శ్రీకాకుళం అర్బన్: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 21 నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని జాతీయ బ్యాంకులు సుమారు ఆరురోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకు సిబ్బందికి, యాజమాన్యంకు మధ్య ఉన్నతస్థాయిలో చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చల ఫలితాలపై సమ్మె ఆధారపడి ఉంటుందని బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా సమ్మెకు సమాయత్తం అయినట్టు సంకేతాలిచ్చారు.
ఈ సమ్మె తప్పనిసరిగా మారితే బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. చివరికి ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంటుంది. యాజమాన్యంకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య జీతాల పెంపు విషయమై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పరిష్కారం కావడంలేదు. ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 19.5 శాతం పెంచుతూ వేతన సవరణ చేయాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో యాజమాన్యం 12.5 శాతంకు మించి పెంచేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయికి తీసుకువెళ్లాయి. దీంతో సమ్మె అనివార్యంగా మారింది.
జిల్లాలో 23 జాతీయ బ్యాంకులకు సంబంధించి 260 బ్రాంచీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సాధారణ, ఏటీఎంల ద్వారా రూ.800 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ సేవలన్నీ సమ్మె వలన నిలిచిపోయే అవకాశం ఉంది. ఆరురోజులపాటు సమ్మె జరిగితే సుమారుగా రూ.5వేల కోట్లు ఆర్థిక లావాదేవీలు ఆగిపోనున్నాయి. సమ్మె విషయమై పూర్తి సమాచారం మంగళవారం సాయంత్రంకు రానుందని ఆ సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆర్.నరేంద్ర, ఎం.రమేష్, బి.శ్రీనివాసు చెబుతున్నారు. సమ్మె అనివార్యమైతే ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకూ సమ్మెలో ఉంటామని తెలిపారు. తరువాత వచ్చే శని, ఆదివారాలు కూడా సెలువులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆరు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోతాయన్నారు.
21 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Published Tue, Jan 20 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement