దశాబ్దాల కల సాకారమైంది..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి ప్రగతి సాధించడంలో ఆదర్శంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించారు.
కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ, జాతీయ గీతాలు ఆల పించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. దేశపటం లో తెలంగాణ 29వ రాష్ట్రంగా రాజముద్రతో ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రసం గం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సన్మానిస్తున్న సమయంలో అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. కలెక్టర్ వారిని ఓదార్చారు.
సంక్షేమ పథకాల అమలు
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 5,37,169 మందికి జాబ్‌కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. బోగస్ చెల్లింపులు అరికట్టేందుకు మైక్రో ఏటీఎంల ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. డీఆర్డీఏ ద్వారా 2013-14లో 14,399 సంఘాలకు రూ.316 కోట్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం సాధించామన్నారు. 2014-15 ఏప్రిల్ వరకు 189 సంఘాలకు రూ.3.68 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వడ్డీలేనిరుణాల ద్వారా 2013-14 ఏడాదిలో రూ.26 కోట్లను 29,710 స్వయం సహాయ సంఘాలకు విడుదల చేశామన్నారు. 2013-14 రబీ సీజన్లో రైతులు పండించిన వరిధాన్యాన్ని 91 కొనుగోళు కేంద్రాల ద్వారా 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళు చేశామన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 10,595 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని 7.5 లక్షల మందికి రూపాయి కిలో చొప్పున అందజేస్తున్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు అదనంగా 1.11 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రతిపాదించి పనులు చేపట్టాం. వట్టివాగు ప్రాజెక్టు రూ.89 కోట్ల అంచనాతో పూర్తి చేసి 16 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరందించడం జరుగుతుందని తెలిపారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు నీటి సరఫరా ప్రైవేట్ బోర్ల, బోర్ల షఫ్లింగ్కు రూ.66 లక్షలు ఖర్చు చేశామన్నారు.
రూ. 162 కోట్లతో విమానాశ్రయానికి భూసేకరణ
జిల్లా కేంద్రంలో విమానాశ్రయ కేంద్రం అభివృద్ధి కోసం రూ.162 కోట్లతో భూ సేకరణ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 594 పాఠశాలలు, 185 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి పనులు పూర్తి చేశామన్నారు. విద్యాశాఖ ద్వారా మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 3,905 పాఠశాలల్లో చదువుతున్న 3.41 లక్షల మంది పిల్లలకు భోజనం ఉచితంగా అందిస్తున్నామన్నారు.
తీవ్రవాద పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం ద్వారా విద్యా వ్యవస్థల్లో మౌలిక సదుపాయాలు సబ్ సెంటర్, భవనాలు, ఆశ్రమ పాఠశాలలకు, విద్యుదీకరణకు, రోడ్డు మార్గాల కొరకు రూ.76 కోట్లు ఖర్చు చేశామన్నారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా ఈ ఏడాదిలో 95 పనులకు రూ.434 కోట్ల వ్యయంతో చేపట్టామని, ఇప్పటి వరకు రూ.115 కోట్లు ఖర్చు చేసి 25 పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ద్వారా 2013-14లో రూ. 2.24 కోట్లతో విద్యుత్ లేని గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్ పనులు పూర్తి చేశామన్నారు. రూ.18.19 కోట్ల విద్యుత్ బకాయిలను ఎస్సీ, ఎస్టీ పథకం కింద గృహ వినియోగదారులకు మాఫీ చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ అవతరణకు త్యాగధనులైన వారికి స్మృత్యంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరేడ్ మైదానంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను, ప్రచార రథాలను తిలకించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆయా శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఏఎస్పీ జోయేల్ డేవిస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.