National banks
-
బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తమైన డిజిటల్ డేటాతో పాటు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్‌ఎల్ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్‌ను వీఎంసీఎల్ చెల్లించినట్లు తేలిందని వివరించింది. పీవోఎంఎల్ కోర్టులో హాజరు హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు (ఎల్వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించినట్లు వివరించింది. -
నిరవధిక సమ్మె దిశగా బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, అమరావతి: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో తొలిరోజు విజయవంతమైందని, దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బంద్‌లో భాగంగా రాష్ట్రంలో కూడా సోమవారం బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్బీఐ జోనల్ కార్యక్రమం వద్ద బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఐబాక్) రాష్ట్ర కార్యదర్శి వైవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు వెనుకాడమని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, రూ.వేల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మంగళవారం సమ్మెను కూడా విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కాగా కానుకల రూపంలో టీటీడీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తను విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఇక మీదట డిపాజిట్ చేయవద్దని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కొనుగోలు శక్తికి ఉద్దీపన కరువు
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉంది. ఒకవైపున మోదీ 2024 నాటికి ఆర్థికవ్యవస్థ స్థాయిని 5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రక్కన దేశ ఆర్థ్ధికవ్యవస్థపై మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం బయటకు చెప్పకపోయినా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతోన్న సంకేతాల మేరకు గడచిన 34 సంవత్సరాల నుంచీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంద’ని బజాజ్ ఆటోకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ అన్నారు. ‘పెట్టుబడులకు, డిమాండ్‌కి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏవిధంగానూ ప్రయత్నించడం లేద’ని కూడా ఆయన చెబుతున్నారు. ఆయన ఈ మాటలు అన్నది 2019 జూలై మాసం చివరిలో. కాగా, ఇంతటి తీవ్ర పరిస్థితులలో కూడా నేటి వరకూ ఆర్ధికమాంద్యం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరో ప్రక్కన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాటల ప్రకారం జూన్ మాసంలో ‘ద్రవ్య విధాన కమిటీ’ సమావేశం జరిగిన నాటికే దిగజారివున్న ఆర్థిక స్థితి, ఈ కొద్ది కాలంలో మరింత అధోముఖంగా జారిపోయింది. ఈ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంకు తన వంతుగా ఇప్పటివరకూ వడ్డీ రేట్లను 1.1% మేరన తగ్గించింది. అయితే, ప్రభుత్వం తన వంతుగా ఉద్దీపన వంటివి చేపట్టడం కూడా తప్పనిసరి అని రిజర్వ్‌బ్యాంకు పెద్దల అభిప్రాయం. కాగా, కడకు నేడు ఉద్దీపన ప«థకం ఏదీ ఇచ్చే ఉద్దేశం లేదంటూ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థ్ధిక సలహాదారు చావు కబురు చల్లగా చెప్పారు. కానీ, షేర్మార్కెట్లలో పతనం గురించి మాత్రం ప్రభుత్వం మెరుపు వేగంతో ప్రతిస్పందిస్తోంది. మొన్నటి బడ్జెట్ అనంతరం అత్యంత ధనవంతుల మీద పెంచిన పన్ను మొత్తం తాలూకు భారం అనేక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులను తాకింది. దాంతో వారు షేర్ మార్కెట్ల నుంచిపెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనితో సెబీ విదేశీ ఫోర్ట్‌ఫోలియో మదుపుదారులకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకరించింది. తద్వారా పతన దిశగా సాగుతోన్న షేర్ మార్కెట్‌కు కొంత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతోంది. 