మ్యూజియంలో రాళ్లను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. వాళ్ల ఆశలు కార్యరూపం దాల్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాది తో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సీఎస్‌ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ రాక్ మ్యూజియం’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ.. వినూత్న శాస్త్రీయ విధానాలతో సామాన్యులకు శాస్త్ర సాంకేతికతను మరింత చేరువ చేయవచ్చన్నారు. ఇలాంటి ఆలోచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించే అంశాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ అంటే చార్మి నార్, గోల్కొండ కాదని.. ఇదో సైన్స్ సిటీ అని అన్నారు. లక్నో, డెహ్రాడూన్ నగరాలకు పొంచి ఉన్న భూకంప ముప్పుపై రూపొందించిన మ్యాప్‌లను మంత్రి విడుదల చేశారు.
రాక్ మ్యూజియంలో రకరకాల రాళ్లు
‘ఓపెన్ రాక్ మ్యూజియం’లో భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లనూ ప్రదర్శనకు పెట్టారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం త్యాగి, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment