రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం
2014లో 898 మంది ఆత్మహత్య
చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ వెల్లడి
ఆ సంఖ్య 200 మించదని అంటున్న ప్రభుత్వం
ఆర్థికంగా దివాలా, అప్పుల వల్లే ఈ దుస్థితి
హైదరాబాద్: రాష్ట్రంలో 2014లో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత ఏడాది 5,650 మంది ఆత్మహత్య చేసుకోగా... మహారాష్ట్రలో అత్యధికంగా 2,568 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, అప్పులు, ఆర్థికంగా దివాలా తీయడం, కుటుంబ సమస్యల కారణంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. రాష్ట్రంలో 23.2 శాతం మంది ఆర్థికంగా దివాలా తీయడం, అప్పుల కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారని బ్యూరో నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా వేసిన అంచనా ప్రకారం పంట నష్టం కారణంగా 16.8 శాతం మంది, వ్యవసాయ సంబంధిత సమస్యల కారణంగా 17.2 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పెళ్లి సంబంధిత సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అప్పులు, దివాలా కారణంగా ఎక్కువశాతం మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 41.8 శాతం మంది సన్నకారు రైతులు, 25.2 శాతం మధ్యతరహా రైతులు, 22.5 శాతం మంది చిన్నకారు రైతులు, 2.3 శాతం మంది పెద్ద రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక తెలంగాణలో 898 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ ప్రకటిస్తే ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య 200 కంటే ఎక్కువ ఉండబోదని చెబుతోంది.
దుర్భర పరిస్థితులే కారణం
రాష్ట్రంలో 2014-15లో వ్యవసాయరంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో గత ఖరీఫ్, రబీలో పూర్తిస్థాయిలో వర్షాలు కురవలేదు. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 498.1 మిల్లీమీటర్లు (30% లోటు) మాత్రమే నమోదైంది. అలాగే గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు రబీలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా... కేవలం 50.8 మిల్లీమీటర్లు (61% లోటు) నమోదైంది. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రబీలో ఆహార ధాన్యాల సాగు 10.41 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 8.13 లక్షల హెకార్టకే పరిమితమైంది. విస్తీర్ణం తగ్గడంతోపాటు వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు నష్టపోయారు. పైగా ప్రభుత్వం రుణమాఫీని సకాలంలో అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు దాదాపు గత ఖరీఫ్ ముగిసే వరకు కూడా కొత్త రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా గత వ్యవసాయ సంవత్సరంలో రైతులు సుమారు రూ. 18 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.