National Geophysical Research Institute
-
సాంకేతికతతో సమస్యల పని పట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. వాళ్ల ఆశలు కార్యరూపం దాల్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాది తో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ రాక్ మ్యూజియం’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ.. వినూత్న శాస్త్రీయ విధానాలతో సామాన్యులకు శాస్త్ర సాంకేతికతను మరింత చేరువ చేయవచ్చన్నారు. ఇలాంటి ఆలోచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించే అంశాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ అంటే చార్మి నార్, గోల్కొండ కాదని.. ఇదో సైన్స్ సిటీ అని అన్నారు. లక్నో, డెహ్రాడూన్ నగరాలకు పొంచి ఉన్న భూకంప ముప్పుపై రూపొందించిన మ్యాప్‌లను మంత్రి విడుదల చేశారు. రాక్ మ్యూజియంలో రకరకాల రాళ్లు ‘ఓపెన్ రాక్ మ్యూజియం’లో భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లనూ ప్రదర్శనకు పెట్టారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం త్యాగి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే వివరించారు. -
సూర్యాపేట: రాత్రి అయితే అక్కడ జాగారమే..!
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చిన్న శబ్దం వినిపించినా జంకుతున్నారు. అందుకు కారణం తరుచూ ఇక్కడ భూకంపాలు రావడమే. ప్రతి రోజు కనీసం 20 సార్లు భూమి నుంచి భారీ శబ్దాలు వినిపించడం, దృఢంగా కట్టిన ఇళ్ళు సైతం బీటలు వారడం, ఇంట్లో సామాగ్రి పడిపోతుండడంతో ఇళ్ళ నుంచి ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా చింతలపాలెం మండలంలో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వందల సార్లు స్వల్ప భూకంపాలు సంభవించాయి. అత్యధికంగా జనవరి 26న ఉదయం 3 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4.6గా భూకంప తీవ్రత నమోదయ్యింది. రాష్ట్రంలోనే దాదాపు 51ఏళ్ల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించడం ఇదే తొలిసారని ఎన్జీఆర్ఐ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క జనవరి నెలలోనే 300 సార్లు ప్రకంపనలు రాగా కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ భూ ప్రకంపనలు మొదలు కావడంతో ప్రజలు ధైర్యం కోల్పోతున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం 1గంట సమయంలో పెద్ద శబ్దాలతో భూమి కంపించగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. తరచూ వస్తున్న భూకంపాల తీవ్రతను అంచనా వేసేందుకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు ప్రభుత్వ పాఠశాలలో, పాత వెల్లటూరులో ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో రెండు భూకంప తీవ్రత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 100 కి.మీ వరకు భూప్రకంపన తరంగాలు వ్యాప్తిచెంది ఉంటాయని, భూ కంప గరిబనాభి ప్రాంతమైన వెల్లటూరు నుంచి సూర్యాపేట, నల్గొండ, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో భూకంపం ప్రభావం ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. కృష్ణపట్టిలోని సున్నపురాయి, ఇసుక రాయి ప్రాంతాల్లోని భూమి లోతుల్లో ఈ స్థాయి భూకంపం ఇదే ప్రథమం కావడంతో శాస్త్రవేత్తలు మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ భూకంప లేఖినిలతో ఎప్పటికప్పుడు భూకంప తీవ్రతను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భూమి లోపల ఏడు కిలోమీటర్ల లోతులోని పొరల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల పక్కనున్న రాతిపొరలను అధిగమించే క్రమంలో ఒత్తిడి, సర్దుబాటు కారణంగా ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూపొరల లోపల రాపిడి, ఒత్తిడి వల్ల తరుచూ భూప్రకంపనలు సంభవిస్తాయని అంచనా వేశారు. రెవిన్యూ అధికారులు మాత్రం భూకంప తీవ్రతపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి భూకంపం సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం వల్ల ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చని చెబుతున్నారు. అయితే వారికి ఎలాంటి అవహగన కల్పించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలు సాధారణ భూకంపాలని చెబుతున్నా ఆదిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
సిటీ గొంతులో గరళం
