national institute of engineering
-
కటాఫ్ ఎక్కువే!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి మార్చిలో నిర్వహించిన రెండవ విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ఫలితాలు ఈనెల చివరి వారంలో వెలువడనున్నాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన తొలివిడత సెషన్ పరీక్షలకు మాదిరిగానే ఈ రెండో విడతలోనూ ప్రశ్నలు ఒకింత మధ్యస్తంగా, సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.రెండో సెషన్లో 200 మార్కుల స్కోరు సాధించిన వారికి 90కి పైగా పర్సంటైల్ దక్కే అవకాశముంటుందని ప్రాథమిక కీ విడుదల అనంతరం ఆయా సబ్జెక్టుల నిపుణులు, కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన పిదప సవరణలతో తుది విడత కీ విడుదల సమయంలో తుది మార్కుల స్కోరు, పర్సంటైల్ ఖరారు అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జేఈఈ మెయిన్ కటాఫ్ ఓపెన్ కేటగిరీకి 90 నుంచి 100 పర్సంటైల్ వరకు ఉండవచ్చని, రిజర్వుడ్ కేటగిరీలో 60 నుంచి 70 పర్సంటైల్ మధ్య ఉండే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. 200 మార్కులు వచ్చే అభ్యర్థులు 90–100 పర్సంటైల్ సాధించగలుగుతారని చెబుతున్నారు. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభంగా ఉండటంతో జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ కన్నా ఈసారి కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని విడతలు ముగిసిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోరును అనుసరించి కటాఫ్ పర్సంటైల్‌ను ప్రకటించనున్నారు. 2018లో తక్కువ కటాఫ్ జేఈఈ మెయిన్‌లో 2019లోని కటాఫ్‌తో పోలిస్తే 2020 కటాఫ్‌లు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 2018 జేఈఈ మెయిన్‌లో ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ పర్సంటైల్ తక్కువగా ఉంది. జేఈఈ మెయిన్ 2017లో కటాఫ్ పర్సంటైల్ మళ్లీ అధికంగానే ఖరారైంది. ఆ కటాఫ్ గణాంకాలు పరిశీలిస్తే ఏమేరకు పెరుగుదల, తగ్గుదల ఉందో స్పష్టమవుతుంది. -
గూడెంలోనే నిట్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏర్పాటుకు తాడేపల్లిగూడెంలో భూమి కేటాయించారు. ఈ విషయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీలో జిల్లాకు నిట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కాని ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. గూడెంలో నిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆదివారం సీఎం ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్రం విడిపోయాక జాతీయ స్థారుు విద్యా సంస్థ నిట్‌ను గూడెంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 618 ఎకరాల స్థలం కేటాయించారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు పంచాయతీ పరిధిలోని విమానాశ్రయ భూముల్లో 244 ఎకరాలు, వె ఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిపాలన భవనాలు వెనుక ఉన్న ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ భూములలో 374 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ భూములను పరిశీలించడానికి రావలసిందిగా మానవవనరుల అభివృద్ధి శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహానీ రెండు రోజుల క్రితమే లేఖ రాసినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదిక అనంతరం భవనాల ప్లానులను తయారు చేస్తారు. అనంతరం టెండర్ల ప్రక్రియ ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. దేశంలో 30 నిట్లు ఉండగా గూడెంలో ఏర్పాటుతో ఆ సంఖ్య 31కు చేరనుంది. ప్రాంతీయ భిన్నత్వం , బహు సంస్కృతి అవగాహన కోసం నిట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిట్లు ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాలలో బ్యాచిలర్స్ , మాస్టర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి. మంత్రి మాణిక్యం హ ర్షం గూడెంకు నిట్‌ను కేటాయించడం మంత్రి మాణిక్యాలరావు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫోన్లో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. జిల్లాకు ప్రత్యేక హోదాను ఇస్తానని ప్రకటించిన సీఎం జిల్లాలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి అన్నారు.