తప్పుల నుంచి పాఠాలు నేర్వలేదు
ముజఫర్‌నగర్ అల్లర్లపై రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
కొందరి వల్లే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు: ప్రధాని
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణలు బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. పాత తప్పుల నుంచి దేశం పాఠాలు నేర్వలేదని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేయగా, సమాజంలో కొందరు వ్యక్తుల వల్లే ఇలాంటి అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఉద్ఘాటించారు. శుక్రవారమిక్కడ జాతీయ మత సామరస్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిరువురు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ. ‘‘కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా సమాజంలోని పౌరులంతా సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిచేందుకు కృషి చేయాలని మన రాజ్యాగం నిర్దేశిస్తోంది. చట్టాలు కూడా ఇవే చెబుతున్నాయి. పాలనా యంత్రాంగం కూడా ఇందుకు పాటుపడుతోంది.
అయినా సమాజాన్ని మతతత్వ జాడ్యం వీడడం లేదు. మత పరమైన అల్లర్లు పునరావృతమవుతూనే ఉన్నాయి. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్వకపోవడమే ఇందుకు కారణం’’ అని ప్రణబ్ అన్నారు. దేశంలో ఏ ఒక్క వ్యవస్థ విద్వేషాన్ని ప్రోత్సహించడం లేదని, అన్ని మతాలు కూడా శాంతి, సామరస్యాన్నే ప్రబోధిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ సామరస్య భావనను పెంపొందించాలని సూచించారు. అనంతరం ప్రధాని మాట్లాడారు. దేశంలో శతాబ్దాల నుంచి విభిన్న మతాలు శాంతికి పెద్దపీట వేస్తూ పరిఢవిల్లాయని చెప్పారు. కొందరు వ్యక్తుల వల్లే అల్లర్లు చోటుచేసుకుంటాయని, ఇలాంటి శక్తులను సమాజానికి దూరంగా పెట్టడం పౌరుల కర్తవ్యమని పేర్కొన్నారు.
మత సామరస్యాన్ని, జాతి సమగ్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమాజంలో ఘర్షణలు, అల్లర్లను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈనెల 23న ‘జాతీయ సమగ్రత మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2011 సంవత్సరానికిగాను జాతీయ మత సామరస్య అవార్డును మిజోరాంకు చెందిన కమ్లియానా, ఒడిశాకు చెందిన ఎండీ అబ్దుల్ బారిలకు సంయుక్తంగా అందజేశారు. 2012కుగాను ఢిల్లీకి చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అమిటీ అండ్ నేషనల్ సాలిడరిటీ’ సంస్థ అవార్డును గెల్చుకుంది.