ఎగవేతల గండం గట్టెక్కేదెలా?
ఎగవేతల గండం గట్టెక్కేదెలా?
Published Tue, Mar 29 2016 1:14 AM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా.. 17 జాతీయ బ్యాంకులకు మొత్తం రూ. 9వేల కోట్లు బకాయి పడి పత్తా లేకుండా పోయాక.. బ్యాంకుల మొండి పద్దుల (ఎన్‌పీఏ లు) అంశంపై దేశంలో తీవ్ర అలజడి మొదలైంది. అదే సమయంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం వల్ల మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపై నీలినీడలు పరచుకున్నాయి. నిజానికి, బ్యాంకుల ఎన్‌పీఏల సమస్య కొత్తదేమీ కాదు. ఆర్థిక మందగమనం, ఇతరత్రా సమస్యల వల్ల కొన్ని సంస్థలు సకాలంలో రుణాలు చెల్లించవు. ఆర్థిక రంగం పరిస్థితులు చక్కబడ్డాక... బకాయిల్ని తీర్చేస్తుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఇదొక సహజమైన పరిణామక్రమం. 90 రోజులుగా వడ్డీ చెల్లించని రుణాలను బ్యాంకులు ఎన్‌పిఏలుగా ప్రకటిస్తుంటారు. ఎన్‌పిఏలు 4% పరిమితికి దాటితేనే ప్రమాద ఘంటికలు మోగినట్టు లెక్క. రుణాల వసూలుకు ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్స్’, ‘లోక్ అదాలత్’ వంటి వ్యవస్థలను బ్యాంకులు ఉపయోగించు కుంటాయి.
కొన్ని బకాయిల వసూళ్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కస్టమర్ల విశ్వాసం సడలి పోకుండా అనేక బ్యాంకులు తమ లాభాలను ఘనంగా చాటుతూ, ఎన్‌పీఏలను గుట్టుగా కప్పిపెడుతుంటాయి. మొత్తంగా చూస్తే బ్యాంకుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉండటం లేదు. విజయ్ మాల్యా ఉదంతంతోను, బ్యాంకుల లాభాల క్షీణతతోను ఎన్‌పిఏల అంశాన్ని ఎక్కువ కాలం కప్పిపెట్టే పరిస్థితి కొన్ని బ్యాంకులకు లేకుండా పోయింది. 2015 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఏలు రూ. 3.14 లక్షల కోట్లకు చేరాయి. ఇవికాక, గత 3 సంవత్సరాలలో 29 ప్రభుత్వరంగ బ్యాంకులు తాము అందించిన రుణాలో 1.14 లక్షల కోట్లను మాఫీ చేశాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ఎన్డీఏ గత ప్రభుత్వాలకు భిన్నంగా లేదు. మొండి బకాయిల కారణంగా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నెలకొంటోందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీలు అనేక హెచ్చరికలు చేశాయి. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గత రెండేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఫలితంగానే, మార్చి 2015 నాటికి 5.43% గా ఉన్న ప్రభుత్వరంగ మొండిబకాయిలు (ఎన్‌పిఐలు) డిసెంబర్ 2015 నాటికి 7.3%కి పెరిగిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగిన 6 వేలకోట్ల నల్లధనం తరలింపు కుంభకోణం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపింది. అయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మేలుకోలేదు. పైగా అరుణ్ జైట్లీ సమస్య తీవ్రతను తగ్గించి చూపే యత్నం చేశారు. మొండిబకారుుల సంక్షోభాన్ని ఎక్కువచేసి చెప్పడం వల్ల అసలుకే మోసం వస్తుందని, రుణాలు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని, చివరకది ఆర్థికాభివృద్ధికి చేటని ఆయన వాదించారు. మొండి బకాయిలను, నేరపూరిత ఉద్దేశాలతో చేసిన మోసాలను భిన్నంగా చూడాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వాదిస్తున్నారు.
బ్యాంకుల ఎన్‌పీఏలు పేరుకుపోవడానికి, నష్టాల బారిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. రుణాలు అందించే సంస్థల ఆర్థిక పరిస్థితి, వాటి వ్యాపార కార్యకలాపాలు, టర్నో వర్‌లు, లాభాల ఆర్జన అవకాశాలు తదితర అంశాల జోలికి పోకుండా ప్రమోటర్లకున్న పేరు ప్రఖ్యాతులు, రాజకీయ పలుకుబడి తదితర అంశాల ఆధారంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రుణాలిస్తున్నాయి. బోగస్ పూచీకత్తులు చూపినా కొందరు అధికారులు రుణాలు మంజూరు చేసేస్తు న్నారు. పేపరు మీద కంపెనీలను, గ్యారంటీలను చూపి వందల, వేలకోట్ల రుణాలను పొందే ప్రమోటర్ల సంఖ్య పెరిగిపోయింది. రుణాన్ని ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారో తనిఖీ చేసే నిఘా వ్యవస్థ బ్యాంకులకు లేదు.
ఐడీబీఐ, కొందరు బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా విజయ్ మాల్యాకు రుణం మంజూరు చేసింది. ఒక బ్యాంకు ఏదైనా సంస్థకు రుణాన్ని నిరాకరిస్తే, ఇవ్వడానికి మరో బ్యాంకు ముందుకొస్తున్నది. రుణాల మంజూరునకు నిర్దిష్ట ప్రాతిపదిక ఏదీ లేకపోవడం మన బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రధాన లోపం. ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు సభ్యులు ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని పి.జె.నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నంతవరకు వాటి పనితీరు మెరుగుపడదని ఆ నివేదిక పేర్కొంది.
అదేవిధంగా, బ్యాంకులు తమ రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేసే క్రమంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తుల చుట్టూ రుణాలిస్తామని తిరుగుతున్నాయి. స్వల్ప వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు విజయ్‌మాల్యా లాంటి కస్టమర్లను ఎంచుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో రాజకీయ పలుకుబడి గలిగిన పారిశ్రామికవేత్తలు అనేక మంది పేరిట వందల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయిన వైనాన్ని మీడియా వెల్లడించింది. వారి పేర్లను బ్యాంకులు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిల్) సమాచారం ప్రకారం ఏపీలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 567 కాగా, వారు ఎగవేసిన రుణాల మొత్తం రూ.3,146 కోట్లు. తెలంగాణలో 116 మంది డిఫాల్టర్లు ఎగవేసిన సొమ్ము రూ.2,979 కోట్లు. సిబిల్ రికార్డులకు ఎక్కని ఎగవేతదారులు దాదాపు 7500 మంది ఉన్నారని, వారు చెల్లించాల్సిన మొత్తం రూ.1,15,301 కోట్లని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో గుణాత్మక మార్పులు తెస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగ ప్రక్షాళనను మాటల్లోనే తప్ప చేతల్లో చూపలేకపోయింది. అది నల్లధనం ప్రవాహాన్ని నిరోధించడంలోనే కాదు, ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగవేతదారులు దర్జాగా తరలించుకుపోతోన్న తెల్లధనాన్ని సైతం నిరోధించలేకపోతోంది.
ఇప్పటికే, ప్రభుత్వరంగ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని చేపట్టింది. బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడానికి కేంద్రం ‘ఇంద్రధనుష్’ అనే 7 సూత్రాల ప్రణాళికను ప్రారంభించింది. బ్యాంకులు ఎవరైనా వ్యక్తిని లేదా సంస్థను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ప్రకటిస్తే... అలాంటి మోసగాళ్లకు బాండ్స్ లేదా షేర్ల ద్వారా నిధులను సమీకరించే అవకాశం లేకుండా సెబీ చర్యలు చేపట్టింది.
లిస్టెడ్ కంపెనీలలో ఎగవేతదారులు ఎలాంటి హోదాలు, పదవుల్లో కొనసాగే వీలులేదని అది స్పష్టం చేసి, ఆ మేరకు కంపెనీల చట్టాలలో మార్పులు చేసింది. ఫలితంగానే విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా వివిధ కంపెనీల బోర్డుల్లో ఉన్న సభ్యత్వాన్ని కోల్పోయారు. కేంద్రం ఇప్పటికైనా మేలుకోవాలి. ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి తమ సంప్రదాయక సురక్షిత విధానాలకు అంకితం కావాలి. బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యాలను నివారించాలి. బ్యాంకుల బోర్డులలో రాజకీయ నియామకాలను నిలిపివేయాలి. అప్పుడే ఎగవేతల సంక్షోభం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు గట్టెక్కగలవు.
- వ్యాసకర్త ఎమ్మెల్సీ
డా॥ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
కేంద్ర మాజీ మంత్రివర్యులు. సెల్ : 99890 24579
Advertisement
Advertisement