సైన్స్ తో పాటు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకుంటేనే పరిశోధన సంస్థలు పేరు తెచ్చుకుంటాయని పద్మభూషణ్ వీకే సరస్వత్ అన్నారు.
ఉప్పల్ : సైన్స్ తో పాటు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకుంటేనే పరిశోధన సంస్థలు పేరు తెచ్చుకుంటాయని పద్మభూషణ్ వీకే సరస్వత్ అన్నారు. ఉప్పల్‌లోని భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) 55వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ ద్వారానే క్వాలిటీ లైఫ్ అందుతుందన్నారు. పాత రాతి యుగం నుండి నేటి వరకు మానవుడు అంచెలంచెలుగా ఎదగడానికి సన్సే కారణమన్నారు.
అయితే, సైన్స్‌తో పాటు మానవ మనుగడకు హాని కలిగించే అంశాలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సమస్యతో పాటు ఆహారోత్పత్తుల సమస్య కూడా పెరుగుతుందని, వీటిని అదిగమించడానికి సైన్స్ తోడ్పడేవిధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని టెక్నాలజీ ద్వారానే అధిగమించవచ్చని సూచించారు. ప్రతి నిమిషంలో 30 మంది పట్టణాలకు వలస వస్తున్నారని దీని వల్ల పట్టణాలలో జనాభా అంతకంతకు పెరిగిపోతుందన్నారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు మరిన్నీ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన కొరతలను అధిగమించాలని సూచించారు.
ఎన్‌జీఆర్‌ఐ డెరైక్టర్ వీఎం తివారీ మాట్లాడుతూ ఎన్‌జీఆర్‌ఐ జరిపిన పరిశోధన ఫలితాలను, అభివృద్ధిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, భాస్కర్‌రావు, సిస్మాలజీ హెచ్‌వోడీ సీనియర్ సైంటీస్ట్ నగేష్, షకీల్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.