2008లో అమెరికాలో ఆరంభమైన ఆర్థ్ధిక మాంద్యం మనల్ని తాకకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు. రెండవది దేశంలోని జాతీయ ఉపాధి హామీ ప«థకం. నాడు మన జాతీయ బ్యాంకులు అడ్డగోలు రుణవితరణ చేయలేదు. అవి ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారలేదు. అలాగే, జాతీయ ఉపాధి హామి పధకం వలన దేశంలోని కోట్లాది మందికి కొనుగోలు శక్తి పెరిగింది. నేడు జాతీయ బ్యాంకులలో మొండి బకాయిలు పెరిగిపోయాయి. రుణవితరణలో పెద్ద పాత్ర ఉన్న బ్యాంకింగేతర ఆర్థ్ధికసంస్థల స్థితి కూడా దివాలా బాట పట్టింది. మన నీతిఆయోగ్ ప్రకారమే నేడు ఆర్థ్ధిక సంస్థల స్థితి 70 సంవ త్సరాలలో కనీవినీ ఎరుగనంత దయనీయంగా ఉంది. ఇక, జాతీయ ఉపాధి హామి పథకం పట్ల విముఖత కారణంగా కూలీల వేతనాల చెల్లింపు జాప్యం అవుతోంది. వ్యవసాయ రంగం స్థితి కూడా దిగజారి గ్రామీణ ఆర్థ్ధిక ఆరోగ్యం çకుదేలైపోతోంది. గ్రామాల ఆర్థిక స్థితికి కొలబద్ద అయిన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకం దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే, తల నూనెలు, సబ్బులు, కడకు బిస్కెట్ల వంటి చిన్న చిన్న వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా నేడు గ్రామీణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కంటే దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల కరెన్సీల విలువలో కూడా పతనం నెలకొంది. మన రూపాయి విలువ మరింత అధికంగా పతనం చెందింది. అలాగే, మనదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్ల అమ్మకాలు ఇతర దేశాలలో డిమాండ్ పతనం వలన 4.2% మేరకు తగ్గాయి. మన దేశీయ మార్కెట్లో ఈ అమ్మకాల తగ్గుదల 19% మేరకు ఉంది. అలాగే, జూలై 2019 మధ్యనాటి స్థితి ప్రకారంగా ప్రపంచంలోని అతిపెద్ద 10 షేర్ మార్కెట్లలో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది (2.8%) భారతదేశ షేర్ల సూచీయే ! అలాగే గత నాలుగేళ్లలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు సగటున 0.2%గా మాత్రమే ఉంది. ప్రపంచదేశాల ఎగుమతుల సగటు వృద్ది రేటు 0.6% గా ఉంది. 2010 2014లో ప్రపంచ దేశాల సగటు ఎగుమతుల వృద్ధి సాలీనా 5.5% గా ఉండగా, మన దేశంలో అది 9.2% గా ఉంది. అంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో కంటే భారత్‌లో మరింత తీవ్ర మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక రంగాన్ని ఇప్పటికీ వెంటాడటమే. ఇక నోట్ల రద్దుతోపాటుగా హడావుడిగా అమలు జరిగిన జీఎస్టీ వలన కూడా సమస్యలు మరింత జటిలం అయ్యాయి. నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం మాంద్యం పరిష్కారానికి చేపడుతోన్న చర్యలు కూడా అరకొరగానే మిగిలిపోయాయి. ఒక ఉద్దీపన పథకం అవసరం అయిన దశలో దానిని తిరస్కరించి; కార్పొరేట్లపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థ్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని ‘మింట్ స్థూల ఆర్థిక పరిశీలక సూచీ’ చెబుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేసే ఆలోచనలు మానుకొని తన యథాశక్తి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ఇవ్వడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఈ ఉద్దీపన గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఉండాలి., 2024 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థ్ధిక వ్యవస్థ కల కనే ముందు, నేడు మనం స్థూలవృద్ధి రేటులో ప్రపంచంలో ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. పీ.ఎస్: శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటించింది–సామాన్య జనాభా, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దీపన పథకం కాదు. అది కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు లేదా బ్యాంకుల ద్రవ్యలభ్యతను పెంచేది మాత్రమే. కానీ, ఎస్బీఐ చైర్మన్ ప్రకారం అసలు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడమేగానీ, బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవ డం కాదు. కాబట్టి సామాజిక రంగంలోన, మౌలిక వసతుల రంగంలో ఉపాధిని పెంచే చర్యలు మాత్రమే ప్రస్తుత స్థితిలో నిజమైన ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయి. వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ఎగవేతల గండం గట్టెక్కేదెలా?
