గూడెంలోనే నిట్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏర్పాటుకు తాడేపల్లిగూడెంలో భూమి కేటాయించారు. ఈ విషయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీలో జిల్లాకు నిట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కాని ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. గూడెంలో నిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆదివారం సీఎం ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్రం విడిపోయాక జాతీయ స్థారుు విద్యా సంస్థ నిట్‌ను గూడెంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 618 ఎకరాల స్థలం కేటాయించారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు పంచాయతీ పరిధిలోని విమానాశ్రయ భూముల్లో 244 ఎకరాలు, వె ఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిపాలన భవనాలు వెనుక ఉన్న ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ భూములలో 374 ఎకరాలు కేటాయించనున్నారు.
ఈ భూములను పరిశీలించడానికి రావలసిందిగా మానవవనరుల అభివృద్ధి శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహానీ రెండు రోజుల క్రితమే లేఖ రాసినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదిక అనంతరం భవనాల ప్లానులను తయారు చేస్తారు. అనంతరం టెండర్ల ప్రక్రియ ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. దేశంలో 30 నిట్‌లు ఉండగా గూడెంలో ఏర్పాటుతో ఆ సంఖ్య 31కు చేరనుంది. ప్రాంతీయ భిన్నత్వం , బహు సంస్కృతి అవగాహన కోసం నిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. నిట్‌లు ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాలలో బ్యాచిలర్స్ , మాస్టర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి.
మంత్రి మాణిక్యం హ ర్షం
గూడెంకు నిట్‌ను కేటాయించడం మంత్రి మాణిక్యాలరావు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫోన్‌లో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. జిల్లాకు ప్రత్యేక హోదాను ఇస్తానని ప్రకటించిన సీఎం జిల్లాలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి అన్నారు.