అల్లర్లలో రెండో స్థానం
రాష్ట్రంలో భారీగా పెరిగిన మత, రాజకీయ సంబంధ అల్లర్లు
సైబర్ క్రైంలో బెంగళూరు నంబర్ వన్
స్పష్టం చేస్తున్న ‘ఎన్‌సీఆర్‌బీ-15’ నివేదిక
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మత, రాజకీయ సంబంధ అల్లర్లకు రాజధానిగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో కర్ణాటకలో మత సంబంధ అల్లర్ల (కమ్యూనల్ రియోట్)కు సంబంధించి 38 కేసులు నమోదు కాగా, 2015 ఏడాదిలో ఆ సంఖ్య 163కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే మత అల్లర్లు 330 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో హర్యాణ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అంటే దక్షిణాదిలో మత అల్లర్లలో కర్ణాటకదే అగ్రస్థానం అని అర్థమవుతోంది. ఈ గణాంకాలన్నీ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో’ (ఎన్‌సీఆర్‌బీ) రెండు రోజుల ముందు 2015 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన నివేదికలోనివే. ఇక రాజకీయ సంబంధ అల్లర్ల విషయంలో కూడా కేరళ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 2015 ఏడాదిన మొత్తం 166 రాజకీయ సంబంధ అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగగా అందులో 342 మంది బాధితులు ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రాజకీయ అల్లర్ల సంబంధ కేసుల సంఖ్య 253 శాతం పెరిగింది. మొత్తంగా 2015 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల అల్లర్లకు సంబంధించి 6,606 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ-15 నివేదిక సష్టం చేస్తోంది. ఈ ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని మరికొన్ని ముఖ్యమైన విషయాలు...
► కర్ణాటకలో 2015 ఏడాదిలో వివిధ రకాల చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన విషయమై మొత్తం 1.38 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్యలో 4.7 శాతం కర్ణాటకలోనే నమోదవుతున్నాయి. బెంగళూరులో ఈ సంఖ్య 35,576
►ఎస్సీ,ఎస్టీ వర్గాల వారిపై దాడికి పాల్పడిన సంఘటనలకు సంబంధించి (ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్సన్ ఆఫ్ అట్రసిటీ) యాక్ట్-1989) మొత్తం 1,832 కేసులు నమోదు కాగా ఈ విషయంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది.
►కర్ణాటకలో మొత్తం 1,447 సైబర్ క్రైం సంబంధించిన కేసులు నమోదు కాగా 2014లో ఆ సంఖ్య 1,020గా ఉంది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో 1,041 సైబర్ కేసులు నమోదయ్యాయి. కేసులు ఈ విషయంలో బెంగళూరు దేశంలో మొదటి స్థానంలో ఉంది.
► కర్ణాటకలో 2015లో మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు తదితర విషయాలకు సంబంధించి (సెక్సువల్ అఫెన్స్ అండర్ ఐపీసీ) 5,871 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం మహిళలపై దాడులకు సంబంధించి 12,705 కేసులు ఉన్నాయి.
► ‘పోస్కో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్) కింద కర్ణాటకలో 2015లో మొత్తం 1,073 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తమిళనాడుతో కలిసి కర్ణాటక మూడోస్థానంలో ఉంది.