఇండియా ఎన్జీవోల నుంచి బయటపడ్డాయి. మొబైల్ ఐసీటీసీలకు అనుమతిపై ఏపీ శాక్స్ సంయుక్త సంచాలకులు డా.జయచంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... లెప్రా ఇండియా, వాసవి మహిళా మండలి అనే రెండు ఎన్జీవోలకు నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇచ్చానని, తాము ఎవరివద్దా డబ్బు తీసుకోలేదన్నారు. ఎక్స్పైరీ కిట్లను వాడటంపై విచారణ చేస్తున్నామన్నారు.