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా.. 17 జాతీయ బ్యాంకులకు మొత్తం రూ. 9వేల కోట్లు బకాయి పడి పత్తా లేకుండా పోయాక.. బ్యాంకుల మొండి పద్దుల (ఎన్పీఏ లు) అంశంపై దేశంలో తీవ్ర అలజడి మొదలైంది. అదే సమయంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం వల్ల మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపై నీలినీడలు పరచుకున్నాయి. నిజానికి, బ్యాంకుల ఎన్పీఏల సమస్య కొత్తదేమీ కాదు. ఆర్థిక మందగమనం, ఇతరత్రా సమస్యల వల్ల కొన్ని సంస్థలు సకాలంలో రుణాలు చెల్లించవు. ఆర్థిక రంగం పరిస్థితులు చక్కబడ్డాక... బకాయిల్ని తీర్చేస్తుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఇదొక సహజమైన పరిణామక్రమం. 90 రోజులుగా వడ్డీ చెల్లించని రుణాలను బ్యాంకులు ఎన్‌పిఏలుగా ప్రకటిస్తుంటారు. ఎన్‌పిఏలు 4% పరిమితికి దాటితేనే ప్రమాద ఘంటికలు మోగినట్టు లెక్క. రుణాల వసూలుకు ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్స్’, ‘లోక్ అదాలత్’ వంటి వ్యవస్థలను బ్యాంకులు ఉపయోగించు కుంటాయి. కొన్ని బకాయిల వసూళ్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కస్టమర్ల విశ్వాసం సడలి పోకుండా అనేక బ్యాంకులు తమ లాభాలను ఘనంగా చాటుతూ, ఎన్పీఏలను గుట్టుగా కప్పిపెడుతుంటాయి. మొత్తంగా చూస్తే బ్యాంకుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉండటం లేదు. విజయ్ మాల్యా ఉదంతంతోను, బ్యాంకుల లాభాల క్షీణతతోను ఎన్‌పిఏల అంశాన్ని ఎక్కువ కాలం కప్పిపెట్టే పరిస్థితి కొన్ని బ్యాంకులకు లేకుండా పోయింది. 2015 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఏలు రూ. 3.14 లక్షల కోట్లకు చేరాయి. ఇవికాక, గత 3 సంవత్సరాలలో 29 ప్రభుత్వరంగ బ్యాంకులు తాము అందించిన రుణాలో 1.14 లక్షల కోట్లను మాఫీ చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ఎన్డీఏ గత ప్రభుత్వాలకు భిన్నంగా లేదు. మొండి బకాయిల కారణంగా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నెలకొంటోందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీలు అనేక హెచ్చరికలు చేశాయి. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గత రెండేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఫలితంగానే, మార్చి 2015 నాటికి 5.43% గా ఉన్న ప్రభుత్వరంగ మొండిబకాయిలు (ఎన్పిఐలు) డిసెంబర్ 2015 నాటికి 7.3%కి పెరిగిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగిన 6 వేలకోట్ల నల్లధనం తరలింపు కుంభకోణం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపింది. అయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మేలుకోలేదు. పైగా అరుణ్ జైట్లీ సమస్య తీవ్రతను తగ్గించి చూపే యత్నం చేశారు. మొండిబకారుుల సంక్షోభాన్ని ఎక్కువచేసి చెప్పడం వల్ల అసలుకే మోసం వస్తుందని, రుణాలు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని, చివరకది ఆర్థికాభివృద్ధికి చేటని ఆయన వాదించారు. మొండి బకాయిలను, నేరపూరిత ఉద్దేశాలతో చేసిన మోసాలను భిన్నంగా చూడాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వాదిస్తున్నారు. బ్యాంకుల ఎన్పీఏలు పేరుకుపోవడానికి, నష్టాల బారిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. రుణాలు అందించే సంస్థల ఆర్థిక పరిస్థితి, వాటి వ్యాపార కార్యకలాపాలు, టర్నో వర్లు, లాభాల ఆర్జన అవకాశాలు తదితర అంశాల జోలికి పోకుండా ప్రమోటర్లకున్న పేరు ప్రఖ్యాతులు, రాజకీయ పలుకుబడి తదితర అంశాల ఆధారంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రుణాలిస్తున్నాయి. బోగస్ పూచీకత్తులు చూపినా కొందరు అధికారులు రుణాలు మంజూరు చేసేస్తు న్నారు. పేపరు మీద కంపెనీలను, గ్యారంటీలను చూపి వందల, వేలకోట్ల రుణాలను పొందే ప్రమోటర్ల సంఖ్య పెరిగిపోయింది. రుణాన్ని ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారో తనిఖీ చేసే నిఘా వ్యవస్థ బ్యాంకులకు లేదు. ఐడీబీఐ, కొందరు బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా విజయ్ మాల్యాకు రుణం మంజూరు చేసింది. ఒక బ్యాంకు ఏదైనా సంస్థకు రుణాన్ని నిరాకరిస్తే, ఇవ్వడానికి మరో బ్యాంకు ముందుకొస్తున్నది. రుణాల మంజూరునకు నిర్దిష్ట ప్రాతిపదిక ఏదీ లేకపోవడం మన బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రధాన లోపం. ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు సభ్యులు ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని పి.జె.నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నంతవరకు వాటి పనితీరు మెరుగుపడదని ఆ నివేదిక పేర్కొంది. అదేవిధంగా, బ్యాంకులు తమ రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేసే క్రమంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తుల చుట్టూ రుణాలిస్తామని తిరుగుతున్నాయి. స్వల్ప వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు విజయ్‌మాల్యా లాంటి కస్టమర్లను ఎంచుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో రాజకీయ పలుకుబడి గలిగిన పారిశ్రామికవేత్తలు అనేక మంది పేరిట వందల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయిన వైనాన్ని మీడియా వెల్లడించింది. వారి పేర్లను బ్యాంకులు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిల్) సమాచారం ప్రకారం ఏపీలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 567 కాగా, వారు ఎగవేసిన రుణాల మొత్తం రూ.3,146 కోట్లు. తెలంగాణలో 116 మంది డిఫాల్టర్లు ఎగవేసిన సొమ్ము రూ.2,979 కోట్లు. సిబిల్ రికార్డులకు ఎక్కని ఎగవేతదారులు దాదాపు 7500 మంది ఉన్నారని, వారు చెల్లించాల్సిన మొత్తం రూ.1,15,301 కోట్లని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో గుణాత్మక మార్పులు తెస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగ ప్రక్షాళనను మాటల్లోనే తప్ప చేతల్లో చూపలేకపోయింది. అది నల్లధనం ప్రవాహాన్ని నిరోధించడంలోనే కాదు, ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగవేతదారులు దర్జాగా తరలించుకుపోతోన్న తెల్లధనాన్ని సైతం నిరోధించలేకపోతోంది. ఇప్పటికే, ప్రభుత్వరంగ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని చేపట్టింది. బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడానికి కేంద్రం ‘ఇంద్రధనుష్’ అనే 7 సూత్రాల ప్రణాళికను ప్రారంభించింది. బ్యాంకులు ఎవరైనా వ్యక్తిని లేదా సంస్థను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ప్రకటిస్తే... అలాంటి మోసగాళ్లకు బాండ్స్ లేదా షేర్ల ద్వారా నిధులను సమీకరించే అవకాశం లేకుండా సెబీ చర్యలు చేపట్టింది. లిస్టెడ్ కంపెనీలలో ఎగవేతదారులు ఎలాంటి హోదాలు, పదవుల్లో కొనసాగే వీలులేదని అది స్పష్టం చేసి, ఆ మేరకు కంపెనీల చట్టాలలో మార్పులు చేసింది. ఫలితంగానే విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా వివిధ కంపెనీల బోర్డుల్లో ఉన్న సభ్యత్వాన్ని కోల్పోయారు. కేంద్రం ఇప్పటికైనా మేలుకోవాలి. ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి తమ సంప్రదాయక సురక్షిత విధానాలకు అంకితం కావాలి. బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యాలను నివారించాలి. బ్యాంకుల బోర్డులలో రాజకీయ నియామకాలను నిలిపివేయాలి. అప్పుడే ఎగవేతల సంక్షోభం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు గట్టెక్కగలవు. - వ్యాసకర్త ఎమ్మెల్సీ డా॥ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మాజీ మంత్రివర్యులు. సెల్ : 99890 24579 -
పెట్టుబడికి... ప్లాటినం రక్ష!
