communal riot
-
అల్లర్లలో రెండో స్థానం
రాష్ట్రంలో భారీగా పెరిగిన మత, రాజకీయ సంబంధ అల్లర్లు సైబర్ క్రైంలో బెంగళూరు నంబర్ వన్ స్పష్టం చేస్తున్న ‘ఎన్సీఆర్బీ-15’ నివేదిక బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మత, రాజకీయ సంబంధ అల్లర్లకు రాజధానిగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో కర్ణాటకలో మత సంబంధ అల్లర్ల (కమ్యూనల్ రియోట్)కు సంబంధించి 38 కేసులు నమోదు కాగా, 2015 ఏడాదిలో ఆ సంఖ్య 163కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే మత అల్లర్లు 330 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో హర్యాణ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అంటే దక్షిణాదిలో మత అల్లర్లలో కర్ణాటకదే అగ్రస్థానం అని అర్థమవుతోంది. ఈ గణాంకాలన్నీ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో’ (ఎన్సీఆర్బీ) రెండు రోజుల ముందు 2015 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన నివేదికలోనివే. ఇక రాజకీయ సంబంధ అల్లర్ల విషయంలో కూడా కేరళ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 2015 ఏడాదిన మొత్తం 166 రాజకీయ సంబంధ అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగగా అందులో 342 మంది బాధితులు ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రాజకీయ అల్లర్ల సంబంధ కేసుల సంఖ్య 253 శాతం పెరిగింది. మొత్తంగా 2015 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల అల్లర్లకు సంబంధించి 6,606 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ-15 నివేదిక సష్టం చేస్తోంది. ఈ ఎన్సీఆర్బీ నివేదికలోని మరికొన్ని ముఖ్యమైన విషయాలు... ► కర్ణాటకలో 2015 ఏడాదిలో వివిధ రకాల చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన విషయమై మొత్తం 1.38 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్యలో 4.7 శాతం కర్ణాటకలోనే నమోదవుతున్నాయి. బెంగళూరులో ఈ సంఖ్య 35,576 ►ఎస్సీ,ఎస్టీ వర్గాల వారిపై దాడికి పాల్పడిన సంఘటనలకు సంబంధించి (ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్సన్ ఆఫ్ అట్రసిటీ) యాక్ట్-1989) మొత్తం 1,832 కేసులు నమోదు కాగా ఈ విషయంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ►కర్ణాటకలో మొత్తం 1,447 సైబర్ క్రైం సంబంధించిన కేసులు నమోదు కాగా 2014లో ఆ సంఖ్య 1,020గా ఉంది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో 1,041 సైబర్ కేసులు నమోదయ్యాయి. కేసులు ఈ విషయంలో బెంగళూరు దేశంలో మొదటి స్థానంలో ఉంది. ► కర్ణాటకలో 2015లో మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు తదితర విషయాలకు సంబంధించి (సెక్సువల్ అఫెన్స్ అండర్ ఐపీసీ) 5,871 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం మహిళలపై దాడులకు సంబంధించి 12,705 కేసులు ఉన్నాయి. ► ‘పోస్కో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్) కింద కర్ణాటకలో 2015లో మొత్తం 1,073 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తమిళనాడుతో కలిసి కర్ణాటక మూడోస్థానంలో ఉంది. -
మంగళవారం షాపు తెరిచాడని ఘర్షణ
బెంగళూరు: మంగళవారం పూట బార్బర్ షాపు తెరిచాడనే ఆవేశంతో ఓ ముస్లిం షాపు యజమానిపై దాడిచేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళూరుకు సమీపంలోని నెల్లివాడి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు నాయకులు, మూకుమ్మడిగా షాపు యజమాని సల్మాన్ పై దాడి చేశారు. షాపులను ధ్వంసం చేశారు. దీంతో ముస్లిం, విశ్వహిందూ పరిషత్ కు చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. ఉదయ్ కుమార్, బాలయ్య ఆధ్వర్యంలో సల్మాన్ పై దాడి చేశారు. దీంతో పాటు స్థానిక మసీద్ పై దాడికి దిగారు. దీనికి ప్రతిగా మరో గ్రూపు ఎదురు దాడికి పూనుకుంది. స్థానిక ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసినందుకు సల్మాన్ పై దాడి చేసినట్టుగా భజరగ్ దళ్ నాయకుడు రవి బాలయ్య తన వైఖరిని సమర్ధించుకున్నారు. హిందువులు మంగళవారం క్షవరం చేయించుకోరనే సంగతి అందరికీ తెలుసన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ పనికి పూనుకున్నారని ఆరోపించారు. అటు వీరి ఆరోపణలు తిప్పికొట్టిన ముస్లిం నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఒక పథకం ప్రకారం భజరంగ్ దళ్ నేతలు ముస్లింలపై దాడి దిగారని స్థానిక మసీదు పెద్ద ఆరోపించారు. యువతను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారన్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ మతఘర్షణలో లక్షల రూపాయల ఆస్తి ధ్వంసమైంది. పలువురుకి గాయాలయ్యాయి. వివాదాన్ని చక్కదిద్దేందుకు పోలీసులు కర్ఫూ విధించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
మజాక్ నుంచి మత కల్లోలం దాకా....
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదాగా మొదలైన వేళాకోళం వికటించి ఏకంగా మత ఉద్రిక్తతకి దారి తీసి, అయిదుగురు గాయపడేదాకా వచ్చింది. ఇదంతా ఇప్పటికే కమ్యూనల్ కుంపటిపై కుతకుతలాడుతున్న మీరట్ నగరంలో జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బలగాలను మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మీరట్ లోని లాల్ కుర్తీ ప్రాంతంలో పింటూ, అజ్జూ అనే ఇద్దరు దోస్తులు ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. అది నెమ్మదిగా వేడెక్కింది. ఇంతలోపింటూ ఒక అగ్గిపుల్ల వెలిగించి అజ్జూపైకి విసిరాడు. అంతే... అజ్జూ కి తిక్కరేగింది. క్షణాల్లో ఫోన్ చేసి మిత్రులందరినీ పిలుచుకున్నారు. పింటూ తనవారిని లాఠీలతో సహా రమ్మన్నాడు. అంతే నినాదాలు, వివాదాలు, లాఠీలు, ఈటెలు మొదలయ్యాయి. చివరికి ఒకరు నాటు తుపాకీ తెచ్చి పేల్చాడు. దాంతో జనం శివాలెత్తి పెళ్లి బస్సు సహా కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసురుకోవడం మొదలైంది. చివరికి పోలీసులను దించి, కర్ ఫ్యూ విధించి, గంటల పాటు శ్రమిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
తప్పుల నుంచి పాఠాలు నేర్వలేదు
ముజఫర్నగర్ అల్లర్లపై రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన కొందరి వల్లే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు: ప్రధాని న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణలు బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. పాత తప్పుల నుంచి దేశం పాఠాలు నేర్వలేదని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేయగా, సమాజంలో కొందరు వ్యక్తుల వల్లే ఇలాంటి అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఉద్ఘాటించారు. శుక్రవారమిక్కడ జాతీయ మత సామరస్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిరువురు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ. ‘‘కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా సమాజంలోని పౌరులంతా సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిచేందుకు కృషి చేయాలని మన రాజ్యాగం నిర్దేశిస్తోంది. చట్టాలు కూడా ఇవే చెబుతున్నాయి. పాలనా యంత్రాంగం కూడా ఇందుకు పాటుపడుతోంది. అయినా సమాజాన్ని మతతత్వ జాడ్యం వీడడం లేదు. మత పరమైన అల్లర్లు పునరావృతమవుతూనే ఉన్నాయి. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్వకపోవడమే ఇందుకు కారణం’’ అని ప్రణబ్ అన్నారు. దేశంలో ఏ ఒక్క వ్యవస్థ విద్వేషాన్ని ప్రోత్సహించడం లేదని, అన్ని మతాలు కూడా శాంతి, సామరస్యాన్నే ప్రబోధిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ సామరస్య భావనను పెంపొందించాలని సూచించారు. అనంతరం ప్రధాని మాట్లాడారు. దేశంలో శతాబ్దాల నుంచి విభిన్న మతాలు శాంతికి పెద్దపీట వేస్తూ పరిఢవిల్లాయని చెప్పారు. కొందరు వ్యక్తుల వల్లే అల్లర్లు చోటుచేసుకుంటాయని, ఇలాంటి శక్తులను సమాజానికి దూరంగా పెట్టడం పౌరుల కర్తవ్యమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని, జాతి సమగ్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమాజంలో ఘర్షణలు, అల్లర్లను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈనెల 23న ‘జాతీయ సమగ్రత మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2011 సంవత్సరానికిగాను జాతీయ మత సామరస్య అవార్డును మిజోరాంకు చెందిన కమ్లియానా, ఒడిశాకు చెందిన ఎండీ అబ్దుల్ బారిలకు సంయుక్తంగా అందజేశారు. 2012కుగాను ఢిల్లీకి చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అమిటీ అండ్ నేషనల్ సాలిడరిటీ’ సంస్థ అవార్డును గెల్చుకుంది.