అతడు.. ఆమె హత్యలు
ప్రాణం తీస్తున్న వివాహేతర సంబంధాలు
ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
విజయవాడ : గతంలో ప్రత్యర్థి హత్యలకు పేరొందిన కమిషనరేట్ ప్రస్తుతం వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగే హత్యలకు వేదికగా మారుతోంది. కొన్ని నెలలుగా జరిగిన హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే వివాహేతర సంబంధాలు ఏ మేరకు దుష్పరిణామాలు పెంచుతున్నాయో స్పష్టమవుతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికను పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత కక్షల కారణంగా జరుగుతున్న హత్యలు ఏయేటికాయేడు పెరుగుతున్నట్టు వెల్లడవుతోంది.
ఆర్థిక స్థితిగతులు, జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. తాహతుకు మించిన కోర్కెలతో దారి తప్పుతున్న జీవితాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్యాణి అనే మహిళ కారణంగా చనిపోయారు. వీరిలో ఇద్దరిని ఆమే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మరో యువకుడితో కలిసి పరారై కేరళలో ఆత్మహత్యకు పాల్పడింది. తనతోసహా కుమారుడు, భర్త, మరో ఇద్దరి ప్రాణాలు పోయేందుకు ఆమె వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
గన్నవరానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రి నర్సురాణి పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మొదటి వ్యక్తిని వదిలించుకునేందుకు కొత్త ప్రియుడితో కలిసి ఆమె పథకం రచించగా కుట్ర వికటించి ఆమె ప్రాణాలనే బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలను వదిలేసి మరో వివాహితతో నగరానికి వచ్చాడు. నున్న పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేందుకు అడ్డుగా ఉందని ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలో వివాహం విషయమై నెలకొన్న విభేదాలకు ఓ ఐటీ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణలంకలో మరో మహిళ తన ప్రియుడిని చంపేసి కాల్వలో పడేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. ఇలా అనేక కేసుల్లో హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలు కారణమని వెల్లడవుతోంది.
ఆర్థిక స్థితిగతులు
ఉన్నంతలో సరిపెట్టుకోలేని తత్వమే వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాస్తవిక ఆలోచనలకు దూరంగా వచ్చే ఆదాయానికి మించి జీవితం గడపాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జీవన శైలిలో వచ్చిన మార్పులకు సరిపడా ఆదాయం లేక పరాయి వ్యక్తులపట్ల ఆకర్షితులవుతున్నారు. ఇంతకంటే మరో మెరుగైన అవకాశం రావడంతో స్పర్థలకు దారితీసి హత్యలకు పురిగొలుపుతోంది. మరికొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ కట్టుబాట్లపై తగిన అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనేది పోలీసు అధికారుల అభిప్రాయం.