♦ ప్లాటినం ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్ ♦ ఉత్పత్తితో పోలిస్తే డిమాండ్ పెరుగుదలే అధికం పెట్టుబడి పెట్టాలంటే ఎంతసేపూ డిపాజిట్లు, షేర్లు, రియల్ ఎస్టేటూ, బంగారం, వెండి... ఇంతేనా!! ఇంకేమీ లేవా? లేకేం... బంగారంకన్నా ఖరీదైన తెల్ల బంగారం ప్లాటినం ఉంది. కాకపోతే దీని డిమాండ్ ఎక్కువగానే ఉన్నా సరఫరా మాత్రం తక్కువ.అందుకే ధర కూడా ఎక్కువ. సరఫరా అంతగా ఉండదు కాబట్టి దీన్నెవరూ పెద్దగా సూచించరు. కాకపోతే ఈ మధ్య ప్లాటినం ఆభరణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మాత్రం స్వల్పకాలంలో లాభాలు ఆర్జించాలనుకునేవారికి ఇది బాగానే అక్కరకొస్తోంది. అందుకే ఈ వారం ప్లాటినం కబుర్లివి... ప్లాటినంతో ట్రేడింగ్ చేయొచ్చు... ప్లాటినం డిమాండ్ ఈ మధ్య బాగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లూ దృష్టి పెడుతున్నారు. అందుకే నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ 2012లో ఈ-ప్లాటినం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ప్రాధాన్యం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్ మార్కెట్లో కూడా ప్లాటినం ట్రేడింగ్‌ను ఆరంభించారు. ఇన్వెస్టర్లు ప్లాటినాన్ని యూనిట్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఈ-యూనిట్లను విక్రయించవచ్చు. కావాలనిపిస్తే ఎలక్ట్రానిక్ యూనిట్ల రూపంలో ఉంచేసుకోవచ్చు కూడా. లేదంటే భౌతికంగా డెలివరీ కూడా తీసుకోవచ్చు. ప్లాటినం భౌతిక డెలివరీ కేంద్రాలు ముంబై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లలో ఉన్నాయి. ఈ భౌతిక డెలివరీ విషయానికొస్తే ప్రస్తుతం ప్లాటినం నాణేలు, కడ్డీల రూపంలో లభ్యమవుతోంది. ఇవి జాతీయ బ్యాంకులతో పాటు అథరైజ్డ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ యూనిట్లలో ప్లాటినంను డెలివరీ చేస్తున్నారు. వీటి నాణ్యత 99.95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రాము ప్లాటినం ధర రూ.2,730కి కాస్త అటూ ఇటుగా ఉంది. దేశంలో భౌతికంగా ప్లాటినం కొనుగోలు చేయటమనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే డెలివరీలు స్వల్పంగానే నమోదవుతున్నాయి. ప్లాటినాన్ని భౌతికంగా కొనుగోలు చేసేవారు కచ్చితంగా వెండర్స్ వద్ద అధికారిక సర్టిఫికెట్‌ను సరిచూసుకోవాలి. దీంతో ధర పెరుగుతుందంటున్న నిపుణులు ఈ-ట్రేడింగ్‌లోనూ నానాటికీ వృద్ధి డిమాండ్‌కు తగ్గట్టు లేని ఉత్పత్తి ప్లాటినం ధరలు మున్ముందు బాగా పెరిగే అవకాశం ఉందని మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, డెవలప్మెంట్ నివేదిక చెబుతోంది. ఎందుకంటే దేశంలో 2017 నాటికి ప్లాటినం డిమాండ్ 80 టన్నులకు పెరిగే అవకాశముంది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితరాల వల్ల ఇక్కడ డిమాండ్ వేగంగా పెరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. యువత, మగవారు ఎక్కువగా ప్లాటినం ఆభరణాల వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే ప్లాటినంను భావితరాల బంగారంగా చెబుతున్నారు. 35-40 ఏళ్ల వయసున్న మహిళలు ప్లాటినాన్ని ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వ సూచికగా గుర్తిస్తున్నారని ప్లాటినం గిల్డ్ ఇండియా చెబుతోంది. ఇది గతేడాది డిసెంబర్లో ఎవేరా బ్రాండ్‌తో ప్లాటినం వెడ్డింగ్ కలె క్షన్స్ను ప్రారంభించింది. ఇవి ప్లాటినం డిమాండ్‌ను అనూహ్యంగా పెంచాయి. డిమాండ్ ఇంతలా పెరుగుతున్నా ప్లాటినం ఉత్పత్తి మాత్రం అలా లేదు. 2013-14లో ప్లాటినం ఉత్పత్తి అంతర్జాతీయంగా 1.7 లక్షల కిలోలుగా ఉండగా... అది గతేడాది 1.5 ల క్షల కిలోలకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ప్లాటినంలో దక్షిణాఫ్రికా వాటా 75% వరకు ఉండగా తర్వాతి స్థానాల్లో రష్యా, జింబాబ్వే ఉన్నాయి. ప్లాటినం వినియోగంలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో జపాన్, యూరప్ ఉన్నాయి. డిమాండ్-సరఫరా మధ్య తేడా ఎక్కువగా ఉంది కనక ఇది ధర పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ సంస్థ అంచనా ప్రకారం ప్లాటినం జ్యుయల్లరీ మార్కెట్ విలువ భారత్‌లో రూ.1,900 కోట్లుగా ఉంది. వార్షిక వృద్ధి 45%. ఇవీ... ప్లాటినం విశేషాలు ►చూడ్డానికి వెండిలా తెల్లగా ఉండే ప్లాటినాన్ని 1735లో గుర్తించారు. అరుదైన లోహం. దృఢమైనది. తీగలా సాగుతుంది కనక ఆభరణాల తయారీలో ఉత్తమమైంది. తుప్పు పట్టదు. దీని వల్ల ఎలాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావు. ►ప్లాటినం వినియోగంలో అగ్రస్థానం