The National Crime Records Bureau
-
అల్లర్లలో రెండో స్థానం
రాష్ట్రంలో భారీగా పెరిగిన మత, రాజకీయ సంబంధ అల్లర్లు సైబర్ క్రైంలో బెంగళూరు నంబర్ వన్ స్పష్టం చేస్తున్న ‘ఎన్సీఆర్బీ-15’ నివేదిక బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మత, రాజకీయ సంబంధ అల్లర్లకు రాజధానిగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో కర్ణాటకలో మత సంబంధ అల్లర్ల (కమ్యూనల్ రియోట్)కు సంబంధించి 38 కేసులు నమోదు కాగా, 2015 ఏడాదిలో ఆ సంఖ్య 163కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే మత అల్లర్లు 330 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో హర్యాణ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అంటే దక్షిణాదిలో మత అల్లర్లలో కర్ణాటకదే అగ్రస్థానం అని అర్థమవుతోంది. ఈ గణాంకాలన్నీ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో’ (ఎన్సీఆర్బీ) రెండు రోజుల ముందు 2015 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన నివేదికలోనివే. ఇక రాజకీయ సంబంధ అల్లర్ల విషయంలో కూడా కేరళ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 2015 ఏడాదిన మొత్తం 166 రాజకీయ సంబంధ అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగగా అందులో 342 మంది బాధితులు ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రాజకీయ అల్లర్ల సంబంధ కేసుల సంఖ్య 253 శాతం పెరిగింది. మొత్తంగా 2015 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల అల్లర్లకు సంబంధించి 6,606 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ-15 నివేదిక సష్టం చేస్తోంది. ఈ ఎన్సీఆర్బీ నివేదికలోని మరికొన్ని ముఖ్యమైన విషయాలు... ► కర్ణాటకలో 2015 ఏడాదిలో వివిధ రకాల చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన విషయమై మొత్తం 1.38 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్యలో 4.7 శాతం కర్ణాటకలోనే నమోదవుతున్నాయి. బెంగళూరులో ఈ సంఖ్య 35,576 ►ఎస్సీ,ఎస్టీ వర్గాల వారిపై దాడికి పాల్పడిన సంఘటనలకు సంబంధించి (ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్సన్ ఆఫ్ అట్రసిటీ) యాక్ట్-1989) మొత్తం 1,832 కేసులు నమోదు కాగా ఈ విషయంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ►కర్ణాటకలో మొత్తం 1,447 సైబర్ క్రైం సంబంధించిన కేసులు నమోదు కాగా 2014లో ఆ సంఖ్య 1,020గా ఉంది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో 1,041 సైబర్ కేసులు నమోదయ్యాయి. కేసులు ఈ విషయంలో బెంగళూరు దేశంలో మొదటి స్థానంలో ఉంది. ► కర్ణాటకలో 2015లో మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు తదితర విషయాలకు సంబంధించి (సెక్సువల్ అఫెన్స్ అండర్ ఐపీసీ) 5,871 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం మహిళలపై దాడులకు సంబంధించి 12,705 కేసులు ఉన్నాయి. ► ‘పోస్కో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్) కింద కర్ణాటకలో 2015లో మొత్తం 1,073 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తమిళనాడుతో కలిసి కర్ణాటక మూడోస్థానంలో ఉంది. -
అతడు.. ఆమె హత్యలు
ప్రాణం తీస్తున్న వివాహేతర సంబంధాలు ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి విజయవాడ : గతంలో ప్రత్యర్థి హత్యలకు పేరొందిన కమిషనరేట్ ప్రస్తుతం వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగే హత్యలకు వేదికగా మారుతోంది. కొన్ని నెలలుగా జరిగిన హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే వివాహేతర సంబంధాలు ఏ మేరకు దుష్పరిణామాలు పెంచుతున్నాయో స్పష్టమవుతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికను పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత కక్షల కారణంగా జరుగుతున్న హత్యలు ఏయేటికాయేడు పెరుగుతున్నట్టు వెల్లడవుతోంది. ఆర్థిక స్థితిగతులు, జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. తాహతుకు మించిన కోర్కెలతో దారి తప్పుతున్న జీవితాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్యాణి అనే మహిళ కారణంగా చనిపోయారు. వీరిలో ఇద్దరిని ఆమే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మరో యువకుడితో కలిసి పరారై కేరళలో ఆత్మహత్యకు పాల్పడింది. తనతోసహా కుమారుడు, భర్త, మరో ఇద్దరి ప్రాణాలు పోయేందుకు ఆమె వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. గన్నవరానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రి నర్సురాణి పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మొదటి వ్యక్తిని వదిలించుకునేందుకు కొత్త ప్రియుడితో కలిసి ఆమె పథకం రచించగా కుట్ర వికటించి ఆమె ప్రాణాలనే బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలను వదిలేసి మరో వివాహితతో నగరానికి వచ్చాడు. నున్న పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేందుకు అడ్డుగా ఉందని ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలో వివాహం విషయమై నెలకొన్న విభేదాలకు ఓ ఐటీ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణలంకలో మరో మహిళ తన ప్రియుడిని చంపేసి కాల్వలో పడేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. ఇలా అనేక కేసుల్లో హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలు కారణమని వెల్లడవుతోంది. ఆర్థిక స్థితిగతులు ఉన్నంతలో సరిపెట్టుకోలేని తత్వమే వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాస్తవిక ఆలోచనలకు దూరంగా వచ్చే ఆదాయానికి మించి జీవితం గడపాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జీవన శైలిలో వచ్చిన మార్పులకు సరిపడా ఆదాయం లేక పరాయి వ్యక్తులపట్ల ఆకర్షితులవుతున్నారు. ఇంతకంటే మరో మెరుగైన అవకాశం రావడంతో స్పర్థలకు దారితీసి హత్యలకు పురిగొలుపుతోంది. మరికొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ కట్టుబాట్లపై తగిన అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనేది పోలీసు అధికారుల అభిప్రాయం. -
రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం
2014లో 898 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ వెల్లడి ఆ సంఖ్య 200 మించదని అంటున్న ప్రభుత్వం ఆర్థికంగా దివాలా, అప్పుల వల్లే ఈ దుస్థితి హైదరాబాద్: రాష్ట్రంలో 2014లో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత ఏడాది 5,650 మంది ఆత్మహత్య చేసుకోగా... మహారాష్ట్రలో అత్యధికంగా 2,568 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, అప్పులు, ఆర్థికంగా దివాలా తీయడం, కుటుంబ సమస్యల కారణంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ పేర్కొంది. రాష్ట్రంలో 23.2 శాతం మంది ఆర్థికంగా దివాలా తీయడం, అప్పుల కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారని బ్యూరో నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా వేసిన అంచనా ప్రకారం పంట నష్టం కారణంగా 16.8 శాతం మంది, వ్యవసాయ సంబంధిత సమస్యల కారణంగా 17.2 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పెళ్లి సంబంధిత సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అప్పులు, దివాలా కారణంగా ఎక్కువశాతం మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 41.8 శాతం మంది సన్నకారు రైతులు, 25.2 శాతం మధ్యతరహా రైతులు, 22.5 శాతం మంది చిన్నకారు రైతులు, 2.3 శాతం మంది పెద్ద రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక తెలంగాణలో 898 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ ప్రకటిస్తే ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య 200 కంటే ఎక్కువ ఉండబోదని చెబుతోంది. దుర్భర పరిస్థితులే కారణం రాష్ట్రంలో 2014-15లో వ్యవసాయరంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో గత ఖరీఫ్, రబీలో పూర్తిస్థాయిలో వర్షాలు కురవలేదు. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 498.1 మిల్లీమీటర్లు (30% లోటు) మాత్రమే నమోదైంది. అలాగే గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు రబీలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా... కేవలం 50.8 మిల్లీమీటర్లు (61% లోటు) నమోదైంది. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రబీలో ఆహార ధాన్యాల సాగు 10.41 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 8.13 లక్షల హెకార్టకే పరిమితమైంది. విస్తీర్ణం తగ్గడంతోపాటు వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు నష్టపోయారు. పైగా ప్రభుత్వం రుణమాఫీని సకాలంలో అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు దాదాపు గత ఖరీఫ్ ముగిసే వరకు కూడా కొత్త రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా గత వ్యవసాయ సంవత్సరంలో రైతులు సుమారు రూ. 18 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.