►గ్రేటర్లో కలుషితమవుతోన్న భూగర్భ జలం ►ఎన్జీఆర్ఐ అధ్యయనంలో వెల్లడి ►ముప్పు తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: నగరం గొంతులో గరళం పడుతోంది. ఇప్పటికే తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. కాలుష్య జలాలతో గొంతు తడుపుకొనే పరిస్థితి నెలకొంది. మండు టెండలకు గ్రేటర్లో భూగర్భ జలసిరి ఆవిరయ్యే విషమ పరిస్థితుల్లో ఇది మరో విపత్తు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడలు, వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు భయంకర మైన కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదికలో పేర్కొంది. 160 ప్రాంతాల్లో పరీక్షలు గ్రేటర్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఎన్జీఆర్ఐ నిగ్గుతేల్చడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను పరిశ్రమల యజమానులు స్థానిక చెరువులు, కుంటలు, ఖాళీ ప్రాంతాల్లోకి వదిలిపెడుతున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈ నీరంతా క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనంలో పేర్కొంది. 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలు దశాబ్ధాలు పీసీబీ నిర్లక్ష్యానికి అద్దంపట్టాయి. ఆందోళనకరంగా భారలోహాల ఉనికి.. పలు పారిశ్రామిక వాడల్లోని భూగర్భ జలాల్లో భారలోహలు ఉన్నట్టు ఎన్జీఆర్ఐ నిర్థారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణా రహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది. ప్రధానంగా ఖాజిపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో భారలోహాలైన లెడ్, క్యాడ్మియం, మాలిబ్డనం, ఆర్సినిక్ వంటి లోహాల ఉనికి బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నీటితో అనర్థాలే.. ►భార లోహాలున్న నీటిని తాగిన చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ►గర్భస్రావాలు జరిగే ప్రమాదం ఉంది. ► క్రోమియం వల్ల క్యాన్సర్ ముప్పు అధికం. ► శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులతో సమస్యలు తప్పవు. ►మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది. ►కాలేయం దెబ్బతింటుంది. ►ఈ నీటితో సాగుచేసిన కూరగాయలు తిన్నవారికి తీవ్ర అనారోగ్యం తప్పదు. -
సైన్స్‌తోనే క్వాలిటీ లైఫ్!
ఉప్పల్ : సైన్స్ తో పాటు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకుంటేనే పరిశోధన సంస్థలు పేరు తెచ్చుకుంటాయని పద్మభూషణ్ వీకే సరస్వత్ అన్నారు. ఉప్పల్‌లోని భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 55వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ ద్వారానే క్వాలిటీ లైఫ్ అందుతుందన్నారు. పాత రాతి యుగం నుండి నేటి వరకు మానవుడు అంచెలంచెలుగా ఎదగడానికి సన్సే కారణమన్నారు. అయితే, సైన్స్‌తో పాటు మానవ మనుగడకు హాని కలిగించే అంశాలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సమస్యతో పాటు ఆహారోత్పత్తుల సమస్య కూడా పెరుగుతుందని, వీటిని అదిగమించడానికి సైన్స్ తోడ్పడేవిధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని టెక్నాలజీ ద్వారానే అధిగమించవచ్చని సూచించారు. ప్రతి నిమిషంలో 30 మంది పట్టణాలకు వలస వస్తున్నారని దీని వల్ల పట్టణాలలో జనాభా అంతకంతకు పెరిగిపోతుందన్నారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు మరిన్నీ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన కొరతలను అధిగమించాలని సూచించారు. ఎన్జీఆర్ఐ డెరైక్టర్ వీఎం తివారీ మాట్లాడుతూ ఎన్జీఆర్ఐ జరిపిన పరిశోధన ఫలితాలను, అభివృద్ధిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, భాస్కర్‌రావు, సిస్మాలజీ హెచ్‌వోడీ సీనియర్ సైంటీస్ట్ నగేష్, షకీల్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని భూగర్భంపై పరిశోధన
ముందుకొచ్చిన ఎన్జీఆర్ఐ భూకంపాల ముప్పును పసిగట్టేందుకే విజయవాడ బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని పరిధిలో భూపొరల స్థితిగతుల్ని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,హైదరాబాద్) పరిశోధించనుంది. ఈ ప్రాంతం భూకంప జోన్-3లో ఉండడంతో భవిష్యత్తులో విపత్తు అవకాశాల్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎన్జీఆర్ఐని సంప్రదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భాన్ని స్కాన్ చేయొచ్చని ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు చెప్పడంతో దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్జీఆర్ఐ బృందం ముఖ్యమంత్రిని సైతం కలసి ఈ ప్రాజెక్టుపై చర్చించింది. త్వరలో నిర్ణయం 212 చదరపు కి.మీ పరిధిలోని ప్రతిపాదిత రాజధానిలో భూపొరల్ని స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డేటాను సేకరించాకే పనుల్ని చేపట్టాలని యోచిస్తోంది. భూగర్భ పొరల స్కానింగ్‌కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.