ఆటోమొబైల్ది. నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను త గ్గించడానికి ఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్స్లో ప్లాటినాన్ని ఎక్కువగా వాడతారు. ఆ తరవాత కెమికల్ రంగంలో ఆక్టేన్ పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి కోసం కూడా దీన్ని వాడతారు. ►ప్లాటినం జ్యుయలరీకి డిమాండ్ పెరుగుతోంది. గడచిన 30 ఏళ్లలో ఈ డిమాండ్ ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. ►ఎలక్ట్రానిక్స్- కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లకు ప్లాటినంతో పూత వేస్తారు. కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడంతో ఇక్కడ ప్లాటినం డిమాండ్ క్షీణించింది. 2000లో 3 లక్షల ఔన్స్‌గా ఉన్న డిమాండ్ 2014 నాటికి 2 లక్షల ఔన్స్‌కు తగ్గింది. ►ఇంకా ఆక్సిజన్ సెన్సర్లు, స్పార్క్ ప్లగ్‌లు, టర్బైన్ ఇంజన్స్, డెంటల్ అనువర్తనాలు, ఎలక్ట్రోడ్స్ తదితర వాటి తయారీలో ప్లాటినాన్ని వాడతారు. -
21 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
శ్రీకాకుళం అర్బన్: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 21 నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని జాతీయ బ్యాంకులు సుమారు ఆరురోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకు సిబ్బందికి, యాజమాన్యంకు మధ్య ఉన్నతస్థాయిలో చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చల ఫలితాలపై సమ్మె ఆధారపడి ఉంటుందని బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా సమ్మెకు సమాయత్తం అయినట్టు సంకేతాలిచ్చారు. ఈ సమ్మె తప్పనిసరిగా మారితే బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. చివరికి ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంటుంది. యాజమాన్యంకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య జీతాల పెంపు విషయమై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పరిష్కారం కావడంలేదు. ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 19.5 శాతం పెంచుతూ వేతన సవరణ చేయాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో యాజమాన్యం 12.5 శాతంకు మించి పెంచేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయికి తీసుకువెళ్లాయి. దీంతో సమ్మె అనివార్యంగా మారింది. జిల్లాలో 23 జాతీయ బ్యాంకులకు సంబంధించి 260 బ్రాంచీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సాధారణ, ఏటీఎంల ద్వారా రూ.800 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ సేవలన్నీ సమ్మె వలన నిలిచిపోయే అవకాశం ఉంది. ఆరురోజులపాటు సమ్మె జరిగితే సుమారుగా రూ.5వేల కోట్లు ఆర్థిక లావాదేవీలు ఆగిపోనున్నాయి. సమ్మె విషయమై పూర్తి సమాచారం మంగళవారం సాయంత్రంకు రానుందని ఆ సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆర్.నరేంద్ర, ఎం.రమేష్, బి.శ్రీనివాసు చెబుతున్నారు. సమ్మె అనివార్యమైతే ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకూ సమ్మెలో ఉంటామని తెలిపారు. తరువాత వచ్చే శని, ఆదివారాలు కూడా సెలువులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆరు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోతాయన్నారు. -
తెలంగాణ లావాదేవీలకు లైన్ క్లియర్!
మూడు బ్యాంకులతో ఒప్పందానికి ఆర్థిక శాఖ అనుమతి హైదరాబాద్: విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా మూడు జాతీయ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఖజానా శాఖకు తాజాగా అనుమతి లభించింది. అపాయింటెడ్ డే అయి న జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ లావాదేవీలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెవెన్యూ వసూళ్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు తదితర ప్రక్రియను ఎస్బీఐ, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా ఏర్పా టు కానున్న తెలంగాణకు సంబంధించి కూడా ఈ మూడు జాతీయ బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మేరకు ప్రస్తుత డీటీఏకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణకు ప్రత్యేకంగా ‘ట్రెజరీ.తెలంగాణ.జీవోవి.ఐఎన్’ పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ)లో నమోదు చే సుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌గా ‘తెలంగాణ.జీవోవి.ఐఎన్’ డొమైన్‌ను వినియోగించేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి