జాతీయ ‘అసమగ్రతా’ భేటీ!
సంపాదకీయం: మతతత్వాన్ని నిరోధించేందుకు రాజకీయ నాయకులు, ప్రజలు ఉమ్మడిగా కృషిచేయాలని పిలుపునిస్తూ జాతీయ సమగ్రతా మండలి సమావేశం సోమవారం ఢిల్లీలో ముగిసింది. కేంద్రమంత్రులు, విపక్ష నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు, భిన్న జీవనరంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో నిజానికి జాతీయతగానీ, సమగ్రతగానీ తగినంతగా కనబడలేదు. సమావేశానికి కేవలం 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే హాజరుకాగా...హాజరైనవారు సెక్యులర్, నాన్ సెక్యులర్ శిబిరాలుగా విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
అమ్మకు గుడి కట్టాలనుకుని రాత్రంతా తీవ్రంగా చర్చించి తెల్లారేసరికి ఎవరి దోవన వారు వెళ్లిన చందంగానే సమావేశం పూర్తయింది. ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ కల్లోలం ఎవరు చేసినట్టు? ఎందుకు జరిగినట్టు? దాదాపు 50మంది ఎలా ప్రాణాలు కోల్పోయినట్టు? ఘర్షణలు జరిగి పక్షం రోజులు దాటుతున్నా ఇప్పటికీ కనీస సౌకర్యాలు కూడాలేని శిబిరాల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా 50,000మంది ఎందుకు తలదాచుకోవాల్సివస్తున్నట్టు? దేశం సమస్తం సిగ్గుపడాల్సిన ఘటనలు సంభవించాక జరిగిన ఈ సమావేశం ఇలాంటి అంశాలపై చర్చించివుంటే, ఆత్మవిమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. ఘర్షణల సందర్భంగా తెగువను ప్రదర్శించి అసహాయులను కాపాడటానికి ప్రయత్నించినవారి స్ఫూర్తిని చాటిచెబితే బాగుండేది.
ఈ సమావేశం దృష్టంతా సోషల్ మీడియాపై పడింది. భిన్నవర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదని, అవాస్తవాలను ప్రచారంచేసి ఉద్రిక్తతలను ప్రేరేపిస్తున్నదని ప్రధాని మొదలుకొని సీఎంలవరకూ చాలామంది చెప్పారు. దాన్ని నియంత్రణలోకి తేవాల్సిన అవసరం ఉన్నదన్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వాలకు, కొందరు నేతలకు ఉన్న అభ్యంతరాలు ఈనాటివి కాదు. ఏ విషయాన్నయినా అక్షరబద్ధమో, దృశ్యబద్ధమోచేసి క్షణాల్లో ప్రపంచానికి తెలియపరిచే సాధనంగా ఉన్న ఈ మీడియాను ఎలాగైనా అదుపుచేయాలని వీరు కోరుకుంటున్నారు.
ఇది ఈ దేశంలో కనబడే ధోరణి మాత్రమే కాదు. అన్నిచోట్లా పాలకులు ఇంటర్నెట్పైనా, అందులో ప్రవహిస్తున్న సమాచారంపైనా క త్తిగట్టడం నడుస్తున్న చరిత్ర. ముద్రణామాధ్యమం వచ్చిన కొత్తలో దాన్ని గుప్పిట బంధించేందుకు, అచ్చు అక్షరాన్ని అణిచేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో చరిత్రనిండా రికార్డయి ఉన్నాయి. అలాగని ఇలాంటి మాధ్యమాలను దుర్వినియోగపరిచే శక్తులు లేవని అనలేం. సమాజంలో భిన్నవర్గాలమధ్య విద్వేషాలను పెంచడానికి, అపోహలను సృష్టించడానికి, రాజకీయ నాయకులను కించపరిచేందుకు, సున్నితమైన మతవిశ్వాసాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించే శక్తులు ఉన్నాయి. అలాంటి శక్తులు సోషల్ మీడియాను మాత్రమే కాదు...అన్ని మార్గాలనూ ఎంచుకుంటాయి. కానీ, నిరంతర అప్రమత్తతతో మెలిగినప్పుడు, ప్రజలను చైతన్యవంతుల్ని చేసినప్పుడు ఆ తరహా శక్తుల ఆటలు సాగవు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారానో, ఎస్సెమ్మెస్ ద్వారానో, మొబైల్ ఫోన్లద్వారానో ఎవరైనా వదంతులు వ్యాప్తిచేస్తే దాని పుట్టుపూర్వోత్తరాలను క్షణాల్లో పట్టేయగల సాంకేతికత అభివృద్ధిచెందింది.
ఆధారాలు మిగల్చకుండా నేరం చేద్దామనుకుంటే ఈ మాధ్యమంలో సాధ్యం కాదు. కానీ, అదేమిటో... ఏమైనా గొడవలు జరిగినప్పుడు, సమాజంలో భయోద్విగ్నతలు అలుముకున్నప్పుడు అందుకు సోషల్ మీడియా వెబ్సైట్లే కారణమని చెబుతున్న కేంద్రం...అందుకు కారకులైనవారిని గుర్తించి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడవు. అలాంటి ఘటనలనుంచి గుణపాఠాలు నేర్చుకుని వెనువెంటనే ఏమేమి చేయాల్సి ఉంటుందో గ్రహించిన జాడ కనబడదు. నిరుడు ఆగస్టులో వదంతులకు భయపడి ఈశాన్యంలో స్థిరపడిన ఇతరప్రాంతాలవారు లక్షలమంది స్వస్థలాలకు ప్రయాణం కట్టినప్పుడు పాకిస్థాన్ నుంచి వివిధ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా వదంతుల్ని వ్యాప్తిచేశారని కేంద్రం అన్నది. ఆ సందర్భంగా 250 సైట్లను నిషేధించింది కూడా. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ముజఫర్నగర్ కల్లోలానికి ఒకరినుంచి ఒకరికి పంపిణీ అయిన వీడియో కారణమని చెబుతున్నారు. మారుమూల చీమ చిటుక్కుమంటే క్షణాల్లో తెలుసుకోగలిగిన విస్తృత యంత్రాంగం ఉండే ప్రభుత్వాలకు ఇలాంటి శక్తుల చర్యలపై అదుపాజ్ఞలు లేవంటే ఏమనుకోవాలి? కనీసం పొరుగునున్న హర్యానానుంచి ఒక వర్గానికి చెందినవారంతా మీటింగులు పెట్టుకుని వాహనాల్లో కత్తులు, కటార్లు ధరించి ముజఫర్నగర్వైపుగా వస్తే, మారణహోమం సృష్టిస్తే ఎందుకు నివారించలేకపోయారు? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు.
సోషల్ మీడియావల్లనే అంతా జరుగుతున్నదని చెప్పేవారు... తాము సైతం అదే మీడియాను ఉపయోగించుకుని అలాంటి శక్తుల ఆటకట్టించడానికి ఎందుకు ప్రయత్నించలేకపోతున్నారు? నిజానికి మన దేశంలో ఇంటర్నెట్ సెన్సారింగ్ గతంతో పోలిస్తే బాగా పెరిగింది. గత ఏడాది జూలై-డిసెంబర్లమధ్య మొత్తం 24,149 సమాచార అంశాలను తొలగించమని భారత ప్రభుత్వంనుంచి 2,285 వినతులు వచ్చాయని గూగుల్ సంస్థ తెలిపింది. తొలగించమని కోరిన అంశాల్లో చాలాభాగం ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సంబంధించినవేనని ఆ నివేదిక వివరించింది. కనుక ఇప్పుడు జరిగిన చర్చలో చిత్తశుద్ధిపాలు ఎంతన్న ప్రశ్న ఉదయిస్తుంది. మతతత్వాన్ని అరికట్టాల్సిందే. కానీ, అందుకు జాతీయ సమగ్రతా మండలి వంటి ముఖ్య వేదికలపై మరింత ఫలవంతమైన చర్చలు జరగాలి. రాబోయే ఎన్నికలకూ, ముజఫర్నగర్ ఘర్షణలకూ సంబంధం ఉన్నదని గుర్తించారు గనుక అలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలన్నీ దృష్టిపెట్టాలి.